అరాచకపాలన తప్ప.. అభివృద్ధి ఏది?

ABN , First Publish Date - 2022-12-07T23:12:49+05:30 IST

వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, బెదిరింపులు, కేసులతో అరాచకాలు తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదని టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు.

అరాచకపాలన తప్ప.. అభివృద్ధి ఏది?
ఇదేం ఖర్మమనరాష్ట్రానికి కార్యక్రమ ర్యాలీలో మాలేపాటి తదితరులు

కావలి, డిసెంబరు 7: వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, బెదిరింపులు, కేసులతో అరాచకాలు తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదని టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. క్లస్టర్‌ ఇన్‌చార్జి మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో పట్టణంలోని 26వ వార్డులో బుధవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమంలో మాలేపాటి పాల్గొన్నారు. వార్డులో ర్యాలీ నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఏ వార్డుకు వెళ్లినా పందులు, తాగునీరు, విద్యుత్‌ సమస్యలు ఉన్నాయన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడా రోడ్డు వేయడం కాదుకదా రోడ్డుపై ఉన్న గుంటలను కూడా పూడ్చిన పాపాన పోలేదన్నారు. గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు బ్రహ్మరథం పలుకుతున్నారని ఎమ్మెల్యే చెపుతున్నారని, ఏమి అభివృద్ధి చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని ప్రజలు భయపడుతున్నారని, అదంతా తమ బలమనే భ్రమలో వైసీపీ నేతలు ఉన్నారన్నారు. ఆ భ్రమలు తొలగి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నింటి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి కడుపు నిండా తినలేని పరిస్థితులలో రాష్ట్రానికి పట్టిన ఈ ఖర్మ ఎపుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. ఈ వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సంక్షేమ పథకాల అమలుతోపాటు రాష్ట్రాభివృద్ధి జరిగి సమర్ధవంతమైన పాలన అందించాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తికొండ కిషోర్‌, జ్యోతిబాబూరావు, యేగూరి చంద్రశేఖర్‌, కుందుర్తి కిరణ్‌, రఫీ, పులివర్తి రవీంద్ర, గొట్టిపాటి కొండపనాయుడు, పల్లపు కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:12:51+05:30 IST