పన్ను బకాయి వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-02-20T04:53:37+05:30 IST

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో పన్ను వసూలుపై దృష్టి సారించిన నగర పాలక సంస్థ అధికారులు మొండి బకాయిదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఎన్‌ఎంసీ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు నగరంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు.

పన్ను బకాయి వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌
చెక్కును అందుకుంటున్న కమిషనర్‌ దినేష్‌కుమార్‌

 స్పందించని ఓ ప్రముఖ హోటల్లోని స్వీట్స్‌ షాపు సీజ్‌ 

 వస్త్ర షాపింగ్‌ మాల్‌ నుంచి రూ. 34 లక్షల వసూలు

నెల్లూరు(సిటీ), ఫిబ్రవరి 19 :  ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో పన్ను వసూలుపై దృష్టి సారించిన నగర పాలక సంస్థ అధికారులు మొండి బకాయిదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఎన్‌ఎంసీ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు నగరంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. మద్రాసు బస్టాండ్‌ వద్దనున్న ఓ ప్రముఖ హోటల్‌ నుంచి రావాల్సిన రూ. 35 లక్షల పన్ను  వసూలుకు పట్టుబట్టారు. హోటల్‌ యాజమాన్యం నుంచి స్పందన రాకపోవడంతో అందులోని స్వీట్స్‌ దుకాణాన్ని సీజ్‌ చేశారు. అనంతరం పన్ను వసూలుకు తుది గడువు విధించారు. అనంతరం గాంధీబొమ్మ కూడలి సమీపంలో ఓ ప్రముఖ వస్త్ర షాపింగ్‌ మాల్‌కు వెళ్లారు. పన్ను బకాయిని చెల్లించాలన్నారు. లోపలున్న వినియోగదారులను బయటకు పంపేశారు. అక్కడే బైఠాయించి పన్ను బకాయిని కట్టితీరాల్సిందేనంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఊపిరితిప్పుకోలేని ఆ యాజమాన్యం రూ. 34 లక్షల చెక్కును అందించింది.

టిడ్కో గృహాల రిజిస్ర్టేషన్‌ ఖర్చులు ప్రభుత్వానివే

 టిడ్కో గృహాల రిజిస్ర్టేషన్‌ ఖర్చులను ప్రభుత్వమే భరాయిస్తుందని ఎన్‌ఎంసీ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో గృహ లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడ్కో  ఇళ్లను పొందిన వారు ఎలాంటి ఇతర ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఐదుగురికి ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేయించామని తెలిపారు. 300 చదరపు అడుగుల ఇంటిని మాత్రమే పూర్తి ఉచితంగా అందజేస్తామన్నారు. మిగతా వాటిని లబ్ధిదారుని వాటా, బ్యాంకు రుణాల చెల్లింపుతో ఇస్తున్నట్లు తెలిపారు.  లబ్ధిదారులకు ఏమైనా అనుమానాలుంటే అధికారులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు.


Updated Date - 2022-02-20T04:53:37+05:30 IST