ఫుడ్‌ లైసెన్స్‌ లేకుంటే బాదుడే..!

ABN , First Publish Date - 2022-06-12T03:47:40+05:30 IST

వీధి వ్యాపారుల నుంచి టీ కొట్టు, హోటల్‌ వరకు ఇక అన్నింటికీ ఫుడ్‌ లైసెన్స్‌ తప్పని సరిగా ఉండాల్సిందే.

ఫుడ్‌ లైసెన్స్‌ లేకుంటే బాదుడే..!
దుకాణం

వీధి వ్యాపారుల నుంచి హోటళ్ల వరకు..

నిబంధనలు కఠినతరం చేసిన కేంద్రం

సీతారామపురం, జూన్‌ 11 : వీధి వ్యాపారుల నుంచి టీ కొట్టు, హోటల్‌ వరకు ఇక అన్నింటికీ ఫుడ్‌ లైసెన్స్‌ తప్పని సరిగా ఉండాల్సిందే. ఒకవేళ అధికారుల తనిఖీలో లైసెన్సు లేకుంటే పెనాల్టీల బాదుడు తప్పదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేసింది. అందులో భాగంగా తరచూ తనిఖీలు చేయాలని, ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చర్యలు చేపట్టాలని ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుడికి నాణ్యమైన ఆహారంతోపాటు, పరిశుభ్రత పాటించాలనే ఉద్దేశంతో ఫుడ్‌ సేఫ్టీస్‌ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 2006లోనే ఈ చట్టం తీసుకొచ్చినప్పటికీ 2011 నుంచి దాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే ఈ చట్టం క్షేత్రస్థాయిలో సరిగా అమలు కావడం లేదన్న అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కొత్తగా ఉత్తర్వులను విడుదల చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ చట్టం ద్వారా కేసు నమోదైతే కోర్టు ద్వారా నోటీసులు జారీ చేస్తారు. కేసులు నమోదు చేసే బాధ్యత ఫుడ్‌ సేఫ్టీ అధికారులదే. అపరాధ రుసుం కూడా విధిస్తారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లాలో సుమారు 17 వేలకు పైగా ఆహారంతోపాటు, వివిధ రకాల పదార్థాలను విక్రయించే షాపులు, తోపుడు బండ్లు వంటివి ఉన్నాయి. వీధి వ్యాపారులు కూడా దీని పరిధిలోకే వస్తారు. మంచినీటి ప్యాకెట్‌తోపాటు, మజ్జిగ విక్రయించే వారు కూడా లైసెన్స్‌ను తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో కేవలం 2000 మంది మాత్రమే తమ వ్యాపారాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా వారిలో వందల మంది మాత్రమే లైసెన్స్‌ను పొందినట్లు సమాచారం. వీటిలో పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి ఎక్కువగా ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం వ్యాపారాన్ని బట్టి అందరూ ఐదేళ్లకు ఒకసారి లైసెన్సు పొందాల్సి ఉంటుంది.

Read more