సంగం బ్యారేజీ పనుల్లో అపశ్రుతి
ABN , First Publish Date - 2022-08-09T05:57:12+05:30 IST
చివరి దశలో ఉన్న సంగం బ్యారేజీ పనుల్లో సోమవారం అపశ్రుతి చోటు చేసుకుంది.

ఇనుప గేటు పడి యువకుడి మృతి
క్రేన్‌తో బిగిస్తుండగా వైరు తెగి దుర్ఘటన
సంగం, ఆగస్టు 8: చివరి దశలో ఉన్న సంగం బ్యారేజీ పనుల్లో సోమవారం అపశ్రుతి చోటు చేసుకుంది. కంబైన్డ్ రెగ్యులేటర్ల ఇనుప గేట్లు ఎత్తుతుండగా ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు, బ్యారేజీ మేనేజర్ ఆనంద్ కథనం మేరకు, సంగం బ్యారేజీ నిర్మాణంలో భాగంగా గేట్లు బిగించేందుకు బిహార్‌కు చెందిన కొంత మంది యువకులు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో గేటును క్రేన్‌తో ఏర్పాటు చేస్తుండగా గేటుకు కట్టిన వైరు తెగిపోయి గేటు కింద పడింది. 13 టన్నుల బరువున్న ఇనుప గేటు అక్కడ పనిచేస్తున్న బిహార్‌కు చెందిన జయలాల్ (30)పై పడింది. వెంటనే జయలాల్ను సంగం వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్య సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వవారు బిహార్‌లో ఉండడంతో సమాచారం అందించారు.
