సంఘర్షణ యాత్ర

ABN , First Publish Date - 2022-08-05T04:53:23+05:30 IST

ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేస్తుందని, యువతను గాలికి వదిలేసిందని నిరసిస్తూ బీజేవైఎం గురువారం చేపట్టిన యువ సంఘర్షణ యాత్ర ఉద్రిక్తతల మధ్య సాగింది.

సంఘర్షణ యాత్ర
బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

దారి మళ్లించాలన్న పోలీసులు

మార్గం మార్చేదిలేదన్న బీజేపీ నేతలు

పోలీసులతో వాగ్వాదం, తోపులాట

రోడ్డుపై బైఠాయింపు



నెల్లూరు(స్టౌనహౌస్‌పేట), ఆగస్టు 4:  ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేస్తుందని, యువతను గాలికి వదిలేసిందని నిరసిస్తూ బీజేవైఎం గురువారం చేపట్టిన యువ సంఘర్షణ యాత్ర  ఉద్రిక్తతల మధ్య  సాగింది. మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర  తిరుపతి జిల్లా నుంచి నెల్లూరుకు చేరింది. యాత్రలో భాగంగా  నగరంలోని అయ్యప్పగుడి నుంచి  ప్రారంభమైన మోటారు బైక్‌ల ర్యాలీలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వేదాయపాళెం వద్ద బాబూ జగ్జీవనరామ్‌ విగ్రహానికి సత్యకుమార్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాగా కేవీఆర్‌ పెట్రోలు బంకు వద్దకు ర్యాలీ చేరుకోగానే దారి మళ్లించాలని పోలీసులు చెప్పారు.  అందుకు నేతలు ఒప్పుకోకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.


స్పృహ కోల్పోయిన భరత


నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు జీ భరతకుమార్‌ యాదవ్‌  ర్యాలీలో స్పృహ కోల్పోయారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు ముందుకు వెళ్లకుండా నెట్టేశారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.  అరగంటకు పైగా  నిరసన సాగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు భరతకుమార్‌ను జయభారత ఆసుపత్రికి తరలించారు. అనంతరం బీజేపీ నాయకులు ముందు అనుకున్న మార్గంలోనే ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బీజెపీ నాయకులు సురేంద్రరెడ్డి, ఆంజనేయరెడ్డి, సురేష్‌రెడ్డి, యశ్వంతసింగ్‌, మిడతల రమేష్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-05T04:53:23+05:30 IST