దారులన్నీ దర్గా వైపే!

ABN , First Publish Date - 2022-08-12T06:34:53+05:30 IST

నేల ఈనిందా... ఆకాశానికి చిల్లుపడిందా!? అన్న రీతిలో గురువారం నెల్లూరు నగరానికి భక్తజనం పోటెత్తింది.

దారులన్నీ దర్గా వైపే!
గురువారం తెల్లవారుజామున బారాషహీద్‌ దర్గాలో సమాధులకు గంధం ఎక్కిస్తున్న కడప పీఠాధిపతి ఆరీఫుల్లా ... గురువారం సాయంసంధ్యవేళ స్వర్ణాల చెరువు తీరంలో భక్తజనసందోహం

 భారీగా తరలివచ్చిన భక్తజనం

భక్తిశ్రద్ధలతో గంధమహోత్సవం


నెల్లూరు (సాంస్కృతికం) ఆగస్టు 11 : నేల ఈనిందా... ఆకాశానికి చిల్లుపడిందా!? అన్న రీతిలో గురువారం నెల్లూరు నగరానికి భక్తజనం పోటెత్తింది. దేశం నలుమూలల నుంచి రొట్టెల పండుగకు యాత్రికులు తరలిరావడంతో బారాషహీద్‌ దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. ఈ ఒక్క రోజు సుమారు రెండు లక్షల మందికిపైగా భక్తులు వచ్చి ఉంటారని అంచనా. కాగా, పండుగలో ప్రధాన ఘట్టం గంధమహోత్సవం బుధవారం అర్ధరాత్రి తర్వాత వేడుకగా జరిగింది. కోటమిట్టలోని అమీనియా మసీదులో 12 బిందెల్లో గంధం కలిపి ప్రత్యేక పూలరథంలో ఊరేగింపుగా బారాషహీద్‌ దర్గాకు తీసుకువచ్చారు. అక్కడ గంధపు  బిందెలను ఉంచి బారాషహీద్‌ల వీరగాథలను కొనియాడి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కడప పీఠాధిపతి ఆరీఫుల్లా(అమీన్‌పీర్‌) అమరవీరుల సమాధులకు గంధం పూశారు. తదుపరి దువా నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి  రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా గురువారం తెల్లవారుజాము నుంచి రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఈ మేరకు భక్తులు కూడా రొట్టెలు మార్చుకున్నారు. ఊహించినట్టుగా భక్తులు తరలిరావడంతో నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రెవెన్యూ, కార్పొరేషన్‌, పోలీసు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.


బీజేపీకి మనసు మారాలి

బీజేపీకి మనసు మారి, జగనన్నకు పూర్తి సహకారం అందించేలా చూడాలని బారాషహీదులను కోరుకుంటూ  నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రొట్టెను పట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రయోజనాలను తీర్చడంతోపాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బీజేపీ కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రం సుభిక్షంగా కోరుకుంటూ జడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, మేయర్‌ స్రవంతి వేర్వేరుగా వరాల రొట్టెలను పట్టుకున్నారు.


రొట్టెలు పట్టుకున్న ప్రముఖులు

స్వర్ణాల చెరువులో పలువురు ప్రముఖులు కోరికలు రొట్టెలను పట్టుకున్నారు. బారాషహీద్‌ దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు.  రాష్ట్ర అడ్వొకేట్‌ జర్నల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో  కలిసి దర్గాకు వచ్చారు. రాష్ట్ర సంక్షేమం కోసం రొట్టెలు పట్టి, బారాషహీదులను దర్శించుకున్నారు. అలాగే కలెక్టర్‌ చక్రధర్‌బాబు, దర్గాలో ప్రత్యేక పూజలు చేసి మత పెద్దల ఆశీర్వాదం పొందారు. ఆయన వెంట కమిషనర్‌ హరిత, మైనారిటీ సంక్షేమ అధికారి కనకదుర్గా, జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. పవనన్న ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌ రెడ్డి ఆ పార్టీ నాయకులు రొట్టెలు పట్టుకుని దర్గాలో పూజలు చేశారు.  వినూత్నంగా రేబిస్‌ రహిత భారత్‌ పేరుతో మిత్రమండలి, పీఎంపీ అసోసియేషన్‌ రొట్టెను పట్టుకుంది.  


Updated Date - 2022-08-12T06:34:53+05:30 IST