రామాయపట్నంలో ఇండోసోల్‌ పరిశ్రమ

ABN , First Publish Date - 2022-09-18T05:23:00+05:30 IST

రామాయపట్నం పరిసరాల్లో ఇండోసోల్‌ కంపెనీ భారీ పరిశ్రమను స్థాపించనుంది

రామాయపట్నంలో  ఇండోసోల్‌ పరిశ్రమ

అమెరికా, ఇండియా భాగస్వామ్యంతో డీపీఆర్‌ సిద్ధం 

సోలార్‌ మాడ్యులేటర్లు, ప్యానళ్లు, పరికరాల తయారీ పరిశ్రమ 

రూ.45వేల కోట్లు, 1250 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ 


కందుకూరు, సెప్టెంబరు 17 : రామాయపట్నం పరిసరాల్లో ఇండోసోల్‌ కంపెనీ భారీ పరిశ్రమను స్థాపించనుంది. అమెరికాలో పేరెన్నికగన్న ఓ భారీ సోలార్‌ సంస్థతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త భాగస్వామ్య ఒప్పందంతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు రూపకల్పన జరిగింది. ఆ సంస్థ డీపీఆర్‌కు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించడంతోపాటు వారికి అవసరమైన వనరులు సమకూర్చేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. సోలార్‌ పవర్‌ ప్లాంట్స్‌కి అవసరమైన మాడ్యులర్స్‌, సోలార్‌ ఫ్యానెళ్లు, ఇతర పరికరాలను తయారు చేసే సంస్థగా ఇండోసోల్‌ గుర్తింపు పొందింది. రూ.45వేల కోట్ల  బడ్జెట్‌తో ఈ పరిశ్రమ స్థాపించాలనేది సంస్థ ప్రాథమిక అంచనా కాగా అవసరమైతే రూ.57 వేల కోట్ల వరకు పెంచుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. పరిశ్రమ ఏర్పాటుకు 1250 ఎకరాల భూమిని రామాయపట్నం పరిసరాల్లో సమకూర్చాలని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. 40 రోజుల క్రితమే ఇండోసోల్‌ సంస్థ ప్రతినిధులు రామాయపట్నం పరిసర ప్రాంతాలు, పోర్టు నిర్మాణ ప్రదేశాలను పరిశీలించటంతోపాటు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డిని కూడా కలిసి తమ ప్రాజెక్టు గురించి వివరించారు. 

 

రంగంలోకి ఏపీఐఐసీ

కాగా ఇండోసోల్‌ పరిశ్రమ స్థాపనకు 1250 ఎకరాలు అవసరమని కంపెనీ యాజమాన్యం ప్రభుత్వానికి నివేదించటంతో వారు గుర్తించిన పరిసరాల్లో అనువైన భూమిని సేకరించేందుకు ఏపీఐఐసీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఒక భారీ పరిశ్రమ ఏర్పాటైతే దానికి అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉన్నందున 2వేల ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా ప్రాథమికంగా సేకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఇండోసోల్‌ పరిశ్రమ ఏర్పాటు జరిగితే పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.  

Updated Date - 2022-09-18T05:23:00+05:30 IST