సాగుకు సమాయత్తం!

ABN , First Publish Date - 2022-11-28T22:57:37+05:30 IST

రాళ్లపాడు ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులో పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో కుడి, ఎడమ కాలువల కింది అధికారికంగా 16,600 ఎకరాలు ఉండగా అనధికారికంగా మరో 9 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు మొత్తం గతంలో వరి సాగు చేసేవారు.

సాగుకు సమాయత్తం!
రాళ్లపాడు ప్రాజెక్టు

వరి సాగుకు కేవలం నాలుగైదు గ్రామాల్లోనే ఆసక్తి

ఆరుతడి పంటలకే ‘రాళ్లపాడు’ నీరంటున్న అధికారులు

లింగసముద్రం, నవంబరు 28 : రాళ్లపాడు ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులో పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో కుడి, ఎడమ కాలువల కింది అధికారికంగా 16,600 ఎకరాలు ఉండగా అనధికారికంగా మరో 9 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు మొత్తం గతంలో వరి సాగు చేసేవారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన నీరు ఆరుతడి పంటలకేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో 90 శాతం పైగా ఆయకట్టు రైతులు పత్తి పంట సాగుకు సుముఖత వ్యక్తం చేస్తుండగా, కేవలం నాలుగైదు గ్రామాల రైతులు మాత్రమే వరి పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. కుడి కాలువ పరిధిలోని జంగాలపల్లి, మేదరమెట్లపాలెం, పెదపవని, చినపవని, ఎడమ కాలువ పరిధిలోని చీమలపెంట గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఆయా గ్రామాల్లో రైతులు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసి నారుమడులు సిద్ధం చేస్తున్నారు. అయితే వరి పంటకు నీరు సరిపోదని అధికారులు అంటుండడంతో చివరి దశలో నీటి తడులు తక్కువైతే బోర్ల ద్వారా నీటిని సరఫరా చేసి పండించుకుంటామని రైతులు చెబుతున్నారు. గత ఏడాది కూడా వరి సాగుకు నీరు సరిపోదన్న ఉద్దేశ్యంతో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో ఆయకట్టు పరిధిలోని రైతులందరూ మూకుమ్మడిగా పత్తి సాగు చేశారు. అయితే అనూహ్యంగా పత్తి దిగుబడులు అధికంగా ఉండడం, ధరలు కూడా క్వింటా పత్తి సుమారు రూ.12 వేలకు పైగా పలికింది. దీంతో రైతులు మంచి లాభాలు పొందారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎడమ కాలువ పరిధిలోని వాకమళ్లవారిపాలెం, పెంట్రాల, గంగపాలెం, కుడి కాలువ పరిధిలోని అన్నెబోయినపల్లి, అంగిరేకులపాడు, సీతారాంపురం, దారకానిపాడు, రాళ్లపాడు, గుళ్లపాలెం తదితర గ్రామాల పరిధిలో సుమారు 20 వేల ఎకరాల్లో పత్తి సాగుకు రైతులు సమాయత్తవుతున్నారు. అయితే పొలాలు బురదగా ఉన్నందున వచ్చే నెలలో పత్తి సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా కుడి కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు ఎడమ కాలువకు విడుదల చేయకపోవడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. తక్షణం ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని కోరుతున్నారు.

ప్రాజెక్టులో నీటిమట్టం

20.6 అడుగుల సామర్ధ్యం గల రాళ్లపాడు ప్రాజెక్టులో ప్రస్తుతం 17.4 అడుగుల నీరు ఉంది. ఈనెల 23వ తేదీ నాటికి 16.4 అడుగుల నీటిమట్టం నమోదు కాగానే అధికారులు కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. కాగా సోమశిల ఉత్తర కాలువ నుంచి 120 కూసెక్కులు, మన్నేరు ఎగువ భాగం నుంచి 80 కూసెక్కుల మేర నీరు ప్రాజెక్టుకు చేరుతుంది. అయితే ప్రాజెక్టులో ప్రస్తుతం ఇద్దరు లస్కర్లు మాత్రమే ఉన్నందున కాలువపై నీటి పర్యవేక్షణకు తాత్కాలికంగానైనా మరి కొంతమంది సిబ్బందిని నియమించాలని ఆయకట్టు రైతుల కోరుతున్నారు.

Updated Date - 2022-11-28T22:57:39+05:30 IST