ఆదరణ కోల్పోతున్న నీటి నాణ్యత ప్రయోగశాల

ABN , First Publish Date - 2022-02-24T04:11:20+05:30 IST

ఐదు మండలాలకు కేంద్రంగా పనిచేస్తున్న పొదలకూరు గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ, నీటి నాణ్యత పరిశీలనా శాఖ ఆదరణ కోల్పోతుంది.

ఆదరణ కోల్పోతున్న నీటి నాణ్యత ప్రయోగశాల

పొదలకూరు రూరల్‌, ఫిబ్రవరి 23 : ఐదు మండలాలకు కేంద్రంగా పనిచేస్తున్న పొదలకూరు గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ, నీటి నాణ్యత పరిశీలనా శాఖ ఆదరణ కోల్పోతుంది. 2012లో ఎంతో ముందుచూపుతో ప్రారంభమైన ఈ పరిశీలనా శాల పరిధిలో పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం, చేజర్ల, సంగం మండలాల పరిధిలోని గ్రామాలు ఉన్నాయి. కాలక్రమంలో ప్రతి గ్రామంలోనూ ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుతో ఈ ప్రయోగశాల ప్రాధాన్యత కొంత తగ్గిందనే చెప్పాలి. సాధారణంగా గ్రామంలోని తాగునీటి వనరులను ఈ కేంద్రం పరీక్ష చేసి, అందులోని హాని కారకాలను గుర్తించి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌కు తెలుపుతోంది. అనంతరం ఈ కేంద్రం ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రంలో మైక్రో బయోలజిస్టు, రసాయన శాస్త్రజ్ఞుడు, క్షేత్ర సహాయకులు, మరో ఇద్దరు ఉంటారు. గ్రామాల్లో  ఏదైనా వ్యాధులు ప్రబలినప్పుడు, నీరు కలుషితమైనపుడు ఈ పరిశీలనా శాల వాటిని గుర్తించి, ఆ బ్యాక్టీరియాను తొలగించడానికి క్షేత్రస్థాయిలో సూచనలు చేస్తుంది. ప్రస్తుతం వాటర్‌ ప్లాంట్ల వలన ఈ కేంద్రంలో పెద్దగా పనిలేకుండా పోయింది. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని దళిత, గిరిజన కాలనీల ప్రజలకు ఈ కేంద్రం ద్వారా అన్ని సేవలూ అందుతున్నాయి. కాకపోతే ప్రజలు స్థానికంగా దొరికే నీటిని వాడినా, వాడకపోయినా కూడా నెలకు 300 శాంపిల్స్‌ సేకరించి, పరిశీలించాల్సి ఉంటుంది.

Read more