సరికొత్త యాప్‌లు.. డిజిటల్ పేమెంట్లు!
ABN , First Publish Date - 2022-10-18T04:55:37+05:30 IST
క్రికెట్ బెట్టింగ్ కొత్త రంగు పులుముకుంది. గతంలోలా ఓ ప్రాంతంలో ఉండి నగదును నేరుగా ఒకరితో ఒకరు ఎదురెదురుగా బెట్టింగ్ కాసే పరిస్థితులు లేవు.
క్రికెట్ బెట్టింగ్‌ల కోసం మాఫియా సన్నద్ధం
అంతా ఆనలైనలోనే లావాదేవీలు
యువతే టార్గెట్‌గా మాఫియా వల
తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలంటున్న నిపుణులు
టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ సందడి మొదలైంది. ఇప్పటికే వామప్ మ్యాచలు ఆరంభమవగా, ఈ మ్యాచలు చూసేందుకు అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక బెట్టింగ్ రాయుళ్లూ రంగంలోకి దిగారు. ఒకప్పటిలా కాకుండా ఈసారి కొత్త యాప్‌లు.. డిజిటల్ పేమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఫేవరెట్ క్రికెట్ జట్ల మధ్య పోరు.. మొత్తం మ్యాచలో ఏ జట్టు ఎంత స్కోరు చేస్తుంది!? పదవ ఓవర్‌కల్లా ఎన్ని పరుగులు చేస్తారు. ఒక ఓవర్లో ఎన్ని పరుగులు తీస్తారు!? బ్యాట్స్‌మన సిక్స్ కొడతాడా!? బంతిని బౌండరీలు దాటిస్తారా!? వికెట్లు ఎప్పుడు పడతాయి!? ఇలా అనేక అంశాలపై పందేనికి సై అనిపిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ వరల్డ్‌కప్ ముగిసే సరికి బెట్టింగ్‌లలో ఎంతమంది సర్వం పొగొట్టుకుని రోడ్లపైకి చేరుతారో వేచిచూడాలి.
నెల్లూరు (క్రైం), అక్టోబరు 17 : క్రికెట్ బెట్టింగ్ కొత్త రంగు పులుముకుంది. గతంలోలా ఓ ప్రాంతంలో ఉండి నగదును నేరుగా ఒకరితో ఒకరు ఎదురెదురుగా బెట్టింగ్ కాసే పరిస్థితులు లేవు. జూదగాళ్లు హోటళ్లలోని గదులను అద్దెకు తీసుకొని ఫలానా మ్యాచకు ఇంత, ఆ ఓవర్‌కు ఇన్ని పరుగులు, ఈ బాల్‌కు ఇంత స్కోర్ అంటూ నేరుగా డబ్బులు కలుపుకునే పరిస్థితులు బాగా తగ్గాయి. అలాగని అవి జరగడం లేదని కాదు. కొందరు జూదగాళ్లు ఇప్పటకీ పాత పద్ధతినే అవలంభిస్తున్నారు. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పరుగులు తీస్తుండటంతో బెట్టింగ్ విధానంలోనూ మార్పులు వచ్చాయి. ప్రత్యేకంగా క్రికెట్ బెట్టింగ్ కోసం యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. చేతిలో మొబైల్ ఉంటే చాలు ఎక్కడ ఉన్నా బెట్టింగ్ సాగిపోతోంది. బెట్టింగ్ నిర్వహించే వారు యాప్‌ల వివరాలు తెలిపి ముందుగా అడ్వాన్సుగా రూ.5వేలు మొదలు ఆ తర్వాత ఎంతైనా ఫోనపే, గూగుల్‌పే ద్వారా తమ ఖాతాలో జమ చేయాలని సూచిస్తూ అందుకు తగ్గ మొబైల్ నెంబర్లు ఇస్తారు. నగదు జమ అయ్యాక బెట్టింగ్ కాసుకునే అవకాశం కల్పిస్తారు. బెట్టింగ్ ముఠా ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ దోపిడీకి పాల్పడుతోంది. కాగా, బెట్టింగ్ యాప్‌లు నిర్వహించేది ఎవరు? ఆనలైన ద్వారా బదిలీ చేసే నగదు ఎవరికి వెళుతుంది!? ఇలాంటి వివరాలేవీ తెలియవు. అయినా బెట్టింగ్ మత్తులో పడి వేలు, లక్షల రూపాయలను బదిలీ చేస్తూ ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఫ్యాన్సీలు.. రేటింగ్‌లు
యాప్‌లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే సమయంలో మ్యాచ ప్రారంభానికి ముందే ఆడే జట్టును బట్టి రేటింగ్ పెడతారు. మ్యాచ ప్రారంభం నుంచి చివరి వరకు బెట్టింగ్ ఆడే అవకాశం యాప్‌లలో ఉంటుంది. యాప్‌లో చూపించే రేటింగ్ ప్రకారం పందెం కాయొచ్చు. ఇవి కాకుండా ఫ్యాన్సీలు ఉంటాయి. ఒక ఓవర్లో అన్ని పరుగులు తీయలేరు.. తీస్తారు.. బ్యాట్స్‌మన సిక్స్ కొడతాడు.. బౌండరీలు చేస్తాడు. 10 ఓవర్లలో ఆ జట్టు ఇన్ని పరుగులు చేస్తుంది. ఇలా ఫ్యాన్సీలు ఆడుకునే అవకాశం ఉంటుంది.
యువతే బానిస
క్రికెట్ బెట్టింగ్ వైపు యువతే ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. ప్రధానంగా కళాశాలల్లో చదువుకునే యువకులు సెల్ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, బంగారు గొలుసులు, బైక్‌లు, కార్లు అధిక వడ్డీలకు కుదవ పెట్టి పందెం కాస్తున్నారు. బాల్ బాల్‌కు రేటింగ్‌ల ప్రకారం బెట్టింగ్‌లో పాల్గొంటున్న యువకులు మ్యాచ చివరకు వచ్చే సరికి నగదును పోగొట్టుకుంటున్నారు. యువతతోపాటు ఈ వ్యసనానికి బానిస అవుతున్న ఎంతోమంది కష్టపడిన సొమ్ముతోపాటు ఇళ్లలోని ఉన్న సొమ్ము, బంగారు ఆభరణాలను సైతం కుదవపెట్టడమో లేదా అమ్ముకుని బెట్టింగ్ కాస్తూ నష్టపోతున్నారు. అయితే, ఇంట్లో పిల్లల మీద తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని మేథావులు సూచిస్తున్నారు. కుమారుడు ఏం చేస్తున్నాడు.. కాలేజీలో ఎలా చదువుతున్నాడు... ఏమైనా టెన్షనకు గురవుతున్నాదా!? తదితర అంశాలపై నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని అంటున్నారు. బెట్టింగ్ భూతం గురించి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ బెట్టింగ్ కాస్తున్నట్టు తెలిస్తే వెంటనే మానసిక వైద్యనిపుణుల వద్ద కౌన్సెలింగ్ ఇప్పించాలి. యువకులు సైతం బెట్టింగ్ వ్యసనానికి బానిస అయితే జీవితాలను పోగొట్టుకుంటారన్న విషయం తెలుసుకోవాలి.