‘నాడు-నేడు’ పనులు అడ్డగింత
ABN , First Publish Date - 2022-09-22T03:54:53+05:30 IST
మండలంలోని భోగ్యంవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో శ్రీకారం చుట్టిన నాడు-నేడు పనులను బుధవారం పీఎంసీ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు అడ్డుకున్నారు.
వరికుంటపాడు, సెప్టెంబరు 21: మండలంలోని భోగ్యంవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో శ్రీకారం చుట్టిన నాడు-నేడు పనులను బుధవారం పీఎంసీ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు అడ్డుకున్నారు. ఆ పాఠశాలకు రెండో విడతలో నాడు-నేడు పథకం కింద రూ.18 లక్షల మంజూరయ్యాయి. ఆ నిధులతో ముందుగా తాగునీటి బోరు వేయించేందుకు ప్రధానోపాధ్యాయుడు ఆర్.నాగార్జున బోరు బండిని పిలిపించారు. ఈ నేపథ్యంలో కొంతమంది కమిటీ సభ్యులతోపాటు గ్రామస్థులు పాఠశాలకు చేరుకుని బోరు వేయనీయకుండా అడ్డుకున్నారు. అక్కడే ఉన్న మరికొంతమంది కమిటీ సభ్యులు బోరు వేయాల్సిందేనని పట్టుపట్టడంతో ఇరువర్గాల నడుమ వాగ్వివాదం జరిగి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమకు సమాచారం అందించకుండానే ఇష్టానురీతిలో పనులు చేపడుతున్నారని కొంతమంది మండిపడ్డారు. కాగా నిబంధనల మేరకే కమిటీని ఎంపిక చేసి వారి తీర్మానంతోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుని హెచ్‌ఎం తెలిపారు. అయినప్పటికీ ఓ వర్గీయులు ససేమిరా ఒప్పుకోకపోవడంతో చేసేదేమీలేక బోరుబండిని తిరిగి వెనక్కి పంపించారు. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ బాలమహేంద్రనాయక్ తన సిబ్బందితో పాఠశాలకు చేరుకొని హెచ్‌ంతోపాటు ఇరువర్గీయులను విచారించారు. అభివృద్ధికి సహకరించాలని సూచించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.