చిరస్మరణీయుడు వెన్నెలకంటి రాఘవయ్య
ABN , First Publish Date - 2022-06-05T04:26:58+05:30 IST
యానాదుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి తన జీవితాన్ని త్యాగం చేసిన పద్మవిభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య చిరస్మరణీయుడని ఐటీడీఏ పీవో డాక్టర్ మందా రాణి అన్నారు.
ఐటీడీఏ అధికారుల నివాళి
నెల్లూరు ( వీఆర్సీ ) జూన్ 4 : యానాదుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి తన జీవితాన్ని త్యాగం చేసిన పద్మవిభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య చిరస్మరణీయుడని ఐటీడీఏ పీవో డాక్టర్ మందా రాణి అన్నారు. వెన్నెలకంటి 125వ జయంతి సందర్భంగా శనివారం నగరంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలో గిరిజనులకు శాపంగా మారిన ట్రైబల్ యాక్ట్ రద్దు కోసం రాఘవయ్య తీవ్రంగా కృషి చేశారన్నారు. ఆయన ఆస్తులను యానాదుల కోసం ధారాదత్తం చేశారన్నారు. యానాదుల బిడ్డల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేసి వారి ఉన్నత విద్యకు ఆయన చేసిన కృషి ఏనలేదన్నారు. కార్యక్రమంలో ఏపీవో కనకదుర్గా భవాని, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పీబీకే పరిమళ, కార్యాలయ సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.
యానాదుల గాంధీ...
అణగారిపోతున్న యానాదులకు వెన్నెల కంటి రాఘవయ్య గాంధీ వంటి వారని యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసి పెంచలయ్య అన్నారు. నగరంలోని బోసుబొమ్మ సెంటర్‌లోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్‌లో శనివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీఎల్ శేఖర్, ఉష, లక్ష్మీ, ప్రసాద్, మురళీ, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్‌టీఎఫ్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చెంచయ్య, శీనయ్య, లోక్ సాయి పాల్గొన్నారు.