Mekapati గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరులో By election..సొంత ఇంటిలోనే వేరు కుంపట్లు..!
ABN , First Publish Date - 2022-06-08T16:59:07+05:30 IST
మేకపాటి రాజమోహన్‌రెడ్డి... అయిదుసార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే... మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి... నాలుగుసార్లు ఎమ్మెల్యే... దివంగత మేకపాటి ...

రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. కానీ రాచరికం తరహా రాజకీయాలు మాత్రం పోలేదు. ఇందుకు నెల్లూరు జిల్లా మేకపాటి కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికపై మేకపాటి కుటుంబంలో జరుగుతున్న రాజకీయాలు రాచరికపురోజులను తలపిస్తున్నాయి. అధికారం ముందు బంధాలు, బంధుత్వాలు దిగదుడుపు అనే విషయం నిరూపితమవుతోందని నెల్లూరు జనం చర్చించుకుంటున్నారు. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలసుకుందాం..
మేకపాటికి సొంత ఇంటిలోనే వేరు కుంపట్లు
మేకపాటి రాజమోహన్‌రెడ్డి... అయిదుసార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే... మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి... నాలుగుసార్లు ఎమ్మెల్యే... దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి... రెండుసార్లు ఎమ్మెల్యే, మూడేళ్లు మంత్రి... ఇదీ సింపుల్ గా మేకపాటి వారి పొలిటికల్ హిస్టరీ. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఇప్పుడు మేకపాటికి సొంత ఇంటిలోనే వేరు కుంపట్లు మొదలయ్యాయి. వారి వర్గీయులే నాలుగైదు వర్గాలుగా చీలిపోయారు. దీంతో ఆత్మకూరు ఉప ఎన్నిక మేకపాటి కుటుంబానికి ప్రతిష్టాత్మకంగా మారింది. గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనుచరులు అక్రమాల్లో రెచ్చిపోయారు. గౌతమ్ చూసీచూడనట్టు... పట్టీపట్టనట్టు ఉండటం... వారికి మూడేళ్లు పండగగా సాగిపోయింది.

గౌతమ్ సోదరుడు విక్రమ్‌ని రంగంలోకి దించాలని ...
గౌతమ్ మరణానంతరం... ఆయన భార్య శ్రీకీర్తిరెడ్డికి టిక్కెట్టు ఇస్తారనుకున్నారు. ఆమె ఎమ్మెల్యే అయితే... గతంలో మాదిరిగానే నాలుగు రూకలు ఇంకా ఎక్కువ వెనుకేసుకోవచ్చని కొందరు ఆశించారు. అయితే ఇప్పటి వరకు తమ కుటుంబంలో మహిళలు ఎవరు రాజకీయాల్లోకి రాకపోవడంతో ఈ విషయమై కుటుంబమంతా చర్చించుకుని, చివరకు గౌతమ్ సోదరుడు విక్రమ్ ని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నారు. దీంతో సీఎం జగన్ కూడా విక్రమ్ ని అంగీకరించక తప్పలేదు. అయితే ఆత్మకూరులో కేడర్ మాత్రం రాజమోహన్ రెడ్డి వర్గీయులుగా గౌతమ్ వర్గీయులుగా చీలిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పెరిగిపోయిన చిన్నరాణి శాంతమ్మ జోక్యం
ఇక మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన తన చిన్నరాణి శాంతమ్మకు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి పదవి కట్టబెట్టడంపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి ఆమెకు చంద్రశేఖర్‌రెడ్డి ఇచ్చే ప్రాధాన్యం ఇటు ఆయన కుటుంబసభ్యులకు, పార్టీ కేడర్‌కు ఎప్పటి నుంచో నచ్చడం లేదు. ముఖ్యంగా తగుదునమ్మా అంటూ అన్నింటిలోనూ చిన్నరాణి జోక్యం పెరిగిపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈక్రమంలో ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురై బెంగుళూరులో చికిత్స పొందిన సమయంలోనూ కుటుంబ సభ్యులెవరూ పెద్దగా పట్టించుకోలేదు.

న్యాయంగా తన కుటుంబం నుంచి తనకు రావాల్సిన ఆస్తిపాస్తులను రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ శేఖర్ రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. మరోపక్క చిన్నరాణికి పదవి ఇవ్వడంతో సొంత పార్టీ శ్రేణులే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటి నుంచో వైసీపీ జెండాలు మోస్తున్న వారిని పట్టించుకోలేదని... చిన్నరాణికి ఏకంగా నియోజకవర్గ ప్రచార కార్యదర్శి పదవి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చేజర్ల సుబ్బారెడ్డి, ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున శేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు చిన్నరాణికి పదవి ఇవ్వడంతో ఇంకో వ్యతిరేక వర్గం తయారైంది.

సంచలనంగా మారిన ధనుంజయరెడ్డి..చంద్రశేఖర్‌రెడ్డి భేటీ
ఈ నేపథ్యంలో శేఖర్ రెడ్డి ఆత్మకూరులో విక్రమ్ రెడ్డికి మెజార్టీ రాకుండా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఆత్మకూరుకి పనిగట్టుకుని వెళ్లి మరీ, రాజకీయ శత్రువుగా భావించే ధనుంజయరెడ్డిని చంద్రశేఖర్‌రెడ్డి కలవడం సంచలనమైంది. పైగా చాలా మందితోనూ ఆయన ఫోన్లలో టచ్‌లో ఉన్నారుట. విక్రమ్ మెజార్టీని బాగా తగ్గించగలిగితే రాబోయే రోజుల్లో తానే కింగ్ గా ఉండొచ్చనే ఉద్దేశంతో ఆయన ఇలా తెరవెనుక పావులు కదుపుతున్నారని చెపుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే శేఖర్ రెడ్డి... సొంత అన్న కుమారుడైన విక్రమ్ రెడ్డి విషయంలో ఈ తీరుగా వ్యవహారిస్తున్నారని జనం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

ఉప ఎన్నికలో పోటికి దిగమని ప్రకటించిన చంద్రబాబు
ఎవరైనా ఎమ్మెల్యే మృతిచెంది ఉప ఎన్నికలు వస్తే... టీడీపీ తమ అభ్యర్ధిని పోటీకి దించదు. ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలోనూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు పోటీ పెట్టమని ప్రకటించారు. కానీ... రాజమోహన్ రెడ్డి సొంత మేనల్లుడు బిజివేముల రవీంద్రనాధ్ రెడ్డి మాత్రం ఆవేశంతో ఊగిపోతున్నారు. మేకపాటి వారి వల్ల మెట్టప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలు అభివృద్ధిలో మరింతగా వెనుకపడ్డాయని ఆయన చెపుతున్నారు. అందుకే తాను ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డిపై పోటీకి దిగుతున్నానంటూ ప్రకటించారు. బీజేపీ తరుపున టిక్కెట్టు తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇండిపెండెంట్ గా కూడాబరిలోకి దిగేందుకు ఆయన వెనుకాడటం లేదు. ఇంకొంత మంది కూడా పోటీకి సిద్దమవుతున్నారు.

మంత్రులు, ఎంపీలను ప్రశ్నిస్తున్న విక్రమ్ రెడ్డి
ఇక వ్యాపారాల్లో ఫుల్ బిజీగా ఉండే విక్రమ్ రెడ్డి... కొన్ని రోజులుగా ఆత్మకూరు నియోజకవర్గంలో తెగ తిరిగేస్తున్నారు. అయితే ఆయన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తే... సొంత వర్గీయులు, ముఖ్యులే హాజరుకావడం లేదు. వారందర్నీ బతిమిలాడటం, తమవైపు తిప్పుకోవడం ఆయనకు తలనొప్పిగా తయారైంది. అయితే గ్రామాల్లో జనం మాత్రం విక్రమ్ రెడ్డి రాగానే సమస్యలు ఏకరవు పెడుతున్నారు. మూడు నెలల్లో సమస్యలు తీరుస్తానంటే... ముప్పై ఏళ్లగా మీరే ఎమ్మెల్యేలు... మీరే మంత్రులు... మీరే ఎంపీలు... అప్పుడంతా సమస్యలు తీర్చలేని వారు, మూడు నెలల్లో ఏం తీరుస్తారంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు.

మెజార్టీ సాధించడం మేకపాటి వారికి కత్తిమీద సాములాటిందే..
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ ఆభ్యర్ధిని రంగంలోకి దించకున్నా... మెజార్టీ సాధించడం మేకపాటి వారికి కత్తిమీద సాములా మారింది. సొంత వర్గీయులు, కుటుంబ సభ్యులే కత్తులు నూరుతుండటం అయోమయానికి గురిచేస్తోంది. మెజార్టీ రాకపోతే సీఎం జగన్ దగ్గర పరువు పోతుందని... రాజకీయ భవిష్యత్తుకీ ఇబ్బంది కలుగుతుందని మథనపడుతున్నారుట. మొత్తానికి మేకపాటి వారి కోట సొంతవారి వల్లే బీటలు వారడమే అసలు విషాదం.
