మండలాభివృద్ధికి సమష్టి కృషి జరగాలి

ABN , First Publish Date - 2022-10-08T03:53:47+05:30 IST

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మండలాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని జడ్పీటీసీ ఇంటూరి భారతి తెలిపారు.

మండలాభివృద్ధికి సమష్టి కృషి జరగాలి
మండల సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీటీసీ భారతి

వలేటివారిపాలెం, అక్టోబరు 7 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మండలాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని జడ్పీటీసీ ఇంటూరి భారతి తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పొనుగోటి మౌనిక అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జడ్పీటీసీ భారతి మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అన్ని గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోకూరు హైస్కూల్‌లో ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయాలని ఎంఈవోను కోరారు. పోలినేనిపాలెంలో విద్యుత్‌ మూడో లైను ఏర్పాటుకు పంచాయతీ డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదని ఆగ్రామ ఎంపీటీసీ చింతలపూడి రవీంద్ర తెలిపారు. లింగపాలెంలో విద్యుత్‌ సమస్యను పంచాయతీ కార్యదర్శి రాంబాబు విద్యుత్‌ ఏఈ దృష్టికి తెచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేతమైన మాలకొండలో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నిలపాలని ఏడాది నుంచి కోరుతున్నా పట్టించుకోవడంలేదని అయ్యవారిపల్లె సర్పంచు డేగా వెంకటేశ్వర్లు కందుకూరు ఆర్టీసీ డీఎంను ప్రశ్నించారు. చుండిలో ఓటీఎస్‌ కింద డబ్బులు కట్టించుకుని ఇంత వరకు పట్టాలు ఇవ్వలేదని ఆ గ్రామ సర్పంచు ఇరపని సతీష్‌ తహసీల్దార్‌ను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రపీక్‌అహ్మద్‌, తహసీల్దార్‌ సుందరమ్మ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు 


Updated Date - 2022-10-08T03:53:47+05:30 IST