వైభవంగా కృష్ణాష్టమి

ABN , First Publish Date - 2022-08-20T04:23:07+05:30 IST

మండల ప్రజలు కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

వైభవంగా కృష్ణాష్టమి
ప్రత్యేక అలంకరణలో శ్రీకృష్ణుడు

కోవూరు, ఆగస్టు 19: మండల ప్రజలు కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో   జరుపుకున్నారు. పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆలయ పూజారి శ్రీకాంతా చార్యులు సామూహిక కుంకమార్చన  నిర్వహించారు. అనంతరం పల్లకి, పూలంగిసేవ చేశారు. పెద్దసంఖ్యలో హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. పడుగుపాడు, పోతిరెడ్డిపాళెం గ్రామా ల్లోని శ్రీకృష్ణ మందిరాల్లో భక్తులు పూజలు చేశారు.

ముత్తుకూరు : మండలంలోని కృష్ణ మందిరాల్లో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇళ్లలో చిన్ని కృష్ణుడి పాదాలతో అలంకరించి పండుగ జరుపుకున్నారు. స్థానిక తహసీల్దారు కార్యాలయ సమీపంలో ఉన్న కృష్ణ మందిరంలో ఉదయం పూజలు చేశారు. సాయంత్రం నిర్వహించిన ఉట్టి మహోత్సవంలో యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. కృష్ణపట్నంలోని కృష్ణమందిరంలో ఉదయం నుంచి భజనలు చేశారు.

బుచ్చిరెడ్డిపాళెం, : బుచ్చి పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లోని కృష్ణమందిరాలు, బాబా మందిరాలు, పలు వైష్ణవాలయాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. బుచ్చిలోని కోదండరామస్వామి, పైడావారి వీధిలోని శ్రీకృష్ణమందిరం, వేణుగోపాలస్వామి, కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలు, బాబా మందిరం, మండలంలోని జొన్నవాడ, కాగులపాడు తదితర గ్రామాల్లోని  ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పలు చోట్ల అన్నదానం, ప్రత్యేక ప్రసాదాలు పంపిణీ చేశారు. జొన్నవాడలో శ్రీ వరదరాజస్వామికి ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఉట్టి కొట్టి గ్రామోత్సవంతో ఊరేగించారు. బుచ్చిరెడ్డిపాళెంలో చిన్నారి నయనీత్‌రెడ్డి, కోవూరుకు చెందిన అభిరాం, పెనుబల్లికి చెందిన ఓ చిన్నారి కృష్ణుడి వేషధారణలు జొన్నవాడ ఆలయదర్శనానికి వచ్చి భక్తులను ఆకట్టుకున్నాయి. పలువురు భక్తులు చిన్ని కృష్ణా అంటూ ఆ చిన్నారులతో సెల్ఫీలు తీసుకున్నారు.

ఇందుకూరుపేట : మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందుకూరుపేట కృష్ణాలయం, రావూరు, పున్నూరు, పల్లెపాడు ఆలయాల్లో అభిషేకాలు, విశేష పూజలు, ఉట్టి కార్యక్రమాలు నిర్వహించారు. రావూరులో బాలబొమ్మ వెంకటేశ్వర్లు, పున్నూరులో చెంచు కిశోర్‌యాదవ్‌, గొల్లపల్లి విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పల్లెపాడు రుక్మిణీ సమేత వేణుగోపాల్‌స్వామి ఆలయంలో సామూహిక తులసీ అర్చన  చేశారు. పిల్లలు గోపిక, కృష్ణుడి వేషధారణలతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 

విడవలూరు : స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో టీడీపీ మండల అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు చిన్నారులకు కృష్ణుడి వేషధారణ వేసి ఉత్సవాలను నిర్వహించారు. రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలను చేసిన అనంతరం ఉట్టి మహోత్సవాన్ని నిర్వహించారు. చిన్నాపెద్ద తేడాలేకుండా ఉట్టి ఉత్సవంలో పాల్గొన్నారు. చౌకిచర్లలో గ్రామ మాజీ సర్పంచు సమాది శ్రీనివాసులు, కృష్ణవేణి కుటుంబ సభ్యులు గోపూజలను నిర్వహి ంచారు. శ్రీ కృష్ణుడిని ఇంటిలోకి ఆహ్వానిస్తూ చిన్నారులచే పాదముద్రలు వేశారు. రామతీర్థంలో ఆర్యవైశ్య మండలాఽధ్యక్షుడు గుబ్బారాధయ్య కుటుంబసభ్యులు చిన్నారులకు రాధా కృష్ణుడి వలే వేషధారణ చేసిహరతులు పట్టారు. ఉట్టి ఉత్సవాలను నిర్వహించారు. Updated Date - 2022-08-20T04:23:07+05:30 IST