అంతా బహిరంగ రహస్యం..!

ABN , First Publish Date - 2022-06-23T04:01:19+05:30 IST

మండలంలో నిషేధిత గుట్కాల అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.

అంతా బహిరంగ రహస్యం..!
రహస్య ప్రాంతాల్లో నిల్వచేసిన గుట్కాలను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు(ఫైల్‌)

యథేచ్ఛగా గుట్కా విక్రయాలు

కలిగిరి, జూన్‌ 22: మండలంలో నిషేధిత గుట్కాల అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పోలీస్‌ స్టేషనుకు కూతవేటు దూరంలో ఉన్న దుకాణాదారులు అక్రమంగా గుట్కాల వ్యాపారం చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గుట్కా విక్రయాలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించిన తరువాత అక్రమంగా గుట్కాలను రవాణా చేస్తూ పలువురు లక్షలాది రూపాయల వ్యాపారం చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. కందుకూరు, కావలి, నెల్లూరు ప్రాంతాల నుంంచి రాత్రివేళల్లో చాటుమాటుగా గుట్కాలు తీసుకువచ్చి స్థానికంగా వ్యాపారం నిర్వహించే వార్కి అందజేస్తున్నారు. వీరు గుట్కా బస్తాలను రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచి నమ్మకస్తుల ద్వారా మోటార్‌ సైకిల్‌పై గ్రామాల్లో బడ్డీకొట్లకు చేరవేస్తారు. బడ్డీకొట్టు యజమానులు వాటిని దుకాణంలో కాకుండా వేరే ప్రాంతంలో ఉంచి తమ దగ్గర తక్కువ మోతాదులో పాకెట్లను ఉంచుకుని రోజువారి కస్టమర్లకు మాత్రమే విక్రయిస్తారు. ఈ తంతంగం కానిస్టేబుల్‌ స్థాయి నుంచి ఉన్నతస్థానంలో ఉన్న పోలీసు అధికారులకు తెలిసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.  ఫిర్యాదు వచ్చిప్పుడు మాత్రమే దాడులు చేసి అక్రమార్కులపై నామమాత్రపు కేసులు నమోదు చేస్తారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు  పట్టణంలో దాడులు నిర్వహించి మొదటి రోజే రూ.70వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. దీనినిబట్టి పోలీసు శాఖకు గుట్కా అక్రమవ్యాపారులు ఎవరెవరనేది పూర్తిస్థాయిలో తెలసని, కానీ వారిని పట్టుకొని, అక్రమ గుట్కా వ్యాపారం నియంత్రించడంలో వెనుకంజవేయడంలో మతలబు ఏమిటో అర్థం కావడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం నలుగురైదురు వ్యక్తుల సహకారంతో జరిగే ఈ అక్రమవ్యాపారంతో యువత బానిసవడమే కాకుండా, చిన్న వయస్సులోనే అనారోగ్యంపాలై ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. రక్షక భటులు గుట్కా వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టి విక్రయాలను పూర్తిగా నియంత్రిస్తే యువతకు మేలు చేసినవారవతారని ప్రజలు అంటున్నారు.

Updated Date - 2022-06-23T04:01:19+05:30 IST