పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో కనకమ్మ 131వ జయంతి

ABN , First Publish Date - 2022-06-11T05:02:31+05:30 IST

పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో కనకమ్మ 131వ జయంతి

పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో  కనకమ్మ 131వ జయంతి
గాంధీజీ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి

రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి

ఇందుకూరుపేట, జూన్‌ 10 : పొణకా కనకమ్మ ఆశయ సాధన కోసం రెడ్‌క్రాస్‌ ఎప్పుడూ ముందుంటుందని రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పల్లెపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో పొణకా కనకమ్మ 131వ జయంతి వేడుకలు శుక్రవారం జరిగాయి. ముందుగా మహాత్మాగాంధీ, పొణకా కనకమ్మ విగ్రహాలకు ఖాదీ వస్త్రం, రోజాపూల మాలలను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొణకా కనకమ్మ పల్లిపాడులో 13 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ స్థాపనకు దానం చేశారన్నారు. గాంధీ 1921 ఏప్రిల్‌ 7నఈ ఆశ్రమాన్ని ప్రారంభించారన్నారు.  కనకమ్మ నెల్లూరులో స్థాపించిన కస్తూరిదేవి విద్యాలయాన్ని (బాలికల పాఠశాల) టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారని తెలిపారు.   పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమ కన్వీనర్‌ కల్పనమ్మ మాట్లాడుతూ పొనకా కనకమ్మ చేసిన దానాలు, త్యాగాలు స్ఫూర్తిదాయమని తెలిపారు. కో కన్వినర్‌ నెల్లూరు రవీంద్రరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా మినగల్లులో 1892 జూన్‌ 10న జన్మించిన  పొణకా కనకమ్మ  స్త్రీ విద్య కోసం అలుపెరుగని పోరాటం  చేశారన్నారు. కార్యక్రమంలో గంపల మంజుల, కమిటీ సభ్యులు బి.సుధారాణి, కోటం రెడ్డి విజయమ్మ, షేక్‌.అల్లాబక్షు, పల్లిపాడు గ్రామ సర్పంచ్‌ రెడ్డిపోగు సుధాకర్‌, వి.నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ఆర్‌ కోటారెడ్డి, ఆశ్రమ మేనేజర్‌ సాయిమనోజ్‌, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-11T05:02:31+05:30 IST