ఇల్లు కడతారా.. పట్టా ఇచ్చేస్తారా!?

ABN , First Publish Date - 2022-01-22T04:30:33+05:30 IST

నవరత్నాల్లో భాగంగా జిల్లాలో దాదాపు 1.40 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

ఇల్లు కడతారా..  పట్టా ఇచ్చేస్తారా!?

పేదలపై తీవ్ర ఒత్తిళ్లు

అధికారులు, వలంటీర్ల బెదిరింపు ధోరణి

ఇప్పటికే పలుచోట్ల నోటీసుల జారీ

మొదట్లో ప్రభుత్వమే నిర్మించి ఇస్తామని హామీ

తర్వాత మీరే నిర్మించుకోవాలంటూ ఆదేశాలు

భారం మోయలేక ముందుకురాని లబ్ధిదారులు


‘‘మీకు ఇంటి పట్టా ఇచ్చి చాన్నాళ్లయ్యింది. ఇప్పటికీ ఇల్లు కట్టుకోకుంటే ఎలా!?. ఇలాగయితే మీకు ఇచ్చిన పట్టా వెనక్కి తీసేసుకుంటాం.’’ అంటూ అధికారులు, వలంటీర్లు లబ్ధిదారులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. అంతేగాక నోటీసులూ జారీ చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నవరత్నాల్లో భాగంగా ఆర్భాటంగా లేఅవుట్లు వేసి ఇంటి స్థలాలు ఇచ్చారు. మొదట ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించడంతో పేదలంతా సంతోషించారు. తీరా ఎవరికివారే ఇల్లు నిర్మించుకోవాలని సూచించడంతో అవాక్కయ్యారు. ప్రభుత్వం ఇచ్చే నగదు సరిపోక, అదనపు భారం మోయలేక చాలామంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు రాలేదు. అయితే, స్థలాలు పొందిన వారు ఖచ్చితంగా ఇల్లు నిర్మించుకోవాల్సిందేనంటూ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇళ్లు నిర్మించుకోకపోతే పట్టాలు ఇచ్చేయాల్సి ఉంటుందంటూ లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు.


నెల్లూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : నవరత్నాల్లో భాగంగా జిల్లాలో దాదాపు 1.40 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టణాల్లో ఆరు, గ్రామాల్లో తొమ్మిది అంకణాలు చొప్పున స్థలాలు ఇచ్చారు. వీటన్నింటిలో దశల వారీగా ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మొదట మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి.. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం నగదు ఇస్తే లబ్ధిదారుడు ఇళ్లు నిర్మించుకోవడం. రెండు.. ప్రభుత్వం మెటీరియల్‌ ఇస్తే లబ్ధిదారుడు ఇళ్లు నిర్మించుకోవడం. మూడు.. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వడం. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలను ఇచ్చే విధంగా నిర్ణయించింది. అయితే ప్రస్తుతమున్న ధరలకు ఆ మొత్తంతో ఇళ్లు నిర్మించుకోవడం సాధ్యం కాదు కాబట్టి పేదలంతా మూడో ఆప్షనను ఎంచుకొన్నారు. తర్వాత ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది.  కానీ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ఏ కాంట్రాక్టరూ ముందుకు రాకపోవడంతో ఇక చేసేది లేక పేదలే ఎవరి ఇళ్లు వారు నిర్మించుకోవాలని సూచించింది. పేదల చేత బలవంతంగా ఆప్షనను మార్పించారు. మొదటి  దశలో జిల్లాకు 76,024 ఇళ్లు మంజూరయ్యాయి. గతేడాది జూన నెలలో నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే మొదట నుంచీ ఇళ్ల నిర్మాణం ఆశించినంత వేగంగా జరగడం లేదు. చాలా మంది లబ్ధిదారులు ముందుకు రాలేదు. వచ్చిన కొద్ది మందికి కూడా సకాలంలో బిల్లులు ఇవ్వలేదు. దీంతో పేదల్లో మరింత ఆందోళన మొదలైంది. కానీ తర్వాత ప్రత్యేక డ్రైవ్‌లు పెట్టి అధికారులు బలవంతంగా పేదల చేత ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టించారు. అయినప్పటికీ ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు దాదాపు 50 వేల ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. అందులో మూడో వంతు ఇంకా బేస్‌ లెవల్‌ కూడా దాటకపోవడం గమనార్హం. ఎందుకిలా జరుగుతోందన్న దానిని విశ్లేషించుకోకుండా ప్రభుత్వం కూడా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తుండడంతో వారు పేదలపై ఒత్తిడి చేస్తున్నారు. 


పేదలకు నోటీసులు


ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కనీసం ఐదు అంకణాల్లో (360 చదరపు అడుగులు) ఇల్లు నిర్మించుకోవాలన్నా ప్రభుత్వం ఇస్తున్న మొత్తాని కన్నా రెట్టింపు ఖర్చవుతుంది. ప్రస్తుతమున్న ధరల ప్రకారం రూ.4 లక్షలపైనే ఖర్చవుతున్నట్లు పేదలు చెబుతున్నారు. తాము రూ.2 లక్షలు అప్పు తెచ్చి ఇల్లు నిర్మించుకుంటే ఆ అప్పు ఎలా తీర్చుకోగలమంటూ కొందరు పేదలు ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగానే ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించేందుకు జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నా నిర్మాణాల్లో పురోగతి మాత్రం ఆశించిన మేర కనిపించడం లేదు. కాగా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాని పేదలపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. నిర్మించుకోకపోతే పట్టా వెనక్కు ఇచ్చేయాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో నోటీసులు అందించారు. దీంతో పేదలు లబోదిబోమంటున్నారు. తమ శక్తికి సరిపోని పనులు చేయమంటే ఎలా చేయగలమంటూ వాపోతున్నారు. 

Updated Date - 2022-01-22T04:30:33+05:30 IST