గురుకులంలో చెట్ల విక్రయం
ABN , First Publish Date - 2022-08-31T02:42:22+05:30 IST
చెట్లు మానవాళి ప్రగతికి మెట్లు... అని పదిమందికి తెలియచెప్పాల్సిన ఓ ప్రిన్సిపాల్ కాసులకు కక్కుర్తిపడి 20 ఏళ్లనాటి భారీ వృక్షా
20 ఏళ్లనాటి భారీ వృక్షాల నరికివేత
రాత్రికిరాత్రే తరలింపు
మండిపడుతున్న ప్రకృతి ప్రేమికులు
గురుకులంలో చెట్లను నరకగా మిగిలిన మోడులు
సంగం, ఆగస్టు 30: చెట్లు మానవాళి ప్రగతికి మెట్లు... అని పదిమందికి తెలియచెప్పాల్సిన ఓ ప్రిన్సిపాల్ కాసులకు కక్కుర్తిపడి 20 ఏళ్లనాటి భారీ వృక్షాలను నరికించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బహిర్గతం కావడంతో ఆయన తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు రహదారికి అడ్డంగా ఉన్నాయని ఫిర్యాదు అందడంతో చెట్లు తొలగించామని బుకాయించారు. ఈ సంఽఘటన సంగంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో జరిగింది. సంగం తిరుమనతిప్పలో 20 ఏళ్ల కిందట సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఆశ్రమ బాలికల గురుకుల కళాశాలను నిర్మించారు. ప్రారంభ సమయంలో ఆవరణం చుట్టూ అప్పటి ప్రిన్సిపాల్ మొక్కలు నాటించారు. అవి వేపుగా పెరిగి పెద్దవయ్యాయి. తుఫాన్ల సమయంలో గాలివానకు చెట్లు పడిపోకుండా గతంలో పనిచేసిన ప్రిన్సిపాల్స్ కొమ్మలు నరికించేవారు.దీంతో ఇవి ఎంతో ఆహ్లాదంగా ఉండేవి.
భారీ వృక్షాల నరికివేత
ప్రస్తుత ప్రిన్సిపాల్ కొమ్మలు కొట్టిస్తే కూలీలకు ఖర్చులవుతాయని, కాసులకు కక్కుర్తిపడి ఏకంగా ఆ వృక్షాలను ఓ సామిల్లుకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామిల్లు నిర్వాహకులు ఆది, సోమవారాల్లో భారీ వృక్షాలను మొదళ్లకాడకి నరికి తరలించారు. ఇదేమిటని వారిని ప్రశ్నించడంతో ఆలయానికి వెళ్లే రహదారికి అడ్డంగా ఉన్నాయని, చెట్లన్నీ తొలగించాలని ప్రిన్సిపాల్ చెప్పినట్లు తెలిపారు. రాత్రిరాత్రికే వృక్షాలను తరలించడంతో ప్రిన్సిపాల్ తీరుపై ప్రకృతి ప్రేమికులు మండిపడుతున్నారు. చెట్ల నరికిస్తే తమను చూడనొచ్చే తల్లిదండ్రులు ఎక్కడ కూర్చొవాలని కళాశాల విద్యార్థునిలు ఉపాధ్యాయులను నిలదీశారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భారీ వృక్షాల నరికివేతపై విచారించాలని పలువురు కోరుతున్నారు.