‘గడప...’ తొక్కలేక..!
ABN , First Publish Date - 2022-08-11T04:57:42+05:30 IST
ప్రశ్నించేవారున్న ప్రాంతాలకు వెళ్లకుండా, ఎవరైనా సమస్యలు ప్రస్తావిస్తే అసహనం వ్యక్తం చేస్తూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

అనుకూల ప్రాంతాల్లోనే కావలి ఎమ్మెల్యే పర్యటన
ఎక్కడికి వెళ్లాలో అనుచరులు, వలంటీర్లతో మ్యాప్
సమస్యలపై ప్రస్తావించకుండా జాగ్రత్తలు
ప్రశ్నించిన వారిపై రామిరెడ్డి అసహనం
పోలీస్ బందోబస్తు నడుమ కార్యక్రమం
సమస్యలపై నిలదీసే వారున్న ప్రాంతాలకు దూరం.. ఎవరూ ప్రశ్నించకుండా వలంటీర్లు, అనుచరులతో ముందస్తు బెదిరింపులు.. ఒకవేళ నిలదీస్తే అంతే చిర్రెత్తిపోతారు. తాను ప్రజాప్రతినిధి అన్నమాట మరిచి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. కావలి నియోజకవర్గంలో జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తీరిది. ఇలాగైతే స్థానిక సమస్యలపై తామెలా అడుగుతామని, అవి ఎలా పరిష్కారం అవుతాయంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కావలి, ఆగస్టు 10 : ప్రశ్నించేవారున్న ప్రాంతాలకు వెళ్లకుండా, ఎవరైనా సమస్యలు ప్రస్తావిస్తే అసహనం వ్యక్తం చేస్తూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఆయన్ను నిలదీస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కోసారి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఇలా అయితే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నట్లు ఎలా తెలుస్తుందని, తమ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ తొలుత వెళ్లిన కావలిలోని వెంగళరావునగర్‌కు వెళ్లగా సమస్యలపై ప్రజలు నిలదీయడంతో కొంతకాలం కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో గడప గడపకు వెళ్లని ఎమ్మెల్యేల జాబితాలో రామిరెడ్డి చివరి స్థానంలో ఉన్నారని వైసీపీ అధిష్ఠానం సర్వేలో తేలింది.
అనుకూల ప్రాంతాల్లోనే...
దీంతో ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్లేందుకు అనుకూలమైన వార్డులు, గ్రామాలను ఎంచుకున్నారు. అందులో కూడా తమ అనుచరులు ఉన్న ప్రాంతాలనే ఎంపిక చేసుకున్నారు. ప్రజల నుంచి ప్రతిఘటన రాకుండా గడప గడపకు కార్యక్రమ ఇనచార్జి బాధ్యతలను తన ప్రధాన అనుచరుడికి అప్పగించారు. దీంతో ఆయన ముందుగా ఎమ్మెల్యే తిరిగే ప్రాంతాల్లో వైసీపీ నేతల మధ్య వివాదాలు పరిష్కరిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో సచివాలయ వలంటీర్లతో ముందుగా సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చినపుడు ఎవరైనా సమస్యలను ప్రస్తావిస్తే సంక్షేమ పథకాలు కట్ అవుతాయని వలంటీర్ల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. అంతేగాక పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహిస్తున్నారు.
బెదిరింపులు... బూతులు
ఇంత పకడ్బందీ ప్రణాళిక చేసుకున్నా కొంతమంది ప్రజలు ధైర్యం చేసి సమస్యలపై ఎమ్మెల్యే రామిరెడ్డిని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7న కావలి రూరల్ మండలం బట్లదిన్నెకు ఎమ్మెల్యే రామిరెడ్డి వెళ్లారు. అక్కడ అధ్వానంగా ఉన్న రోడ్డుకు మంత్రులు శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా పనులు ప్రారంభించకపోవటంతో ఎమ్మెల్యేను నిలదీశారు. సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే వారిపై ఆగ్రహించి, మీ వెనుక టీడీపీ నాయకులు ఉన్నారని, వారు మీతో అడిగించారని.. వారి అంతు చూస్తానని బెదిరించారు. అంతేగాక బూతుపురాణం ఎత్తుకున్నారు. అదేస్థాయిలో ప్రజలు కూడా తిరగబడటంతో పక్కనున్న పోలీసులు, వైసీపీ నేతలు కొంతమంది సర్దుబాటు చేశారు. సర్వాయపాలెం పంచాయతీలో ఆదరణ పథకం కింద సైకిల్ కోసం నగదు డిపాజిట్ చేసినా సైకిల్ ఇవ్వలేదని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. మనది సైకిల్ కాదు.. ఫ్యాను అంటూ వెటకారంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఏడేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నావు... మాకు ఏంచేశావని మన్నంగిదిన్నె పంచాయతీ ఎస్టీకాలనీ వాసులు ప్రశ్నించారు. అంతర్గత రోడ్డు లేవని ఆముదాలదిన్నె వాసులు, శ్మశానానికి స్థలంలేదని, అంతర్గత రోడ్లు లేవని జువ్విగుంటపాలెం వాసులు రామిరెడ్డిని నిలదీశారు. ఇలా ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యేను సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు.
సమస్యలు ఎలా తెలుస్తాయి?
వైసీపీ నాయకులు ఎమ్మెల్యే రామిరెడ్డికి స్థానిక సమస్యలు చెప్పరు. ప్రజలు అడిగితే ప్రతిపక్షం వారని ఆగ్రహిస్తారు. అలాంటప్పుడు ఎమ్మెల్యేకు సమస్యలు ఎలా తెలుస్తాయని పలువురు అంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం... ద్వారా వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్ఠానం ప్రయత్నిస్తుండగా, ప్రజల నుంచి అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై ప్రతిఘటన ఎదురవుతున్నది. దీంతో ఎమ్మెల్యే మొక్కుబడిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
