కలపే కల్పతరువు..!

ABN , First Publish Date - 2022-03-22T03:41:18+05:30 IST

రెవెన్యూ, అటవీ శాఖల అధికారుల సమన్వయలోపం అక్రమార్కులకు వరంగా మారింది.

కలపే కల్పతరువు..!
వాహనంలో తరలిపోతున్న కలప

యథేచ్ఛగా అక్రమ రవాణా

పట్టించుకోని అధికారులు

ఉదయగిరి రూరల్‌, మార్చి 21: రెవెన్యూ, అటవీ శాఖల అధికారుల సమన్వయలోపం అక్రమార్కులకు వరంగా మారింది. చెరువు కట్టలు, లోతట్టు ప్రాంతాలు, రహదారులు, అసైన్‌మెంట్‌ భూములు, కొండలు, రహదారుల పక్కన ఉన్న చెట్లను నరికి సొమ్ము చేసుకొంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ మొక్కలతోనే సాధ్యమంటూ నినాదాలు చేయించే అధికారులు వాటిని నాశనం చేస్తున్నా స్పందించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

యథేచ్ఛగా అక్రమ రవాణా

మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో పొగాకు క్యూరింగ్‌, ఇటుకబట్టీల సమయంలో కర్రకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఇదే అదునుగా అక్రమార్కులు చెట్లను నరికి రోజుక 50 నుంచి 70 ఓడ్ల కర్రను తరలించి రూ.లక్షలు అర్జిస్తున్నారు. ప్రధానంగా జలాశయం, చెరువు లోతట్టు ప్రాంతాలు, రహదారులు, అసైన్‌మెంట్‌ భూములు, వాగులు, వంకలు, కొండల్లో ఉన్న చెట్లను కూలీలతో నరికించి రేయింబవళ్లు తేడాలేకుండా పొగాకు బ్యారన్‌లకు, ఇటుకబట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. వాల్టా చట్టం ప్రకారం ఆయా ప్రాంతల్లో చెట్లు నరకాలంటే దరఖాస్తు చేసుకొని తహసీల్దారు అనుమతి తీసుకోవాలి. రెవెన్యూ అధికారులు పరిశీలించిన అనంతరం అటవీ అధికారులకు నివేదిక పంపాలి. అనంతరం వారి అనుమతి కోసం నగదు చెల్లించి చెట్లను నరికి రవాణా చేయాలి. అయితే ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడంలేదు. కొన్ని పంచాయతీల్లో కర్ర కొట్టుకునేందుకు ఏకంగా వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఆ సొమ్మును ప్రజాప్రతినిధులు తమ జేబుల్లో వేసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు బహిరంగంగా చర్చించుకొంటున్నారు. 

టన్ను రూ.3,500

పొగాకు క్యూరింగ్‌తోపాటు ఇటుకబట్టీలకు ఇది మంచి సీజన్‌. దీంతో అక్రమార్కులు కర్ర ధరను పెంచేశారు. గతంలో రూ.2,000 నుంచి రూ.2,500లు పలుకుతున్న టన్ను కర్ర ప్రస్తుతం రూ.3,000 నుంచి రూ.3,500 పలుకుతుంది. ధర బాగా పలుకుతుండడంతో తటస్థులు సైతం కర్ర వ్యాపారంలోకి దిగి చెట్లను విపరీతంగా నరుకుతున్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కర్రను అక్రమంగా తరలించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి చెట్లను నరకకుండా పర్యావరణాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. 


Updated Date - 2022-03-22T03:41:18+05:30 IST