మహిళ సజీవ దహనం

ABN , First Publish Date - 2022-04-06T04:03:22+05:30 IST

ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు పూరింటికి మంటలు అంటుకుని ఎల్లంగారి లక్ష్మమ్మ (42) సజీవ దహనం అయింది.

మహిళ సజీవ దహనం
దగ్ధమైన ఇంటిని పరిశీలిస్తున్న సీఐ ఖాజావలి

వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం

పూరిల్లు దగ్ధం

కావలి రూరల్‌, ఏప్రిల్‌ 5: ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు పూరింటికి మంటలు అంటుకుని ఎల్లంగారి లక్ష్మమ్మ (42) సజీవ దహనం అయింది. కావలి రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొత్తసత్రం గ్రామానికి చెందిన గోవిందు, లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడితో కలసి పూరింట్లో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం భర్త గోవిందు చేపల వేటకు మంగుళూరు వెళ్లాడు. ఈ క్రమంలో మంగళవారం కుమారుడు వెంకయ్యబాబు చేపలు తీసుకువచ్చి కూర చెయ్యమని తల్లికి చెప్పి బయటకు వెళ్లాడు. లక్ష్మమ్మ గ్యాస్‌ పొయ్యిపై వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు పూరింటికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన ఆమె కేకలు వేయగా స్థానికులు వచ్చేలోపు మంటలు పూర్తిగా ఇంటిని చుట్టుముట్టడంతో ఆమె సజీవ దహనమైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. సీఐ ఖాజావలి, ఎస్‌ఐ వెంకట్రావ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read more