ప్రజలకు అండగా ఉంటా
ABN , First Publish Date - 2022-08-21T04:45:18+05:30 IST
త్వరలో నియోజకవర్గంలో పర్యటిస్తానని, ప్రజలకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
త్వరలో నియోజకవర్గ పర్యటన : విష్ణు
కావలిటౌన్, ఆగస్టు 20: త్వరలో నియోజకవర్గంలో పర్యటిస్తానని, ప్రజలకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రూపాయి మిద్దె కూడలిలోని ఆయన కార్యాలయంలో టీడీపీ నేతలు, తన అభిమానులు అనుచరులతో సమావేశమై విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ టికెట్ కావాలని ఎవ్వరినీ అడగలేదని, చంద్రబాబు నాయుడే పిలిచి టికెట్ ఇచ్చారని, ఎన్నికల అనంతరరం అనేక పరిణామాలు జరిగాయన్నారు. అయినప్పటికీ టీడీపీలోనే కొనసాగుతూ నిబద్దతగా పనిచేస్తున్నానన్నారు. పార్టీలో వర్గాలు ప్రొత్సహించకూడదనే ఆలోచనతో కొంత కాలం వేచిచూశామన్నారు. టీడీపీ కార్యకర్తలు, తన అభిమానులు, అనుచరుల వత్తిడితో ప్రజలతో మమేకమవ్వాలనే అలోచనతో వచ్చే నెలలో కార్యకర్తలతో సమవేశమై నియోజకవర్గ పర్యటన ఖరారు చేస్తామన్నారు. అనంతరం ఆయన అనుచరులు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ విష్ణువర్ధన్‌రెడ్డికేనని ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 84వేల పైచిలుకు ఓట్లు విష్ణుకు వచ్చాయంటే అవన్నీ టీడీపీ ఓట్లు కాదని, ఎక్కువ శాతం ఆయన అభిమానులు, అనుచరుల ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో నేతలు సర్ధార్ కిర్మాణి, బాలకృష్ణం రాజు, పూనూరు మురళీరెడ్డి, పద్మనాభరెడ్డి, అనుమాలశట్టి శివ, హరిప్రసాద్, ప్రభాకర్‌రెడ్డి, వెంగళ్‌రెడ్డి, చంద్ర తదితరులు పాల్గొన్నారు.