ఈసారీ ఆదుకోని పచ్చిశనగ!

ABN , First Publish Date - 2022-03-20T05:06:16+05:30 IST

అధిక వర్షాలు.. తెగుళ్ల నేపథ్యంలో ఆశించిన దిగుబడి రాక పచ్చిశనగ రైతులు నష్టాలను చవిచూస్తున్నారు.

ఈసారీ ఆదుకోని పచ్చిశనగ!
పొలాల్లో పచ్చిశనగ ఆడిస్తున్న యంత్రాలు

దిగుబడిపై ‘తుప్పు తెగులు’ ఎఫెక్ట్‌!

మద్దతు ధర కూడా అంతంతే!

వరుస నష్టాలతో రైతన్న దిగాలు


చేజర్ల, మార్చి 19 : అధిక వర్షాలు.. తెగుళ్ల నేపథ్యంలో ఆశించిన దిగుబడి రాక పచ్చిశనగ రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టిలతో పచ్చిశనగ పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఈసారి వేసిన  పంట మొదట్లో బాగానే ఉందని, కష్టాల నుంచి గట్టెక్కిపోతామనుకుని సంబరపడిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో నవంబరులో వర్షాలు కురవడంతో నవంబరు, డిసంబరులలో సాగు చేయాల్సిన పచ్చిశనగ పంటను  జనవరి మొదటివారం వరకూ రైతులు సాగు చేశారు. పచ్చగా పెరుగుతున్న మొక్కను చూసి సంబరపడిన రైతుకు ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. కోతకు ఇక 20 రోజులు ఉన్న సమయంలో పంటకు గతంలో ఎన్నడూలేని తుప్పుతెగులు ఆశించింది. ఈ తెగులుతో పంట పూర్తిగా ఎండిపోవడం, కాపు ఉన్న పంటలో కాయ పెద్దది కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు పిచికారీ చేసినా ఫలితం రాలేదు. ఎకరాకు 7 నుంచి 10 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 2 నుంచి 4 క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తోంది. కనీసం పురుగు మందుల ఖర్చులు కూడా చేతికి అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పేరుకే కొనుగోలు కేంద్రాలు

ప్రభుత్వం క్వింటం శనగ విత్తనాలను రూ.5230  మద్దతు ధరతో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయితే, మార్క్‌ఫెడ్‌ కన్నా దళారులే నయం అని రైతులు పేర్కొంటున్నారు. గతంలో చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో రెండు లారీల శనగలను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. అయితే గోదాముల వద్ద బస్తాలు దించుకునేటప్పుడు బాగాలేవంటూ అధికారులు రెండు లారీలను వెనక్కి పంపించేశారు. తర్వాత ఆ పంటను అమ్ముకునేందుకు రైతులు నానాతంటాలు పడ్డారు. అదేవిధంగా చిత్తలూరుకు చెందిన రైతు ట్రాక్టరులో నెల్లూరులోని గోదాముకు తీసుకెళ్ళగా అక్కడ అధికారులు రెండు నెలల వరకు డబ్బులు రావు. ఇష్టమైతే ఇవ్వండి. లేదా మీ ఇష్టం అని సమాధానం ఇవ్వడంతో ఆ రైతు చేసేదిలేక వెనక్కి వచ్చేశాడు.  దీనికితోడు విత్తనాలను సబ్సిడీ ద్వారా క్వింటం రూ.5200లకు కొనుగోలు చేసి పంట సాగు చేశామని, అయితే, ప్రభుత్వం తమ నుంచి క్వింటం 5230 రూపాయలకే కొనుగోలు చేయనున్నట్టు కర్షకులు వాపోయారు. ఈ ధర తమకు గిట్టుబాటు కాదని, మద్దతు ధర పెంచి  పచ్చిశనగను కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు.





Updated Date - 2022-03-20T05:06:16+05:30 IST