అంతా ఉత్తుత్తిదే..!

ABN , First Publish Date - 2022-06-28T05:27:10+05:30 IST

గతంలో అర్హులైన వారందరూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా సబ్సిడీతో రుణాలు, వాహనాలు అందిస్తుండగా, గడిచిన మూడేళ్లుగా వీటన్నింటికి బ్రేక్‌ పడింది.

అంతా ఉత్తుత్తిదే..!

ఇన్నోవా కార్లు ఏమయ్యాయో..?

ఆర్భాటంగా దరఖాస్తుల ఆహ్వానం

ఆరు నెలలైనా అతీగతీ లేదు

ఎస్సీ యువతకు మొండిచేయి


అణగారిన వర్గాల యువతకు స్వయం ఉపాధి అన్నారు.. ఇన్నోవా కార్లన్నారు.. ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు.. చివరకు అంతా ఉత్తుత్తిదే అని తేలిపోయింది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ కార్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించి ఆరు నెలలు గడిచినా అతీగతీ లేదు. దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు పూర్తి చేసి, ఎస్సీ యువతను ఊరించి ఉసూరుమనిపించారు. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం కుల కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది.

 

నెల్లూరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : గతంలో అర్హులైన వారందరూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా సబ్సిడీతో రుణాలు, వాహనాలు అందిస్తుండగా, గడిచిన మూడేళ్లుగా వీటన్నింటికి బ్రేక్‌ పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ కార్పొరేషన్ల నుంచి నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలు దూరమయ్యాయి. ఎన్నో ఆశలతో ఉన్న యువత నిరాశ, నిస్పృహలకు లోనైంది. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో సబ్సిడీతో ఇన్నోవా కార్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ ఎస్సీల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీసీ) ద్వారా సబ్సిడీతో వాహనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది ఇన్నోవా కార్లు ఇచ్చేలా నోటిఫికేషన్‌ విడుదల చేయగా, 140 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత డిసెంబరులో ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆ వివరాలను ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఇన్నోవా వాహనాలపై అడుగు ముందుకు పడలేదు. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.  


గత ప్రభుత్వంలో దండిగా... 

తెలుగుదేశం ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా దండిగా సబ్సిడీ రుణాలు అందించారు. సబ్సిడీతో వాహనాలను కూడా నిరుద్యోగులకు ఇచ్చారు. ఒక్క ఎస్సీ కార్పొరేషన్‌లో 2015-19 సంవత్సరాల మధ్య కాలంలో 70 ఇన్నోవా వాహనాలను జిల్లాలోని నిరుద్యోగులకు అందించారు. స్విఫ్ట్‌, డిజైర్‌, ఇటియాస్‌ వంటి చిన్న కార్లను 79 ఇచ్చారు. అలానే 34 ట్రాక్టర్లు, 29 ఆటోలను సబ్సిడీ రూపంలో అందించి యువతకు చేయూతనిచ్చారు. ఇందుకోసం రూ.21 కోట్లను సబ్సిడీగా అందించగా రూ.26.20 కోట్లను బ్యాంకు రుణంగా సమకూర్చి స్వయం ఉపాధి కల్పించారు. కానీ గడిచిన మూడేళ్ల కాలంలో సబ్సిడీ రుణాలకు మంగళం పాడారు. నిరుద్యోగ యువత ప్రతీ సందర్భంలోనూ సబ్సిడీ యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ వస్తున్నారు.

 

ఇంటర్వ్యూలు పూర్తి చేశాం... 

ఇన్నోవా కార్లు ఏమయ్యాయని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సారయ్యను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దరఖాస్తులు స్వీకరించి ఇంటర్య్యూలను పూర్తి చేశామని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చాక ఆ మేరకు నడుచుకుంటామని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-28T05:27:10+05:30 IST