ఇక్కడా.. అక్కడా... ఒక్కరే !

ABN , First Publish Date - 2022-07-25T04:50:53+05:30 IST

ఓ సర్కిల్‌ ఎస్‌ఈగా పనిచేస్తున్న అధికారే, అదే సర్కిల్‌ను పర్యవేక్షించే సీఈగా ఇనచార్జి బాధ్యతలు చూస్తుంటారు...

ఇక్కడా.. అక్కడా... ఒక్కరే !
ఉద్యోగిని నేనే.. ఉన్నతాధికారినేనే !

ఇరిగేషనశాఖలో విచిత్ర పరిస్థితి

ఒక్కో ఇంజనీరుకు రెండేసి పోస్టులు

రెగ్యులర్‌ అధికారితోపాటు పైఅధికారి కూడా అతనే..

ఉద్యోగోన్నతులు, రిక్రూట్‌మెంట్‌ లేకనే ఇలా..

ఓ వైపు పనిభారం, మరో వైపు అవినీతికి ఆస్కారం


నెల్లూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : ఓ సర్కిల్‌ ఎస్‌ఈగా పనిచేస్తున్న అధికారే, అదే సర్కిల్‌ను పర్యవేక్షించే సీఈగా ఇనచార్జి బాధ్యతలు చూస్తుంటారు... మరో సర్కిల్‌లో ఈఈగా పనిచేస్తున్న అధికారే, ఆ సర్కిల్‌లో నిర్ణయాధికారి స్థానం కలిగిన ఎస్‌ఈ పోస్టులో ఇనచార్జిగా కొనసాగుతుం టారు.. ఇంకో సబ్‌ డివిజనలో డీఈగా పనిచేస్తున్న ఇంజ నీరు, అదే డివిజన ఇనచార్జి ఈఈగా కూడా కొనసాగు తుంటారు... ఇదే మాదిరిగా ఏఈఈలు ఇనచార్జి డీఈలుగా పనిచేస్తున్నారు.. ఈ పరిస్థితి జలవనరుల శాఖలో కనిపిస్తోంది.  నిర్ణయం తీసుకునేదీ వాళ్లే.. దాన్ని క్రాస్‌ చెక్‌ చేసి తుదినిర్ణయంగా ఆమోదించేదీ వాళ్లే.. కీలకమైన శాఖలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఈ కారణంగా ఓ వైపు ఇంజనీర్లపై పనిభారం పెరు గుతుండగా, మరోవైపు అవినీతికి తలుపులు తెరిచినట్లుగా ఉంటోంది. జిల్లా పరిధిలో రెగ్యులర్‌ ఇరిగేషన సర్కిల్‌తోపా టు సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టు(ఎస్‌ఎస్‌ఎల్‌బీ) సర్కిళ్లు ఉన్నాయి. వీటిన్నింటిలో భారీగా పనులు జరుగుతున్నాయి. సోమశిల హైలెవల్‌ కెనాల్‌, నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణాలతోపాటు మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు, కాలువల పనులు తెలుగుగంగ పరిధిలో జరుగుతున్నాయి. ఎస్‌కేఎఫ్‌ఎఫ్‌ విస్తరణ, ఉత్తర కాలువ విస్తరణ, సోమశిల ఆఫ్రాన పనులతోపాటు మరికొన్ని ముఖ్యమైన కాలువల నిర్మాణాలు సోమశిల పరిధిలో జరుగుతుండగా, రెగ్యులర్‌ సర్కిల్‌ పరిధిలో నిరంతరం కాలువలు, చెరువులకు మరమ్మతులు, సర్వేపల్లి, జాఫర్‌సాహెబ్‌ కాలువల నిర్మాణం, సర్వేపల్లి రిజర్వాయర్‌ ఆధునికీకరణ, ముదివర్తి కాజ్‌వే వంటి కీలక ప్రాజెక్టులతో పాటు అనేక కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వరుసగా రెండేళ్లు వరదలు రావడంతో ఇరిగేషనశాఖకు భారీగా నష్టం వాటిల్లింది. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు రెగ్యులర్‌ అధికారుల అవసరం ఎంతో ఉంది. కానీ జిల్లాలోని మూడు సర్కిళ్లలోనూ కీలకమైన పోస్టులన్నీ ఇనచార్జిల పాలనలో సాగుతున్నాయి.


 ఒక్కొక్కరికి రెండేసి పోస్టులు


ఏఈఈ నుంచి ఎస్‌ఈ స్థాయి వరకు పలువురు రెండేసి పోస్టుల్లో పనిచేస్తున్నారు. కొందరు మాత్రం ఒక సర్కిల్‌లో రెగ్యులర్‌ పోస్టులో ఉంటూ మరో సర్కిల్‌లో ఇనచార్జిగా బాధ్యతలు చూస్తుండగా, ఇంకొందరు మాత్రం ఒకే సర్కిల్‌లో రెగ్యులర్‌తోపాటు ఇనచార్జిగా మరోపోస్టులోనూ కొనసాగుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కొన్నేళ్ల నుంచి ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పించకపోవడమేనని ఇంజనీర్లు చెబుతున్నారు. సీనియారిటీని ఖరారు చేయకపోవడం, ఖాళీ అయిన ఏఈఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఇరిగేషన శాఖలో ఈ సమస్య ఏర్పడింది. దీని మూలంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇనచార్జి బాధ్యతలు అప్పగించాల్సి వస్తోంది. ఈ ప్రభావం ఇంజనీర్ల పనితీరుపై స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 ఎఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ ఇనచార్జి బాధ్యతలు అప్పగించడంలోనూ సీనియారిటీ అంటూలేదని, రాజకీయ అండదండలు ఉన్న వారు జూనియర్లు అయినా వారికి పైపోస్టుకు ఇనచార్జి బాధ్యతలు దక్కుతున్నాయని ఆ శాఖలో చెప్పుకుంటున్నారు. 


ఇదీ జిల్లాలో పరిస్థితి


తెలుగుగంగ ప్రాజెక్టు రెగ్యులర్‌ ఎస్‌ఈగా హరినారాయణరెడ్డి పనిచేస్తున్నారు. ఆయన తిరుపతి జోన చీఫ్‌ ఇంజనీర్‌గా కూడా ఇనచార్జి బాధ్యతలు నిర్వహి స్తున్నారు. సోమశిల సర్కిల్‌ నాలుగో డివిజన ఈఈగా పనిచేస్తున్న రమణారెడ్డి అదే సర్కిల్‌కు ఇనచార్జి ఎస్‌ఈగా కొనసాగుతున్నారు. రెగ్యులర్‌ సర్కిల్‌ కావలి డివిజన ఈఈగా ఉన్న కృష్ణమోహన, అదే సర్కిల్‌ ఇనచార్జి ఎస్‌ఈగా పనిచేస్తున్నారు. 

తెలుగుగంగ రెండో డివిజన ఈఈ విజయకుమా ర్‌రెడ్డి చిత్తూరు రెగ్యులర్‌ సర్కిల్‌ ఇనచార్జి ఎస్‌ఈగా కూడా కొనసాగుతున్నారు. రెగ్యులర్‌ సర్కిల్‌ నెల్లూరు డివిజన డీఈగా ఉన్న అనీల్‌కుమార్‌, తెలుగుగంగ మూడో డివిజన ఇనచార్జి ఈఈగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌ సర్కిల్‌లో ఆత్మకూరు డీఈగా ఉన్న వెంకటేశ్వర్లు, అదే డివిజనకు ఇనచార్జి ఈఈగా కూడా వ్యవహరిస్తున్నారు. 

రెగ్యులర్‌ సర్కిల్‌లోని కావలి డివిజనలో ఏఈగా పనిచేస్తున్న అధికారే అదే డివిజన డీఈగా కూడా కొనసాగుతున్నారు. కండలేరు సబ్‌ డివిజనలో పనిచేస్తున్న ఓ ఏఈ అదే డివిజనకు ఇనచార్జి డీఈగా ఉన్నారు. తెలుగుగంగ సర్కిల్‌లో రెగ్యులర్‌ ఏఈగా పనిచేస్తున్న ఓ ఇంజనీర్‌ టెక్నికల్‌ డీఈగా కూడా పనిచేస్తున్నారు. నెల్లూరు డ్రైనేజీ డివిజనలో పనిచేస్తున్న ఓ ఏఈ సోమశిల సర్కిల్‌లో ఇనచార్జి డీఈగా ఉన్నారు. ఇటువంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇటీవల జరిగిన బదిలీలకు ముందు వరకు మరికొంతమంది కూడా రెండేసి పోస్టుల్లో పని చేస్తుండే వారు. బదిలీల్లో అవి పోగా, ఇప్పుడు మళ్లీ రెండో పోస్టు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-25T04:50:53+05:30 IST