ఎడ్లబండిని ఢీకొన్న వాహనం
ABN , First Publish Date - 2022-01-26T04:29:00+05:30 IST
ఓ వాహనం నెల్లూరు నుంచి బుచ్చి వైపు వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఎడ్ల(టైరు)బండిని ఢీకొంది.

వాహనంలో నుంచి బయటపడిన రేషన్ బియ్యం
బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 25: ఓ వాహనం నెల్లూరు నుంచి బుచ్చి వైపు వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఎడ్ల(టైరు)బండిని ఢీకొంది. ఈ ఘటనలో బండి నుజ్జునుజ్జు కాగా.. రెండు ఎద్దులకు, బండితోలే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఓ ఎద్దు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో వాహనం రోడ్డు పక్కన పొలాల్లో తిరగబడి, అందులో రవాణా అవుతున్న రేషన్ బియ్యం బయటపడిన వైనం మండలంలోని కాగులపాడు ఆర్చ్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం వేకువజాము సమయంలో నెల్లూరు నుంచి బుచ్చిలో ఓ రైస్ మిల్లుకు రేషన్ బియ్యాన్ని వాహనంలో తరలిస్తుండగా కాగులపాడు ఆర్చ్ సెంటర్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొంది. దీంతో ఏళ్ల తరబడి నుంచి జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం బయటపడింది. సమాచారంతో రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 65బస్తాల రేషన్ బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని 6ఏ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహనాన్ని పోలీసులకు అప్పగించి, బియ్యం గోడౌన్‌కు తరలించినట్లు తెలిపారు. వాహనదారుడు వెంకటేశ్వర్లు నాయుడు పరారీలో ఉన్నాడు. కాగా ఈ ప్రమాదంలో సుమారు లక్షా యాభైవేలు ఆస్తినష్టం జరిగిందని చెల్లాయపాళేనికి చెందిన ఎడ్లబండి యజమాని కోవూరు కార్తీక్ వాపోయాడు. నిత్యం ఆ బండితో ఎరువు, ఇసుక తోలుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో వాహనం ఢీకొనడంతో బతుకు జీవనం పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.