మళ్లీ దుంగల దొంగలు!

ABN , First Publish Date - 2022-10-08T04:16:35+05:30 IST

నెల్లూరు, కడప జిల్లా ల్లోని తూర్పుకనుమలు (వెలుగొండలు) పెనుశిల అభయారణ్యం పేరుతో ఏర్పాటు చేయగా ప్రస్తుతం కడప జిల్లా రెండు ముక్కలై కడప, అన్నమయ్య జిల్లాలుగా మారిన విషయం తెలిసిందే.

మళ్లీ దుంగల దొంగలు!
వెలుగొండల అభయారణ్యం

అభయారణ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌

సోమశిల వెనుక వైపు నుంచి రవాణా

షెల్టర్‌గా మారుతున్న రాపూరు రేంజ్‌!

వరుసగా పట్టుబడుతున్న సరుకు

భయపెట్టిన కలువాయిలో యువకుడి హత్య

తమిళ కూలీల కదలికలు

పోలీస్‌, అటవీ శాఖ జాయింట్‌ ఆపరేషన

కొత్తవారు కనిపిస్తే ఫొటో తీయాలని ప్రచారం


అంతం కాదిది ఆరంభం అంటూ  అభయారణ్యం మరోసారి భయారణ్యంగా మారిందా? ఇక్కడ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయా? మరోసారి అడవుల్లో తమిళ కూలీలు జొరబడ్డారా? పక్క జిల్లాలో ఉన్న హై క్వాలిటీ చందనంపై వారి చూపుపడిందా?   విలువైన ప్రకృతి సంపదను కొల్లగొట్టి నెల్లూరు జిల్లా మీదుగా రవాణా చేస్తున్నారా!? ఎన్నడూలేని విధంగా దారుణ హత్యతో కొత్త సంస్కృతికి తెరలేపారా!? అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.


రాపూరు, అక్టోబరు 7 : నెల్లూరు, కడప జిల్లా ల్లోని తూర్పుకనుమలు (వెలుగొండలు) పెనుశిల అభయారణ్యం పేరుతో ఏర్పాటు చేయగా ప్రస్తుతం కడప జిల్లా రెండు ముక్కలై కడప, అన్నమయ్య జిల్లాలుగా మారిన విషయం తెలిసిందే. సుమారు 12వేల హెక్టార్లలో ఎంతో విలువైన, అరుదైన ఎర్ర చందనం వృక్షాలు ఉన్నాయి. రాపూరు అటవీ రేంజ్‌  పరిధిలో కొంతమంది ఎర్రచందనం స్మగ్లింగ్‌ కార్యకలాపాల్లో మునిగితేలారు. కొండకింద గ్రామాల్లో పలువురు స్మగ్లింగ్‌ జీవనాధారంగా మార్చుకున్నారు కూడా.  అయితే, మూడేళ్లకు ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. శేషాచల అడవుల్లో స్మగ్లర్లను కాల్చివేయడంతోపాటు తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన టాస్క్‌ఫోర్సు అరెస్టులతో ఈ ప్రాంతంలో కూడా స్మగ్లింగ్‌ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే గ్రామాల్లో వెలసిన నానవెజ్‌ దుకాణాలు మూతపడడం, మద్యం షాపుల్లో ఒక్కసారిగా అమ్మకాలు పడిపోవడంతో స్మగ్లింగ్‌కు విరామం ఇచ్చినట్లు అయ్యింది. 


గతేడాది జూన నుంచి...


గతేడాది జూన నెలలో కోటూరుపల్లి ప్రాంతంలో సెబ్‌ అధికారులు ఎర్రచందనం డంప్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. మరోసారి స్మగ్లింగ్‌ కార్యకలాపాలు మొదలయ్యాయా అంటూ ఇటు  సెబ్‌, అటు పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఈ ఏడాది జనవరిలో ఆకిలివలస  గ్రామంలోని తోటలో ఉన్న ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్సు అధికారులు పట్టుకోవడంతో మరోమారు కలకలం రేగింది. సెప్టెంబరులో కలువాయి పరిధిలోని ఎర్రబల్లి గ్రామ సమీపంలో మరోసారి 26 చందనం దుంగులను పోలీసులు స్వాధీనం  చేసకుఉన్నారు. ఈ దుంగలు హై క్వాలిటీ దుంగలు కావడంతో పోలీసులు, సెబ్‌ అప్రమత్తం అయ్యింది. అయితే అడవుల్లో ఎర్రబల్లి గ్రామానికి చెందిన చంద్ర అనే యువకుడి మృతదేహాన్ని గుర్తించారు.  నగదు లావాదేవీలతోనే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆనవాళ్ల కోసం గాలిస్తుండగా తుప్పల్లో దాచిన ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.


సోమశిల వెనుకవైపు సరుకు


సోమశిల డ్యాం వెనుకవైపు (కడప, అన్నమయ్య జిల్లాల) ఉన్న అడవుల్లో ఎర్రచందనం ఉన్నట్టు సమాచారం. అక్కడ చెట్లు నరికి, రాపూరు ప్రాంతానికి తరలించి ఇక్కడ నుంచి చెన్నైకు రవాణా చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నెల్లూరు జిల్లాలో అలాంటి హై క్వాలిటీ సరుకు లేదని, కేవలం సోమశిల బ్యాక్‌వాటర్‌ ప్రాంతంలోనే హైక్వాలిటీ సరుకు ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు.


తమిళ తంబీలు


వెలుగొండ అడవుల్లో తమిళ కూలీల సంచారం మళ్లీ  మొదలైనట్లు తెలుస్తోంది. ఎర్రబల్లి వద్ద పట్టుబడ్డ దుంగలను రోడ్డు చెంతకు తీసుకువచ్చే కెపాసిటీ వారికే మాత్రమే సాధ్యమవుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎనిమిదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో తమిళ కూలీలు బస్సులో ప్రయాణిస్తూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీంతో మరోసారి తమిళ కూలీల ప్రస్తావన వచ్చింది.  అలాగే, ఎర్రచందనం రవాణాకు జాతీయ రహదారి (నెం.565) కలిసొచ్చినట్టు అయ్యింది. వెంకటగిరి నుంచి డక్కిలి, రాపూరు, పెంచలకోన, కలువాయి మీదుగా కొండల కింద రహదారి ఏర్పాటుకావడంతో అటువైపు అడవుల నుంచి ఇటువైపు తీసుకువచ్చి హైవే మీదుగా రవాణా చేస్తున్నారు. 


డీఎ్‌ఫవో సమీక్ష


ఇటీవల డీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్‌ తొలిసారిగా గురువారం రాపూరుకు రేంజ్‌ కార్యాలయానికి చేరుకుని పొద్దుపోయో వరకూ అధికారులతో సమీక్షించారు. ఎర్రచందం స్మగ్లింగ్‌ అడ్డుకట్టకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరా తీశారు. చెక్‌పోస్టులను మరింత పతిష్ట పరిచేలా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. జిల్లా ఎస్పీ, డీఎ్‌ఫవోతో జాయింట్‌గా వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. పల్లెల్లో కొత్త వ్యక్తులు, తమిళ తంబీలు కనిపిస్తే ఫోనలో ఫొటోలు తీసి పంపాలని డీఎఫ్‌వో కోరడంతో ఈ ప్రాంతంలో మరోసారి స్మగ్లింగ్‌ కార్యకలాపాలు ముమ్మరమైనట్లు అర్థమవుతోంది. అయితే, తొలిదశలోనే కళ్లెం వేయాలని అటవీ, పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.



Updated Date - 2022-10-08T04:16:35+05:30 IST