డీలిమిటేషన్ ఎప్పుడు జరిగినా.. మళ్లీ రాపూరు నియోజకవర్గం
ABN , First Publish Date - 2022-12-16T00:15:03+05:30 IST
నియోజక వర్గాల పునర్విభజన ఎప్పుడు జరిగినా మళ్లీ రాపూరు నియోజకవర్గం ఏర్పాటవుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
రాపూరు, డిసెంబరు 15: నియోజక వర్గాల పునర్విభజన ఎప్పుడు జరిగినా మళ్లీ రాపూరు నియోజకవర్గం ఏర్పాటవుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాపూరులో పోలీస్ సర్కిల్ కార్యాలయ భవనాన్ని జిల్లా ఎస్పీ విజయారావుతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ 50ఏళ్ల పాటు రాపూరు నియోజకవర్గ కేంద్రంగా ఉందన్నారు. గత డీలిమిటేషన్లో రద్దయినట్లు తెలిపారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరిగినా మళ్లీ రాపూరు నియోజకవర్గ కేంద్రమయ్యే అవకాశం ఉండడంతో పోలీస్ సర్కిల్ కార్యాలయం ఆవశ్యత ఉందన్నారు. అనంతరం ఎస్పీ విజయరావు మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో ఫ్రెండ్లీ పోలీస్ అవసరమన్నారు. సర్కిల్ భవన నిర్మాణ బాధ్యతలు పూర్తిచేసిన ఏఎస్సై వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు సభలో ప్రకటించారు. ఏఎస్పీ హిమవతి మాట్లాడుతూ పోలీసులు మంచివాళ్లకు మంచివాళ్లు.. చెడ్డవాళ్లకు చెడ్డవాళ్లన్నారు. ఆత్మకూరు డీఎస్పీ కోటిరెడ్డి, సీఐ నాగమల్లేశ్వరరావు, రాపూరు, డ్యాం, కలువాయి, సైదాపురం ఎస్సైలు క్రాంతికుమార్, అనూష ప్రియాంక, ప్రభాకర్, ఉమాశంకర్ తదితరులు కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.