దళితుల స్థలాలు ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-28T04:41:26+05:30 IST

కావలి పట్టణం బుడంగుంటలో దళితుల స్థలాలను ఆక్రమించే వారిపై చర్యలు తీసుకుని వారి నుంచి రక్షణ కల్పించాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌. మల్లి తెలిపారు.

దళితుల స్థలాలు ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలి
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బుడంగుంట దళితులు

కావలి, సెప్టెంబరు 27: కావలి పట్టణం బుడంగుంటలో దళితుల స్థలాలను ఆక్రమించే వారిపై చర్యలు తీసుకుని వారి నుంచి రక్షణ కల్పించాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌. మల్లి తెలిపారు. బుడంగుంట దళిత, గిరిజ బాధితులతో  కలిసి మంగళవారం ఉదయం కావలి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్‌ మాధవరెడ్డికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడంగుంటకు చెందిన దళితులు, గిరిజనులకు 1999లో ప్రభుత్వం నివేశనస్థలాల పట్టాలు ఇచ్చిందన్నారు. పేదల దగ్గర డబ్బులు లేక అక్కడ కొంతకాలం ఇళ్లు నిర్మించుకోలేక పోయారని చెప్పారు. కానీ ఇటీవల అక్కడ ఇళ్లు నిర్మించుకునేందుకు కొందరు పునాదులు వేసుకోగా వాటిని వంటేరు లక్ష్మమ్మ, వంటేరు శ్రీనివాసులు, షేక్‌ కరీం బాషాలు ఆ భూమి తమదని వేసిన పునాదులను తొలగించి తమకు నష్టం కలిగించారని చెప్పారు. గతంలో ప్రభుత్వం వారికి నష్ట పరిహారం చెల్లించి భూమిని కొనుగోలు చేసినా వారు ఇంకా ఆ భూమి తమదేనని లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి తమకు ఇచ్చిన స్థలాలలో ఇళ్లు కట్టుకోనివ్వకుండా వారు చేస్తున్న ఆగడాలను అరికట్టి తమ ఇళ్ల పునాదులు తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, మాల్యాద్రి, కొండయ్య, సుదీర్‌, శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.

Read more