‘కోడ్‌’ వలయం.. అంతా అయోమయం!

ABN , First Publish Date - 2022-06-08T04:51:10+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

‘కోడ్‌’ వలయం..  అంతా అయోమయం!

సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా

నేటి నుంచి 17 వరకు అవకాశం

ఐదేళ్లు ఒకేచోట, ప్రత్యేక రిక్వె్‌స్టలకు అవకాశం

జిల్లాలో ఎన్నికల కోడ్‌

ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆసక్తి


నెల్లూరు, జూన 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీలకు పది రోజుల అవకాశం కల్పించింది. ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు బదిలీలపై నిషేధాన్ని తొలగించింది. ఉన్నత విద్య, వైద్య, ఆరోగ్య శాఖలు (వైద్య విధాన పరిషత మినహా) ఈ బదిలీల నుంచి మినహాయింపు పొందాయి. ఐదేళ్ల నుంచి ఒకేచోట పనిచేస్తున్న వారికి బదిలీలు తప్పనిసరి చేసింది. అలానే కుటుంబ ఆరోగ్య సంబంధ విషయాలు, రిక్వె్‌స్టలు పెట్టుకునే వారికి అవకాశాన్ని బట్టి పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో బదిలీల సందడి కనిపిస్తోంది. కానీ జిల్లాలో మాత్రం అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్‌ అమల్లో ఉండటమే ఇందుకు కారణం. ఎన్నికల కమిషన నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఎటువంటి బదిలీలు, ఉద్యోగోన్నతులు, కొత్త ఉద్యోగాల కల్పన వంటి ప్రక్రియలు చేపట్టకూడదు. ఈ నేపథ్యంలో జిల్లాలో బదిలీలపై సందిగ్ధం ఏర్పడింది.  అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రత్యేక ఉత్తర్వులు అందలేదని జిల్లా అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం పది రోజులే గడువు ఇవ్వడంతో జిల్లా ఉన్నతాధికారులు బదిలీలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. 


స్పష్టత కరువు..


జిల్లాలో 20 వేల మందికిపైగా ఉద్యోగులు ఉండగా, వీరిలో కనీసం 20 శాతం మందికి బదిలీలు జరగవచ్చని అంచనా. సీనియర్‌ అసిస్టెంటు కేడర్‌లోపు వారిని జిల్లా స్థాయిలోనే బదిలీ చేయనుండగా, ఆపై స్థాయి ఉద్యోగులను జోనస్థాయిలో బదిలీ చేస్తారు. అయితే జిల్లాలో పరిస్థితే స్పష్టత లేకుండా పోయింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు బదిలీలను వాయిదా వేస్తారా!? లేదా ఇప్పుడు ఉద్యోగుల నుంచి బదిలీలకు ఆప్షన్లు తీసుకొని ఎన్నికల కోడ్‌ ముగిశాక ఆర్డర్లు ఇస్తారా.. అన్నది తెలియడం లేదు. కోడ్‌ ముగిశాక బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు తగిన విధంగా బదిలీ ఉత్తర్వుల్లో ఆ విషయాన్ని స్పష్టం చేయకపోవడం ఉద్యోగుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఇక జోనల్‌ స్థాయిలో మిగతా జిల్లాలో బదిలీలు పూర్తయితే జిల్లాలోని ఉద్యోగులు అవకాశం కోల్పోతారని కొందరు ఉద్యోగులు అంటున్నారు. కాగా జిల్లాల విభజన జరిగినప్పటికీ ఇంతవరకు జోన్ల విభజన జరగలేదు. అయితే ఇప్పుడు ఉద్యోగుల బదిలీలు కొత్త జిల్లాల ప్రకారం చేస్తారా లేదా పాత జిల్లాలను పరిగణలోకి తీసుకొని చేస్తారా అన్న సందేహం కూడా ఉద్యోగుల్లో ఉంది. కొత్త జిల్లాల ప్రకారం బదిలీలు చేస్తే జోన-3(ఉమ్మడి నెల్లూరు)లో ఉద్యోగం పొందిన వారు జోన-4(ఉమ్మడి చిత్తూరు)లోకి బదిలీ అయితే తమ సీనియారిటీ ఎలా ఉంటుందన్న దానిపై కూడా మరికొంత మంది ఉద్యోగుల్లో ఆందోళన కనిపిస్తోంది. మొత్తంగా జిల్లాలో బదిలీలకు సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. 


ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నాం


జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో సాధారణ బదిలీలపై రాష్ట్ర ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నాం. ఎన్నికల విధుల్లో ఉన్న నోడల్‌ అధికారులకు బదిలీ ఉత్తర్వులు వచ్చినా ఎన్నికల ప్రక్రియ ముగిశాకనే రిలీవ్‌ చేస్తాం. జిల్లాస్థాయిలోని అంతర్గత బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొని ఉద్యోగులకు తెలియజేస్తాం. 

- కేవీఎన చక్రధర్‌బాబు, కలెక్టర్‌

Read more