బీసీలకు, దళితులకు వైసీపీ చేసిందేమి లేదు
ABN , First Publish Date - 2022-12-07T23:54:00+05:30 IST
మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో బీసీలకు, దళితులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు.
మనుబోలు, డిసెంబరు 7: మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో బీసీలకు, దళితులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతుగా ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం మనుబోలులోని దళితవాడలో ఆయన పర్యటించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించాలంటూ కరపత్రాలు అందించారు. అంతకు మునుపు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీలను ఆదరించింది, 27శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో బీసీల కోసమంటూ వైసీపీ కార్పొరేషన్లు పెట్టింది.. అయితే వాటికి పైసా నిధులు ఇవ్వలేదన్నారు. అలాగే దళితులకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. కాగా అబద్ధాల వలన ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ఆర్థిక స్థితిగతులు మారతాయన్నారు. కార్యక్రమంలో సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల ఇన్‌చార్జులు పూలచంద్రశేఖర్, పంటా శ్రీనివాసులురెడ్డి, బ్లాక్ కమిటీ అధ్యక్షుడు దుంపల నాగరాజు, తారకేశ్వర్ రెడ్డి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు దాసరి అంకయ్య పాల్గొన్నారు.
ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి
పొదలకూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వలన దేశంలో రోజురోజుకు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. బుధవారం పంచాయతీ పరిధిలోని ఏసీ కాలనీ, లింగపల్లి దళితవాడల్లో ఆయన జోడో యాత్రలో భాగంగా ఇంటింటికి వెళ్లి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో మొదలై ప్రస్తుతం రాజస్థాన్‌లో సాగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలు ఎత్తేసి ద్రోహం చేస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు తుడిచిపెట్టుకుపోతాయన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు పూల చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు బీసీ బాబు, మహిళా అధ్యక్షురాలు జి.ప్రమీల, వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పంటా శ్రీనివాసులురెడ్డి, దుంపల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.