హాజరుకే హాఫ్ డే!
ABN , First Publish Date - 2022-08-18T05:18:01+05:30 IST
ఉపాధ్యాయుల హాజరుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టింది. ముఖహాజరు (ఫేస్ రికగ్నిషన) పద్ధతి ద్వారా ఉపాధ్యాయులు అటెండెన్స వేసుకోవాలి.

టీచర్లకు హాజరు కష్టాలు
యాప్ ఓపెన కాక అవస్థలు
ఉదయం 8 నుంచి 11 గంటల వరకు తిప్పలు
సొంత ఫోన్లలో హాజరు వేయలేమని టీచర్ల గగ్గోలు
తరగతి గదుల్లో పాఠాలు బోధించాలిసన సమయంలో తరగతి గదుల బయట సెల్ఫోన్లతో కుస్తీ. ఇలా పది, ఇరవై నిమిషాలు కాదు.. గంటలు దాటి, సగం రోజు గడిచిపోయింది.
మొరాయించిన సర్వర్‌తో ముఖహాజరు (ఫేస్ రికగ్నిషన) సాధ్యం కాక ఉపాతిధ్యాయులు అల్లాడిపోయారు. లాగిన సమస్య ఎదురుకావడంతో సెల్ ఫోన చేతపట్టుకొని పాఠశాల ఆవరణలో ఆ మూలకు.. ఈ మూలకు తిరిగారు. ఉదయం 8 నుంచి 9 గంటలలోపు లాగిన కాని పక్షంలో ఆప్సెంట్ పడుతుందనే ఆందోళనతో అల్లాడిపోయారు. ఉదయం 11 గంటల వరకు కూడా సర్వర్ అందుబాటులోకి రాకపోవడంతో పలువురు ఉపాధ్యాయులు మ్యానువల్‌గానే అటెండెన్స వేసుకున్నారు. ప్రతిరోజు ఈ తలనొప్పి పడలేమని, సొంత సెల్ఫోన్లలో అటెండెన్స విధానాన్ని రద్దు చేయాలని పలుచోట్ల ఉపాధ్యాయులు ప్రధానోపాద్యాయులకు వినతిపత్రాలు సమర్పించారు.
నెల్లూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల హాజరుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టింది. ముఖహాజరు (ఫేస్ రికగ్నిషన) పద్ధతి ద్వారా ఉపాధ్యాయులు అటెండెన్స వేసుకోవాలి. ఉదయం 8 గంటలకు ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకొని తమ సొంత మొబైల్ ద్వారా లాగినై అటెండెన్స వేసుకోవాలి. 9 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలి. లేదంటే ఆ రోజు అప్సెంట్ పడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ ఒకే సమయానికి లాగిన అవడంతో సర్వర్ మొరాయిస్తోంది. దీంతో సగం రోజు ఉపాధ్యాయులు తరగతి గదుల బయట సెల్‌ఫోన పట్టుకొని అటు, ఇటు తిరగడానికే సరిపోతోంది. ఆంధ్రజ్యోతి బృందం జిల్లావ్యాప్తంగా బుధవారం జరిపిన పరిశీలనలో ఉపాధ్యాయులు సెల్ఫోన్లతో కుస్తీ పడుతున్న దృశ్యాలే కనిపించాయి.
ముత్తుకూరు జడ్పీ హైస్కూలులో ఉదయం నుంచి ప్రయత్నిస్తే 11.30 గంటలకు హాజరు నమోదు పూర్తయ్యింది. కలువాయి హైస్కూలులో మధ్యాహ్నం 12.15 గంటలకు కాని హాజరు నమోదు కాలేదు. ఆత్మకూరు, మర్రిపాడు, కలువాయి, చేజర్ల, ఉదయగిరి, సంగం, వలేటివారిపాలెం, నెల్లూరు రూరల్, కావలి, పొదలకూరు అనంతసాగరం ఇలా జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటెండెన్స నమోదు కోసం మొబైల్స్‌తో కుస్తీ పట్టడానికే సరిపోయింది. ఒకమాటలో చెప్పాలంటే ఈ కొత్త విధానం ప్రారంభమైన రెండు రోజుల్లో బడులు పూర్తి సమయం జరిగాయి కానీ పాఠాలు మాత్రం ఒక్క పూటకే పరిమితం అయ్యాయి. ఈ అవస్థలు పడలేక వ్యక్తిగత సెల్ నుంచి మినహాయించాలని కోరుతూ పొదలకూరు, చేజర్ల, కొండాపురం, ఉదయగిరి తదితర మండలాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకు వినతి పత్రాలు సమర్పించారు.
ఆత్మకూరు : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 18 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు యాప్‌లో లాగిన అయ్యేందుకు ప్రయత్నించగా లాగిన ఎర్రర్ చూపించడం మొదలు పెట్టింది. దాంతో సెల్ఫోన్లు పట్టుకుని పాఠశాల ప్రాంగణం పరిధిలో, చెట్ల కింద నిలబడి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మాన్యువల్ విధానంలోనే హాజరు నమోదు చేయాల్సి వచ్చింది.
కలువాయి : జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మొత్తం 35 మంది ఉన్నారు. ఉదయం 8.30కు యాప్‌లో లాగిన అయి హాజరువేసేందుకు ప్రయత్నించగా సర్వర్ మొరాయించింది. ఎంతసేపటికీ లాగిన కాలేకపోవడంతో తరగతులకు వెళ్లిపోయారు. యాప్‌లో ఓ ఉపాధ్యాయుడి పేరు గల్లంతైంది. తమ సొంత ఫోనలో యాప్ డౌనలోడ్ చేసుకుని హాజరు వేయలేమని దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యా యుడు ఎస్.జనార్థనరెడ్డికి ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు.
అనంతసాగరం : హిందూ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా, సర్వర్ లేని కారణంగా హాజరు వేసుకోలేకపోయారు. యాప్ సమస్యతో విద్యాబోధనకు ఆటంకం నెలకొందని వారు తెలిపారు.
సంగం : ఉన్నత పాఠశాలలో 24 మంది ఉపాధ్యాయులు, నలుగురు బోధనేతర సిబ్బంది ఉన్నారు. అందరూ సిమ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని రిజిసే్ట్రషన చేసుకున్నారు. కానీ ఒక్కరికి మాత్రమే హాజరుపడింది. అదేవిధంగా రాళ్లచెలిక పాఠశాలలో కూడా ముగ్గురు ఉండగా ఇద్దరికే నమోదు అయింది.
బుచ్చిరెడ్డిపాళెం : కొత్త విధానం వల్ల బుచ్చి మండలంలో టీచర్ల హాజరు 80శాతానికే పరిమితమైంది. సర్వర్ సమస్యతో పలువురు సతమతమయ్యారు. పలుచోట్ల నిర్ణీత సమయందాటి ఉదయం 11గంటల తరువాత హాజరు నమోదైంది.
చేజర్ల : బిల్లుపాడు పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు నమోదు కోసం అవస్థలు పడ్డారు. ఉదయం 8 గంటల నుంచి ప్రయత్నించినా యాప్‌లో నమోదు చేయలేకపోతున్నామని తెలిపారు. తూర్పుపల్లిలో ఉపాధ్యాయులు హెచఎంకు వినతిపత్రం ఇచ్చారు.
ఈ విధానం వద్దు బాబోయ్!
ఉదయగిరి రూరల్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన హాజరును వ్యతిరేకిస్తూ ఉదయగిరి ఎంఈవో కార్యాలయం ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్నం భోజన పథకం తదితర వివరాలు అప్లోడ్ చేసేందుకు ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ యాప్ తమ సొంత ఫోనలో డౌనలోడ్ చేసుకోవాలని ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఆ యాప్ డౌనలోడ్ చేసుకుంటే తమ వ్యక్తి సమాచారానికి భద్రత ఉండదన్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రత్నామ్నాయం చూపితే అందులో హాజరు నమోదు, ఇతరత్రా వివరాలు అప్లోడ్ చేస్తామన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో సంఘ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పొదలకూరు : తమ ఫోనలో కాకుండా ఒక డివైజ్ ఏర్పాటు చేసి నెట్వర్క్ ఏర్పాటు చేస్తే తప్ప హాజరు వేయలేమని తెలుపుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులు నాయకులు రఘు, బి.వెంకటేశ్వర్లు, సునీల్‌కుమార్, రవి కళ్యాణ్, లక్ష్మీనారాయణ, మాల్యాద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
