ఆహా.. ఓహో...!

ABN , First Publish Date - 2022-08-18T05:21:11+05:30 IST

వ్యవసాయశాఖ మంత్రి స్థానంలో కాకాణి గోవర్థనరెడ్డి ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డిని కొనియాడారు.

ఆహా.. ఓహో...!
మంత్రి కాకాణికి జ్ఞాపిక అందజేస్తున్న వీసీ విష్ణువర్ధనరెడ్డి, పక్కన కలెక్టర్‌ చక్రధర్‌బాబు

రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కాకాణిపై పొగడ్తల వర్షం

ప్రశంసల వేదికగా వ్యవసాయ పరిశోధనా స్థానం

అధికారుల భజనపై చర్చనీయాంశం


మునుపెన్నడూ చేయని సంక్షేమ కార్యక్రమాలు తమ ప్రభుత్వం చేస్తోందంటూ రాజకీయ నాయకులు గొప్పలు చెప్పుకోవడం పరిపాటి. పార్టీ మీటింగులు పెట్టి మరీ తమ నాయకులను పొగడ్తలతో ముంచెత్తడం సాధారణ విషయమే. అయితే పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు సైతం ప్రభుత్వాలను పొగడ్తలతో ముంచెత్తడం చూసి రైతులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు ముక్కున వేలేసుకున్నారు. వీరు అధికారులా లేదా అధికార పార్టీ కార్యకర్తలా అంటూ చర్చించుకున్నారు. బుధవారం నెల్లూరులోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిధిలో రూ.36 కోట్లతో నిర్మించిన 13 నూతన భవనాల ప్రారంభ కార్యక్రమం అభాసుపాలైంది.


నెల్లూరు (వ్యవసాయం), ఆగష్టు 17 : వ్యవసాయశాఖ మంత్రి స్థానంలో కాకాణి గోవర్థనరెడ్డి ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డిని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పైనా విమర్శలు గుప్పించారు. ఎన్జీ రంగా యూరివర్సిటీ వీసీ విష్ణువర్ధనరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎంతో సహకరిస్తోందని, ఎక్కడా రాజీ పడొద్దని రైతులకు మంచి చేయాలని తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం తెచ్చే నూతన వంగడాలను అందించేందుకు కృషి చేయాలని సూచిస్తోందని కొనియాడారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి పదవి చేపట్టిన వెంటనే తమ విశ్వవిద్యాలయానికి మహర్ధశ పట్టుకున్నట్లు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేగాక కాకాణి రాకతో శాస్త్రవేత్తల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లైందని మంత్రి చేతుల మీదుగా భవనాల ప్రారంభ కార్యక్రమం జరగడం చెప్పలేనంత సంతోషంగా ఉందని పొగడ్తలతో ముంచెత్తడం ఒకటైతే ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని చెప్పడంతో మంత్రితోపాటు వేదికపై ఉన్న వారు, రైతులు  నవ్వుకున్నారు. ఇదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని, నిజంగా ఇది రైతు ప్రభుత్వమని కలెక్టర్‌ చక్రధర్‌బాబు చెప్పడంతో మీడియాతోపాటు అందరూ ఒకింత అసహనానికి గురయ్యారు. గతంలో ఎప్పుడూ పథకాలు లేనట్లు, ఇప్పుడీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినట్లు వలంటీర్ల కన్నా దారుణంగా ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తి పోస్తున్నారంటూ నవ్వుకున్నారు.


రైతులతో ఇష్టాగోష్టి ఏదీ!?


భవనాల ప్రారంభం అనంతరం రైతులతో మంత్రి కాకాణి  ఇష్టాగోష్టి కార్యక్రమం జరగాలి. కానీ అది జరగలేదు. కేవలం ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలపై ప్రచార కార్యక్రమంలా సాగిందే తప్ప రైతుల సమస్యలపై కనీసం చర్చ జరగలేదు. దీంతో తమ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన రైతుల ఆశలు నీరుగారిపోయాయి. అతిథులు చెప్పే మాటలు వినాల్సిందే తప్ప మన సమస్యలు పట్టించుకోరంటూ రైతులు పెదవి విరిచారు. కనీసం రైతుల సమస్యలపై ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, కనీసం మాట్లాడే అవకాశం లభించకపోవడంతో రైతులు అసహనానికి గురయ్యారు.



వ్యవసాయ పంపుసెట్ల 

జీవోను ఉపసంహరించుకోవాలి


మంత్రి కాకాణికి అఖిల పక్ష రైతు సంఘం వినతి


వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే జీవో నెం.22ను ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష రైతు సంఘం డిమాండ్‌ చేసింది. నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి కాకాణి గోవర్థనరెడ్డిని ఈ సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి  బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ట్రక్‌ షీట్‌ రాని రైతులను గుర్తించి ట్రక్‌ షీట్‌ ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. రెండో పంట మార్కెట్‌లోకి రావడం ప్రారంభమైందని ఈక్రాప్‌ వెంటనే చేయించాలని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. వరి మద్దతు ధరను చట్టం చేయాలని సర్వేపల్లి, జాఫర్‌ సాహెబ్‌ కాలువల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సంఘం జిల్లా కన్వీనర్‌ గంగపట్నం రమణయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ షానవాజ్‌, రైతు సంఘాల సమాఖ్య నాయకుడు మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:21:11+05:30 IST