‘అధికార’ బరితెగింపు!

ABN , First Publish Date - 2022-12-08T23:35:08+05:30 IST

ఇప్పటి వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించడం, మరొకరి పేర్లపైకి రికార్డులు మార్చడం చూశాం.. అయితే ఇప్పుడు ప్రైవేటు భూములనూ అక్రమార్కులు వదలడం లేదు. ఏకంగా పట్టా భూములపైనా కొందరి వైసీపీ నేతల కన్ను పడింది. ఎక్కడైనా భూమి ఖాళీగా ఉండి, ఆ భూమి హక్కుదారుడు దూరంగా ఉంటే చాలు అటువంటి భూములను హస్తగతం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కుదిరితే మొత్తం భూమిని లాగేసుకోవడం లేదంటే ఆ భూమిపై వివాదం సృష్టించి తక్కువ ధరకు కొనుగోలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బయట జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. నెల్లూరు రూరల్‌ మండలం కోడూరుపాడులో వెలుగుచూసిన ఈ తరహా వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.

‘అధికార’ బరితెగింపు!
ఈ భూమిలోకి ప్రవేశించడం నిషేధమంటూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

నెల్లూరురూరల్‌ మండలంలో 8.37 ఎకరాలపై కన్ను

పట్టా భూమి అయినా డిస్పూట్‌ కింద మార్పు

పేదలకు స్థలాల మాటున స్వాహా ప్రయత్నం

హైకోర్టు ఉత్తర్వులతో ఊపిరిపీల్చుకున్న పట్టాదారుడు

నెల్లూరు, డిసెంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు రూరల్‌ మండలం గుడిపల్లిపాడు రెవెన్యూ పరిధిలోని కోడూరుపాడులో రెండు సర్వే నెంబర్ల భిన్నాల్లో 8.37 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇదే సర్వే నెంబర్లలో వేరొక భిన్నాల్లో మరికొంత ప్రభుత్వ భూమి ఉంది. మొదట్లో ఈ మొత్తం భూమి ప్రభుత్వానిదిగా రికార్డుల్లో నమోదై ఉంది. అయితే సుమారు యాభై ఏళ్ల క్రితం అప్పటి కలెక్టర్‌ ఇందులో పట్టాగా చెబుతున్న భూమిని ఎక్స్‌సర్వీ్‌సమెన కోటా కింద అర్హులకు మంజూరు చేశారు. సదరు ఎక్స్‌సర్సీ్‌సమెన ఆ భూమిని కొన్నేళ్ల తర్వాత మరో వ్యక్తికి నిబంధనల ప్రకారం విక్రయించారు. ఇప్పటికీ కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్ల మీదనే వెబ్‌ల్యాండ్‌లో రికార్డులు ఉన్నాయి. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత ఆ భూమిని దక్కించుకోవాలని తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. ముందు కొందరి చేత ఆ భూమిలో గుడిసెలు వేయించి ఆ తర్వాత అసలు వ్యక్తులు రంగంలోకి దిగేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అప్పటి వరకు ఎటువంటి డిస్పూట్‌ లేకుండా ఉన్న భూమిని వెబ్‌ల్యాండ్‌లో డిస్పూట్‌ (వివాదం) కింద మార్చేశారు. ఈ పట్టా భూమిలో పేదలకు ప్లాట్లు ఇస్తామంటూ హద్దు రాళ్లు కూడా నాటించారు. ఈ విషయం తెలుసుకున్న అసలు పట్టాదారులు హుటాహుటిన భూమి వద్దకు రాగా, వారిని అడ్డుకున్నారు. దీంతో వారు నెల్లూరు రూరల్‌ మండల రెవెన్యూ అధికారులను సంప్రదించినా కదలిక లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తమ వద్ద ఉన్న పట్టాలను సమర్పించడంతో కోర్టు స్టేటస్‌ కో ఆర్డర్‌ ఇచ్చింది. ఈ ఉత్తర్వులను తీసుకొని ఈ దఫా కలెక్టర్‌ చక్రధర్‌బాబు, జేసీ రోణంకి కూర్మనాథ్‌లను కలిశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు రూరల్‌ మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ భూమిలోకి ఎవరినీ రానీయకుండా 145 సెక్షన అమలు చేయాలని ఆదేశించారు. దీంతో కదిలిన రూరల్‌ మండల రెవెన్యూ అధికారులు తాజాగా ఆ భూమిలో బోర్డు పెట్టడం గమనార్హం.

ఎకరం రూ.2 కోట్లు

రెండు సర్వే నెంబర్లలోని 8.37 ఎకరాలు కీలకమైన కోడూరుపాడు ప్రాంతంలో ఉంది. అక్కడ ఎకరా రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. ఆర్‌ఎ్‌సఆర్‌లో ఇది ప్రభుత్వ భూమిగా చూపిస్తుండటంతో దాని ప్రకారం పేదల ముసుగులో భూమిని కొట్టేయాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే భూమిపై గతంలోనూ ఓసారి ఫిర్యాదు రావడంతో సీసీఎల్‌ఏ విచారించి కలెక్టర్‌ ఎక్స్‌సర్వీ్‌సమెన కోటా కింద పట్టాలు మంజూరు చేశారు కాబట్టి అది పట్టా భూమేనని డిక్లేర్‌ చేసినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. స్టేటస్‌ కో వచ్చాక ఈ భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించగా ఈ విషయాలన్నీ బయటకొచ్చాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాగా ఇది ఒకవేళ ప్రభుత్వ భూమే అనుకున్నా ప్రభుత్వమే అందులో ఏ కార్యక్రమమైనా చేపట్టాలి. కానీ ఎవరో ప్రైవేటు వ్యక్తులు వచ్చి పేదలకు పట్టాలు ఇస్తున్నామంటూ రాళ్లు నాటడం ఇక్కడ అనుమానాలను కలిగిస్తోంది. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా నెల్లూరు రూరల్‌ మండల అధికారులకు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

కోర్టు ఆదేశాలను అమలు చేయమన్నాం

తన భూమిలోకి తనను రానీయడం లేదంటూ ఓ వ్యక్తి వివరాలతో సహా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కోర్టు స్టేటస్‌ కో ఉత్తర్వులు కూడా తీసుకొచ్చారు. వీటిని పరిశీలించి నిబంధనల ప్రకారం నడుచుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించాం.

- రోణంకి కూర్మనాథ్‌, జాయింట్‌ కలెక్టర్‌

Updated Date - 2022-12-08T23:35:12+05:30 IST