రెండోసారీ ప్చ్!
ABN , First Publish Date - 2022-01-13T05:32:49+05:30 IST
సంగం వారధిపై ఇసుక బస్తాల ఏర్పాటు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది.
కొలిక్కిరాని సంగం వద్ద రింగ్‌బండ్ ఏర్పాటు
ముందుకురాని కాంట్రాక్టర్లు
ఆందోళనలో వేలాది మంది రైతులు
మూడోసారి టెండర్ల ఆహ్వానం?
నెల్లూరు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : సంగం వారధిపై ఇసుక బస్తాల ఏర్పాటు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. రెండోసారి వేసిన టెండర్లలోనూ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వేలాది మంది రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. ఏటా ఆనకట్ట వద్ద వారధిపై రింగ్‌బండ్ (ఇసుక బస్తాలు) ఏర్పాటు చేస్తారు. దాదాపు ఐదడుగులు మేర ఇసుక బస్తాలను వేయడం ద్వారా సంగం ఆనకట్ట ఎగువన నీటి మట్టం పెంచి కావలి, కనుపూరు కాలువలకు నీటిని విడుదల చేస్తుంటారు. డిసెంబరు 15వ తేదీన ఇసుక బస్తాల ఏర్పాటుకు ఇరిగేషన అధికారులు టెండర్లు పిలిచారు. దాదాపు 1.50 లక్షల బస్తాలు వేసేలా అందుకు రూ.53 లక్షల అంచనాలతో టెండర్లు ఆహ్వానించారు. అదే నెల 28న టెండరు గడువు ముగిసినా ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ దాఖలు చేయలేదు. తర్వాత ఈ నెల 3వ తేదీన షార్ట్ టెండర్ పిలవగా 10వ తేదీతో గడువు ముగిసింది. రెండో సారి కూడా ఎవరూ టెండర్ వేయలేదు. ఇందుకు ప్రధాన కారణం బిల్లులు రాకపోవడమేనని తెలుస్తోంది. గడిచిన రెండేళ్లుగా వేసిన ఇసుక బస్తాల పనులకు ఇంతవరకు కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదు. పాత బిల్లులే రాకపోతే ఇప్పుడు పనులెలా చేయగలమంటూ కాంట్రాక్టర్లంతా ఆసక్తి కనబరచలేదు.
రైతుల్లో ఆందోళన
ఇసుక బస్తాలు వేసే ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు పనులు చేసేందుకే ఎవరూ ముందుకు రాకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. కావలి కాలువ కింద 1.24 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 66 వేల ఎకరాల పంట సాగు జరుగుతోంది. ఇప్పటివరకు చెరువుల్లో నీరు ఉండడంతో వాటిని సర్దుకుంటూ వస్తున్నారు. అయితే త్వరలోనే నీటి సమస్య మొదలుకానుంది. ఈలోపు ఇసుక బస్తాల ఏర్పాటు పూర్తి చేయకపోతే రైతాంగానికి ఇబ్బందులు తప్పవు. మరి ఈ సమస్యను అటు ప్రజజాప్రతినిధులు, ఇటు అధికారులు ఎలా పరిష్కరిస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. రెండు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదంటే మూడోసారి పిలిచినా ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశముంది. అప్పుడు మరింత ఆలస్యమవుతుంది. కాబట్టి ఈలోపే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ఎవరికైనా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తామని ఒప్పించి పనులు చేయించకపోతే వేల మంది రైతులు నష్టపోవడం ఖాయమని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా దీనిపై బుచ్చి డీఈ మధును వివరణ కోరగా రెండో కాల్లోనూ ఎవరూ టెండర్లు వేయని మాట వాస్తవమేనన్నారు. త్వరలోనే మూడో కాల్ పిలుస్తామని, ఈసారి ఎక్స్పీరియన్స తగ్గుతుంది కాబట్టి ఎవరైనా కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశాలుంటాయని చెప్పారు.