ఇలాంటి నివేదికలు పంపిస్తారా?

ABN , First Publish Date - 2022-12-15T23:38:21+05:30 IST

రైతులకు జరిగిన నష్టాన్ని అన్ని వైపులా పరిశీలించి న్యాయమైన పరిహారాన్ని సూచిస్తూ ప్రభుత్వానికి పంపాల్సిన అధికారులు..

   ఇలాంటి నివేదికలు పంపిస్తారా?
సీపీఎం నాయకులు, రైతుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి, ఉద్రిక్తత దృశ్యం

కొండంత నష్టానికి గోరంత పరిహారం ఏమిటి?

రైతులను ఆదుకోకపోతే ప్రజాప్రతినిధులను నిర్బంధిస్తాం

మాండుస్‌పై కలెక్టరేట్‌ ముట్టడి, ఉద్రిక్తత

కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 15: రైతులకు జరిగిన నష్టాన్ని అన్ని వైపులా పరిశీలించి న్యాయమైన పరిహారాన్ని సూచిస్తూ ప్రభుత్వానికి పంపాల్సిన అధికారులు.. మాండస్‌ తుఫాన వల్ల పంట నష్టం జరగలేదని నివేదికలు తయారు చేయడం ఏమిటని సీపీఎం, రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలంటూ సీపీఎం, రైతు సంఘాల నేతృత్వంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు గురువారం కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ గోడును వెళ్లబోసుకోవడానికి కలెక్టర్‌ను కలవాలని రైతులు భీష్మించడంతో పోలీసులు వారిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీపీఎం ఓల్డ్‌ సిటీ కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌, కార్యవర్గ సభ్యురాలు నిర్మల, కేవీ నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్‌ పంటలు ఒక్క రైతుకు కూడా అందలేని, రైతులు అప్పులపాలయ్యారని అన్నారు. అయినా వ్యవసాయశాఖ అధికారులు మిన్నకుండిపోయారని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మాండుస్‌ తుఫాన వల్ల రైతులకు ఎటువంటి నష్టం జరగలేదని పత్రికా ప్రకటన ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. నాసిరకం విత్తనాల వల్ల పత్తి పంటలో దిగుబడి రాలేదని చెప్పకుండా వాతావారణ పరిస్థితులవల్లే పంటలు దెబ్బతిన్నట్లు శాస్త్రవేత్తలు నివేదిక ఇవ్వడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా.. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా పొలాల వైపు వెళ్లలేదని ఆరోపించారు. ఎకరా పత్తి పంట సాగుకు రైతులు రూ.45 నుంచి 60 వేలు దాకా ఖర్చు పెడితే.. కనీసం ఒక క్వింటం పత్తి కూడా చేతికందని పరిస్థితి దాపురించిందన్నారు. ఉల్లిగడ్డలు, టమోటాలు సాగు చేసిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయం ముందు రెండు గంటల పాటు రైతులు బైఠాయించినా అధికారులు రాకపోవడంతో రైతులు కలెక్టరేట్‌ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఉన్నతాధికారులు కర్నూలు ఏడీఏ శాలురెడ్డిని అక్కడికి పంపించారు. ఆయన రైతుల నుంచి వినతి పత్రాన్ని తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి శాంతించింది. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు నాగేష్‌, గురుశేఖర్‌, ఆనందబాబు, మండల నాయకులు రాఘవేంద్ర, ఉశేనయ్య, మధు, నాగన్న పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:38:22+05:30 IST