దేనికి ఈ టమోటా?

ABN , First Publish Date - 2022-11-16T00:23:51+05:30 IST

ధర ఇలా పడిపోతే రైతుకు కడుపు మండదా? కిలో రూపాయి కూడా ధర లేదని టమోటా రైతుఽలు ఆగ్రహించా రు.

దేనికి ఈ టమోటా?
మార్కెట్‌యార్డు ముందు రోడ్డుపై టమోటాలను పారబోసి నిరసన తెలుపుతున్న రైతులు

రోడ్డు మీద పారబోసిన రైతులు

పత్తికొండ మార్కెట్‌లో కిలో రూపాయి

పత్తాలేని మార్కెట్‌ యార్డు అధికారులు

పత్తికొండ, నవంబరు 15: ధర ఇలా పడిపోతే రైతుకు కడుపు మండదా? కిలో రూపాయి కూడా ధర లేదని టమోటా రైతుఽలు ఆగ్రహించా రు. రోడ్డు మీద టమోటాను పారబోసి నిరసన దిగారు. పత్తికొండలో సుమారు రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో రైతులు ఆందోళన విరమించారు. వారం కింద టమోటా ధరలు పడిపోయి ఆందోళనకు దిగిన సందర్భంలో మార్కెట్‌ శాఖ జిల్లా అధికారి స్వయంగా మార్కెట్‌కు వచ్చి కనీస మద్దతు ధర రూ.5 ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారం గడవక ముందే గిట్టుబాటు ధర ఇవ్వడం అటుంచి మంగళవారం ఘోరంగా మరోసారి పత్తికొండ మార్కెట్‌యార్డులో ధరలు పడిపోయాయి. వ్యాపారులు కిలో రూపాయి కంటే తక్కువకు కొనడానికి సిద్ధమయ్యారు. కిలో జత గంపలు రూ.20 నుంచి రూ.50 వరకు కొన్నారు. కమీషన్‌ పోను కిలో 90పైసలు నుంచి రూ.2.25పైసల వరకు పంట అమ్ముడు పోయింది. ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెట్టి వందల రూపాయలు కూలీలకు ఖర్చు పెట్టి గంపకు రూ.10 నుంచి రూ.20 ఆటో రవాణా చార్జీలు చెల్లించి మార్కెట్‌కు తెస్తే కిలో మీద రూపాయి ఆదాయం రాకపోతే అమ్మి మాత్రం ఏం ప్రయోజనం? అని రైతులు ఆగ్రహించారు. ఇంత జరుగుతున్నా మార్కెట్‌ శాఖ అధికారులు పత్తా లేకుండా పోయారు.

Updated Date - 2022-11-16T00:23:55+05:30 IST