నూతన సంవత్సర వేడుకలను బహిష్కరిస్తున్నాం

ABN , First Publish Date - 2022-12-31T01:04:07+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధిస్తోందని, ఇందులో భాగంగానే 2023 నూతన సంవత్సర వేడుకలను ఏపీ ఎన్‌జీవో ఆధ్వర్యంలో బహిష్కరిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌.వెంగళ్‌రెడ్డి అన్నారు.

నూతన సంవత్సర వేడుకలను బహిష్కరిస్తున్నాం

ఏపీ ఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌. వెంగళ్‌రెడ్డి

కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 30: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధిస్తోందని, ఇందులో భాగంగానే 2023 నూతన సంవత్సర వేడుకలను ఏపీ ఎన్‌జీవో ఆధ్వర్యంలో బహిష్కరిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌.వెంగళ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పశుసంవర్థఖ శాఖ సమావేశ భవనంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడం దారుణమన్నారు. జనవరి నుంచి ఫేస్‌ అటెండెన్సుకు సంబంధించి తగిన సామగ్రిని అందజేయకపోవడం దారుణమన్నారు. జీతాలకు ఫేస్‌ అటెండెన్సుకు ముడిపెట్టరాదని ఆయన డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ డబ్బులను ప్రభుత్వం వాడుకోవడంతోపాటు తమకు రావాల్సిన డీఏ అరియర్స్‌, సరెండర్‌ లీవ్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు ఒకటిన్నర సంవత్సరకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివా లయ ఉద్యోగులపై రాజకీయ నాయకుల దౌర్జన్యాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఆవరణలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి పోలీసులతో పికెటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వి.జవహర్‌లాల్‌, నగర అధ్యక్షుడు ఎంసి.కాశన్న, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, ఆర్‌అండ్‌బీ నాయకులు రాఘవేంద్ర, వ్యవసాయ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవిప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:04:10+05:30 IST