చుట్టూ నీరున్నా..!

ABN , First Publish Date - 2022-03-05T05:58:34+05:30 IST

జిల్లా చుట్టూ నీరుంది. శ్రీశైలం, సుంకేసుల వంటి ప్రధానమైన రిజర్వాయర్లు ఉన్నాయి. కేసీ, ఎల్లెల్సీ, ఎస్సార్బీసీ వంటి కాలువలు ఉన్నాయి.

చుట్టూ నీరున్నా..!

 కేసీకి నీరివ్వలేమంటున్న అధికారులు
ప్రత్యామ్నాయాలు గాలికొదిలేసిన వైనం
కేంద్రం నిధుల కోసం ఎదురుచూపు


జిల్లా చుట్టూ నీరుంది. శ్రీశైలం, సుంకేసుల వంటి ప్రధానమైన రిజర్వాయర్లు ఉన్నాయి. కేసీ, ఎల్లెల్సీ, ఎస్సార్బీసీ వంటి కాలువలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు నీరు పోతున్నా.. జిల్లాకు మాత్రం సక్రమంగా అందని  దుస్థితి. ప్రతి ఏటా ఇంతే. రైతులు సాగుకు సిద్ధమవడం.. అధికారులు నీరివ్వలేమని చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. ఒక్కోసారి పంటలు వేసుకున్నాక.. చేతికందే దశలో తడులు ఇవ్వలేకపోతున్నారు. తద్వారా రైతులు నష్టపోతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం క్యారీ ఓవర్‌ రిజర్వాయర్లు లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు.

కర్నూలు, ఆంధ్రజ్యోతి:

రబీ సీజన్‌లో కేసీ ఆయకట్టుకు నీరివ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 306 కి.మీ. పొడవున్న కేసీ కెనాల్‌ను అభివృద్ధి చేస్తే 8 టీఎంసీలను భద్రపరుచుకోవడం సాధ్యమేనని గతంలో నిర్ధారించారు. ఇందులో భాగంగానే 1994-2007 మధ్య జపాన్‌ కంపెనీ సహకారంతో కేసీ కెనాల్‌ను అభివృద్ధి చేశారు. కానీ 2009లో వచ్చిన భారీ వరదలకు ఈ పనులన్నీ నీటి పాలయ్యాయి. దీంతో 8 టీఎంసీల నిలువ అగమ్యగోచరంగా మారింది. కానీ ఎస్సార్బీసీకి ఇప్పటికే కేటాయించిన 8 టీఎంసీలను అందిస్తూనే ఉన్నారు.  దీంతో కర్నూలు, కడప జిల్లాల్లోని కేసీ ఆయకట్టుకు నీరందడం లేదు. కర్నూలు జిల్లాలో 141 కి.మీ, కడప జిల్లాలో 57 కి.మీ. వెరసి 198 కి.మీ. పొడవున్న ఎస్సార్బీసీ ద్వారా కర్నూలు జిల్లాలో 1,57,422 ఎకరాలతో పాటు కడప జిల్లాలో 37,578 ఎకరాలు కలిపి 1.90 లక్షల ఎకరాలకు నీరందుతోంది. అలాగే ఈ రెండు జిల్లాల్లో వంద గ్రామాలకు తాగు నీటిని కూడా ఎస్సార్బీసీ అందిస్తోంది. అందువల్ల ఎస్సార్బీసీకి 8 టీఎంసీల నీరు ఆపడం సరికాదు. అలా అని కేసీ కెనాల్‌ నీటినే నమ్ముకుని ఉన్న 2.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీలో నీరివ్వలేమని చెప్పడం ప్రభుత్వ వైఫల్యమే అవుతుందని నిపుణులు అంటున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లోని కేసీ కెనాల్‌ 306 కి.మీ. పొడవున ఉంది. కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలు, కడప జిల్లాలో 92,001 కలిపి 2,65,228 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ నేపథ్యంలో రెండు కాలువల ఆయకట్టుకూ సమన్యాయం చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల జరిగిన ఐఎంబీ సమావేశంలోనూ ఇరిగేషన్‌పై చర్చలు జరపకుండా అధికారులు ముఖం చాటేశారు. చర్చ జరిగితే ఎక్కడ నీటి విడుదలపై రాద్ధాంతం జరుగుతుందోనన్న భయంతో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆ అంశాన్ని సమావేశంలో చేర్చనివ్వలేదు.

పట్టిసీమ నీటితో..

పట్టిసీమ నిర్మాణానికి ముందు అక్కడి ప్రజల తాగు, సాగు నీటి అవసరాల రీత్యా శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి ఏటా నీరు ఇచ్చేవారు. పట్టిసీమ పూర్తయిన తర్వాత అక్కడి ప్రజలకు 50 టీఎంసీల నీరు ఆ పథకం ద్వారా ఎత్తిపోస్తున్నారు. అక్కడికి పంపే వాటాలో నీటిని శ్రీశైలం నుంచి మళ్లించుకుని ఎస్సార్బీసీకి విడుదల చేయవచ్చన్నది ఇంజనీరింగ్‌ అధికారుల అభిప్రాయం.

క్యారీ ఓవర్‌ రిజర్వాయర్లు ఏవీ?

కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉండగా.. తుంగభద్ర డ్యాం నుంచి 10 టీఎంసీలు వస్తుండగా, మిగిలిన 29.9 టీఎంసీలు నది ప్రవాహం ద్వారా అందుతోంది. అయితే నికర జలాలు వృథా కాకుండా శ్రీశైలం రిజర్వాయర్‌పైన క్యారీ ఓవర్‌ రిజర్వాయర్లు నిర్మించుకోవాలని బచావత్‌ కమిషన్‌ 1976లోనే స్పష్టం చేసింది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇందుకు అనుమతి ఇచ్చింది. కానీ క్యారీ ఓవర్‌ రిజర్వాయర్లను ఎప్పటికి నిర్మిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో కేసీ కెనాల్‌ నుంచి ఎస్సార్బీసీకి 8 టీఎంసీలను మళ్లిస్తున్నారు. ఫలితంగా రబీలో కేసీ ఆయకట్టుకు ఎప్పుడు, ఎంత నీరు ఇవ్వగలమనేది అధికారులు చెప్పలేక పోతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ జనవరిలోనే పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినా ఇంతవరకు స్పందన లేదు.

శాశ్వత పరిష్కారం ఏదీ?

శ్రీశైలం రిజర్వాయర్‌ నీటి ఆవిరి కింద 33 టీఎంసీలను అప్పట్లో బచావత్‌ కమిషన్‌ గుర్తించింది. 1984-2021 వరకు దీన్ని పరిశీలిస్తే ఏటా 16.5 టీఎంసీలుగా తేలింది. రాయలసీమకు 11 టీఎంసీలు కేటాయించగా 2.65 టీఎంసీలు, కోస్తాకు 11 టీఎంసీలకు బదులుగా 8.12 టీఎంసీలు, తెలంగాణకు 11 టీఎంసీలకు బదులుగా 5.74 టీఎంసీల నీరు వస్తోంది. ఫలితంగా రాయలసీమలో 8.36, కోస్తాకు 2.88, తెలంగాణలో 5.26 టీఎంసీలు మిగులుతున్నాయి. ఈ మిగులుతున్న నీటిలో 8 టీఎంసీలను ఎస్సార్బీసీకి మళ్లించుకోవచ్చు. ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వం మాత్రం కేసీ కెనాల్‌ ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.569.40 కోట్ల కోసం ఎదురుచూస్తూ కాలం వెళ్లదీస్తోంది. ఒకవేళ ఈ నిధులు త్వరగా విడుదలైనా టెండర్లు పిలిచి, కాంట్రాక్టులు తుది దశకు చేర్చి పనులు పూర్తి చేసేటప్పటికి సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో జరిగిన కేసీ అభివృద్ధి పనులకే 13 ఏళ్లు పట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిధుల కోసం ఎదురు చూడకుండా రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - 2022-03-05T05:58:34+05:30 IST