పట్టణ అక్రమ ప్రణాళిక
ABN , First Publish Date - 2022-12-19T00:00:47+05:30 IST
ఫ ఈ ఫొటో గాంధీనగర్ మల్‌బార్ గోల్డు షోరూం ఎదురుగా ఉన్న నంద్యాల గేట్‌లో నిర్మాణమవుతున్న భవనానిది.
అక్రమ సెల్లార్లు.. విచ్చల విడిగా నిర్మాణాలు
ప్లానింగ్ సెక్రటరీల హవా
అక్రమ వసూళ్లపైనే అధికారులు, సిబ్బంది దృష్టి
- కార్పొరేషన్ ఆదాయానికి గండి
కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 18:
ఫ ఈ ఫొటో గాంధీనగర్ మల్‌బార్ గోల్డు షోరూం ఎదురుగా ఉన్న నంద్యాల గేట్‌లో నిర్మాణమవుతున్న భవనానిది. ఈ భవన నిర్మాణ అనుమతికి స్థల యజమాని నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లు ఇవ్వలేదు. అక్కడ రోడ్డు ఆరడుగులే ఉండటంతో ఆనలైనలో షార్ట్ ఫాల్ అని వచ్చింది. కాబట్టి భవన నిర్మాణం చేపట్టకూడదని అధికారులు తేల్చి చెప్పారు. స్థల యజమానికి రెండు నోటీసులు పంపించినా యజమాని సమర్పించలేదు. అతను 2 సెంట్ల స్థలంలో మూడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి పట్టణ ప్రణాళిక విభాగంలోని ఓ ఉన్నతాధికారి సహకారం ఉందని, ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఈ భవనం ముందుభాగంలో ఆరు అడుగుల రోడ్డు ఉంటే అధికారి డబ్బులు తీసుకుని భవనం ముందు 20 అడుగుల రోడ్డు ఉందని ధృవీకరించి అనుమతి ఇచ్చారు. ఈ విషయంపై స్థానిక కార్పొరేటర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోలేదని తెలుస్తోంది.
ఫ 40 వార్డులోని నేషనల్ హైవే పక్కనే ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. కేవలం 10 సెంట్ల స్థలం ఉండటంతో మూడు అంతస్తుల వరకే అనుమతి ఇచ్చారు. అయితే యజమాని అధికారులతో కుమ్మక్కై, వారికి వాటాలను ముట్టజెప్పి అదనంగా మరో మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా భవన నిర్మాణం చేపట్టడానికి పట్టణ ప్రణాళిక విభాగంలోని ఓ అఽధికారి 13వ వార్డులో ఇద్దరి వద్ద రూ. 2 లక్షలు, ఓ వైద్యుడి వద్ద రూ.30 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఫ నగరపాలక సంస్థలోని ప్రణాళికా విభాగంలో భవన నిర్మాణ అనుమతుల రుసుం, ప్రకటనల పన్ను, అక్రమ నిర్మాణాల రుసం వసూళ్లలో నిర్లక్ష్యం, చేతివాటం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2019 నుంచి నయాపైసా రుసుం వసూలు చేయకపోవడం విభాగపు పనితీరును తెలియజేస్తోంది. ఉన్నతాధికారుల అండతో కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర పాలక సంస్థ పరిదిలోని 52 వార్డులలో అనధికార భవన నిర్మాణాలు సుమారు వెయ్యికి పైగ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఉన్నతాధికారులు, ప్లానింగ్ సెక్రటరీల అవినీతి వల్లనే నిర్మాణమయినట్లు తెలుస్తోంది.
ఫ ప్లానింగ్ సెక్రటరీల హవా..
సచివాలయాల్లో పట్టణ ప్రణాళిక విభాగానికి ప్లానింగ్ సెక్రటరీ ఉంటారు. కొందరు అధికారులు ప్లానింగ్ సెక్రటరీలను అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లానింగ్ సెక్రటరీ భవన నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేసి స్థలాన్ని పరిశీలించిన అనంతరం బిల్డింగ్ ఇనస్పెక్టర్/అసిస్టెంట్ సిటీ ప్లానర్‌కు నివేదికలను పంపుతారు. ఇక్కడే లావాదేవీలు ప్రారంభమవుతాయి. ప్రతి రోజు కనీసం 10 నుంచి 20 దాకా భవనాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఒక్కో భవనానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నారు. ఈ మేర నెలకు కనీసం రూ.50 లక్షలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా నగరంలో వ్యాపార వాణిజ్య ప్రకటనల పన్ను వసూళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గోడలపై రాతలు, ఫ్లెక్సీలు, ఇతరాత్ర ప్రకటనలు మొదలైనవాటిని చూసి చూడనట్లు వదిలి వేస్తున్నారు. దీని ద్వారా సంస్థ ఆదాయానికి భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుంది.
ఫఅక్రమ సెల్లార్లు.. విచ్చల విడిగా నిర్మాణాలు
నగరంలో అక్రమ సెల్లార్లు (భూమి లోపల) నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో నిర్మిస్తున్న కట్టడాలలో అత్యధిక భాగం వాణిజ్య సముదయాలకు సంబంధించినవే. అపార్టుమెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు తదితర వాణిజ్య వ్యాపార సముదాయాలలో యజమానులు అత్యధిక శాతం సెల్లార్‌ల నిర్మాణానికి మొగ్గుచూపుతున్నారు. నగరపాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్ రెవెన్యూ విభాగాల అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా నగరంలో ఎక్కడెక్కడ సెల్లార్ల నిర్మాణాలు జరుగుతున్నదీ తెలుసుకోలేని పరిస్థితి ఉంది. భవనంలో సెల్లార్ నిర్మించాలంటే కనీసం 12 సెంట్లు పైన స్థలం ఉండాలి. అయితే ప్రస్తుతం నగరంలో 5 సెంట్లు ఉన్న చోట కూడా సెల్లార్లు నిర్మిస్తున్నారు. నగరంలోని బళ్లారి చౌరస్తా, కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, అబ్దుల్లాఖాన్ ఎస్టేట్, గాయత్రీ ఎస్టేట్, ప్రకాశ్‌నగర్, గాంధీనగర్, ఎన్‌ఆర్ పేట, మద్దూర్‌నగర్, నంద్యాల రోడ్డు, క్రిష్ణానగర్, వెంకటరమణ కాలనీ, అశోక్‌నగర్ తదితర ప్రాంతాలలో వాణిజ్య సముదాయాలలో అక్రమ సెల్లార్‌లు నిర్మించి వ్యాపారాలు కొనసాగిస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడం లేదు.
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు:
అపార్టుమెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్ హాళ్లకు తప్పని సరిగా పార్కింగ్ స్థలాలు ఉండాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఇలా లేని నిర్మాణాలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఉత్తర్వులు ఎక్కడ అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఫ మా దృష్టికి రాలేదు...ప్రదీప్‌కుమార్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి
నగరంలో అక్రమ నిర్మాణాలు, భవనాల గురించి మా దృష్టికి రాలేదు. అనుమతి లేని, అనధికార కట్టడాలు చేపట్టిన వారి నుంచి రుసుము వసూలు చేయలేదు. అక్రమ సెల్లార్లకు, అనధికార కట్టడాలకు ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు. అనుమతి లేని భవనాలు నిర్మిస్తున్నారనే ఫిర్యాదులు ఇప్పటి వరకు స్పందనలో రాలేదు. ఒకవేళ అలాంటి ఏవైనా వస్తే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాము.