రెండు వరాలు

ABN , First Publish Date - 2022-07-06T06:13:05+05:30 IST

జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమం సభలో ఆదోనికి సీఎం రెండు వరాలు ఇచ్చారు.

రెండు వరాలు
విద్యార్థులతో సీఎం జగన

  1. రోడ్ల విస్తరణకు రూ.50 కోట్లు 
  2. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు 
  3. ఆదోని విద్యాకానుక పంపిణీ సభలో సీఎం జగన 
  4. మెడికల్‌ కాలేజీ ఊసెత్తలేదని పట్టణవాసుల అసంతృప్తి

కర్నూలు, జూలై 5(ఆంధ్రజ్యోతి)/ఆదోని: జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమం సభలో ఆదోనికి సీఎం రెండు వరాలు ఇచ్చారు. ఆదోని మున్సిపల్‌  హైస్కూలు ఆవరణలో మంగళవారం ఈ సభ జరిగింది. ఇందులో సీఎం మూడో విడత జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ పట్టణ రోడ్ల విస్తరణకు రూ.50కోట్లు మంజూరు చేస్తున్నానని హామీ ఇచ్చారు. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలోని తాడేపల్లి గూడెం నుంచి గన్నవరం విమానశ్రయానికి చేరుకున్న సీఎం జగన ప్రత్యేక విమానంలో 9.43గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు, కోడుమూరు ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, తొగూరు ఆర్థర్‌, డాక్టర్‌ సుధాకర్‌, కర్నూలు మేయర్‌ బీవై.రామయ్య, కర్నూలు రేంజ్‌ డీఐజీ సింథిల్‌కుమార్‌,  కలెక్టర్‌ కోటేశ్వరరావు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన జగన 10.28 గంటలకు ఆదోని పట్టణంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమం వేదిక వద్దకు చేరుకున్నారు. మున్సిపల్‌ హైస్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడారు. నెహ్రూ మెమోరియల్‌ స్కూల్‌లో విద్యార్థులతో ముచ్చటించారు. పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక కిట్లు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం జగన మాట్లాడుతూ.. ఆదోని పట్టణానికి  ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఆటోనగర్‌ ఏర్పాటుతో పాటు జగనన్న కాలనీల్లో బీటీ రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నానన్నారు. బుడగ జంగాల ఎస్సీ సర్టిఫికెట్ల విషయంలో వన మ్యాన కమిషన  నివేదికను ఎస్సీ, ఎస్టీ కమిషనకు, కేంద్ర ప్రభుత్వానికి పంపించామని వివరించారు.  వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నామని తెలిపారు. ఆదోని నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.  

పేద పిల్లలకు నాణ్యమైన విద్య : పాఠశాలలు పునఃప్రారంభం కాగానే పుస్తకాలు, పిల్లల దుస్తులు, ఇతర సామగ్రితో  ప్రతివిద్యార్థికి రూ.2వేల ఖర్చు చేసి విద్యాకానుక కిట్లను పంపిణీ చేస్తున్నట్లు జగన తెలిపారు.  బాలికలకు  ప్రత్యేక మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్స్‌ అందిస్తున్నట్లు వివరించారు.  

మెడికల్‌ కళాశాల ఊసేది? : ఆదోని మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు 58 ఎకరాలకుపైగా భూసేకరణ చేశారు. ఏడాది క్రితం వర్చువల్‌ ద్వారా జగన శంకుస్థాపన చేశారు. రూ.476 కోట్లతో చేపట్టిన ఈ కళాశాలకు  ఇప్పటి వరకు పునాదులు కూడా తీయలేదు. ఈ సభలో సీఎం దాని ఊసే ఎత్తలేదనే విమర్శలు వచ్చాయి.  

అడా అభివృద్ధికి నిధులేవీ? :  ఆదోని అర్భన ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (అడా)కి నిధులు మంజూరు చేయాలని సభలో  ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కోరారు. అయితే సీఎం దాని ఊసే ఎత్తలేదు.  

గుమ్మనూరుకు దక్కని అవకాశం : విద్యాకానుక కిట్ల పంపిణీ  కార్యక్రమం సభలో జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇది  బీసీ వర్గాల్లో చర్చనీయాశమైంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ,  ఎంపీ సంజీవకుమార్‌, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు.  

విద్యార్థి సంఘ నాయకుల అరెస్టు

 ఆదోని(అగ్రికల్చర్‌), జూలై 5: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి పశ్చిమ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా  నిరసన తెలిపాయి. టీఎనఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, పట్టణ నాయకుడు తేజ, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొడాలి నాగరాజు, పట్టణ నాయకుడు తిరుమలేష్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు షాబిర్‌బాషా, సీమ విద్యార్థి సంఘ రాష్ట్ర నాయకుడు నవీనకుమార్‌, బీడీఎ్‌సఎఫ్‌ నాయకుడు రమేష్‌ సభ ప్రాంగణంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా  పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు  అక్కడే బైఠాయించి నిరసన తెలపారు. చివరికి పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

 మీటింగ్‌ కాకముందే ఇంటికి పోతారా?

ఆదోని రూరల్‌, జూలై 5:  విద్యాదీవెన కిట్ల పంపిణీ సభలో సీఎం ప్రసంగం ప్రారంభం కాక ముందే ఇళ్లకు బయలుదేరిన పొదుపు మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సభకు  అధికారులు పొదుపు మహిళలను పెద్ద ఎత్తున తరలించారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతుండంగానే మహిళలు, వృద్ధులు తిరుగు ప్రయాణమయ్యారు.  సీఎం ప్రసంగం ఇంకా కాలేదని, ఈలోగా బయటికి వెళ్లాడానికి వీలు లేదని పోలీసులు హుకుం జారీ చేశారు.   

నాడు- నేడు పనుల పరిశీలన

ఆదోని, జూలై 5: ఆదోనికి వచ్చిన సీఎం  మొదటగా నాడు-నేడు ద్వారా మున్సిపల్‌ హైస్కూల్‌లో రూ.1.26 కోట్లతో పూర్తి చేసిన పనులను పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన నాడు-నేడు ఫొటో ఎగ్జిబిషనను తిలకించారు. అనంతరం మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నీరు తాగారు. తొమ్మిదో తరగతి గదిలో విద్యార్థినులతో ముచ్చటించారు.  


Updated Date - 2022-07-06T06:13:05+05:30 IST