నలుగుతున్న ఇంజనీర్లు

ABN , First Publish Date - 2022-12-11T00:07:05+05:30 IST

జిల్లాలో వివిధ విభాగాల ఇంజనీర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.

   	   నలుగుతున్న ఇంజనీర్లు

అడకత్తెరలో పోకచెక్కల మారిన వైనం

చేసిన పనులకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం

కోర్టులను ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు

అమరావతి తిరగలేక అల్లాడుతున్న అధికారులు

కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 10: జిల్లాలో వివిధ విభాగాల ఇంజనీర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించే విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో వారు విలవిల్లాడిపోతున్నారు. ఓ వైపు కోర్టు ధిక్కరణ కేసులు వేసేందుకు టీడీపీ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు సిద్ధం కావడం, మరోవైపు కాస్తో కూస్తో మంజూరు చేసిన బిల్లులను ఏదో ఒక కారణం చూపి చెల్లించవద్దంటూ వైసీపీ నేతలు హూంకరిస్తుండటంతో ఇంజనీరింగ్‌ అధికారులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. మరోవైపు కోర్టు ధిక్కరణ కేసుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రతి విషయానికి కోర్టు మెట్లు ఎక్కలేకపోతున్నారు. చీటికి మాటికి అమరావతికి వెళ్లేందుకు ప్రభుత్వం రూపాయి కూడా మంజూరు చేయకపోవడంతో తమకు చేతితమురు వదులుతోందని వాపోతున్నారు.

జిల్లాలో రూ.2,540 కోట్ల బకాయిలు:

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 23 ప్రభుత్వ విభాగాల కింద గ్రామాల్లో సిమెంటు రోడ్లు, పూడికతీత పనులు, అంగనవాడీ భవనాలు, తారు రోడ్డు పనులు ఇలా దాదాపు రూ.2,540 కోట్ల విలువ చేసే పనులు జాతీయ ఉపాధి హామీ పథకం లింక్‌పతో చేశారు. ఈ పనులను గతంలో నామినేషన పద్ధతిలో కాంట్రాక్టర్లు చేపట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీపై ఉన్న అక్కసుతో ఆ పనులకు సంబంధించిన బిల్లులను ఆపేసింది. సంబంధిత విభాగాల ఇంజనీర్లు ఎనవోసీ సర్టిఫికెట్లు జారీ చేసినా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

పక్కా ప్లానతో కోర్టుకు..

ప్రభుత్వం నుంచి బిల్లులను రాబట్టే విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అన్ని జిల్లాల తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో బకాయిలకు సంబంధించిన పనుల వివరాలను ఇంజనీర్లు ఇచ్చిన ఎనవోసీ సర్టిఫికెట్లను సమర్పించాలని సూచించింది. ఆ మేరకు వాటిని హైకోర్టులో పిటిషనకు జత చేసి ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చేలా శ్రద్ధ తీసుకుంటామని ప్రకటించింది. దీంతో కాంట్రాక్టర్లు ఉరుకులు పరుగులతో ఆయా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల వద్దకు వెళ్లి చేసిన పనులు, తమకు రావాల్సిన బిల్లుల వివరాలను టీడీపీ కార్యాలయాల్లో సమర్పించారు.

‘నీరు-చెట్టు’కే రూ.వెయ్యి కోట్ల పనులు..

నీరు-చెట్టు కార్యక్రమం కింద కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు రూ.వెయ్యి కోట్ల పనులు జరిగాయి. మొత్తం 23 విభాగాలకు సంబంధించి జిల్లాలో జరిగిన రూ.2.540 కోట్ల పనులు జరగ్గా.. దాదాపు రూ.2వేల కోట్ల దాకా ప్రభుత్వం నుంచి వచ్చాయి. ఇంకా దాదాపు రూ.540 కోట్ల దాకా రావాల్సి ఉంది. వాటిని కూడా ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు కోర్టు ధిక్కరణ పిటిషన్లను వేస్తున్నామనీ టీడీపీ వర్గాలు తెలిపాయి.

కోర్టు ఆదేశాలు బేఖాతరు:

కోర్టు జోక్యంతో బిల్లులు చేసేందుకు ఒప్పుకున్న ప్రభుత్వం పనుల్లో నాణ్యత లోపించిందంటూ మళ్లీ వివిధ విభాగాల ఇంజనీర్లతో తనిఖీలకు శ్రీకారం చుట్టింది. అయితే పనులు నాణ్యతతో చేపట్టినట్లు ఇప్పటికే ఇంజనీర్లు ఎనవోసీ సర్టిపికెట్లు జారీ చేయడంతో మరోదారి లేక ప్రభుత్వం విడతల వారిగా బిల్లులు చెల్లించేందుకు అంగీకరించింది. కోర్టుకు చెప్పినట్లు కాకుండా నిధులను విడుదల చేయడంలో మాత్రం ప్రభుత్వం వెనుకంజ వేస్తూనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ.540 కోట్ల బిల్లులను విడుదల చేస్తే తాము చీటికి మాటికి అమరావతికి వెళ్లాల్సిన పరిస్థితి తప్పిపోతుందని ఇంజనీర్లు వాపోతున్నారు.

వైసీపీ నేతల కక్షకు ఇంజనీర్లు బలి - సత్రం రామకృష్ణుడు, ఉపాధి హామీ మాజీ మానిటరింగ్‌ సభ్యుడు:

వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్షతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధిస్తోంది. మరో దారి లేక పనులు చేసిన వారు బిల్లుల కోసం తెలుగుదేశం పార్టీ అండతో హైకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్ష పూరిత ధోరణి కారణంగా జిల్లాలో వివిధ విభాగాల ఇంజనీరింగ్‌ అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పనులు చేసిన వారందరికీ వెంటనే బిల్లులు చెల్లించాలి. లేకపోతే కోర్టుల్లో ధిక్కరణ కేసులు ఎదుర్కోక తప్పదు.

Updated Date - 2022-12-11T00:07:06+05:30 IST