వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-10-17T05:42:05+05:30 IST

నంద్యాల జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ఆళ్లగడ్డ, అక్టోబరు 16: నంద్యాల జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు మెట్ట వద్ద జరిగిన మోటార్‌ ప్రమాదంలో చాగలమర్రి గ్రామానికి చెందిన దూదేకుల లక్ష్మీదేవి (40) ఆదివారం మృతి చెందారు. ఈ ప్రమాదలో ఆమె భర్త దూదేకుల షఫి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భార్యాభర్తలిద్దరూ చాగలమర్రి నుంచి బైకుపై నంద్యాలకు బయలు దేరారు. వీరు కోటకందుకూరు మెట్ట సమీపంలోకి రాగానే దూదేకుల షఫికి ఫిట్స్‌ రావడంతో మోటార్‌ సైకిల్‌ను డివైడర్‌కు ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆయన భార్య లక్ష్మిదేవి మృతి చెందింది. రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


పాణ్యం: మండలంలోని కొనిదేడు సమీపంలో శనివారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో బనగానపల్లెకు చెందిన షేక్‌ కరీముల్లా (23) చికిత్స పొందుతూ మృతి చెందారు. పాణ్యానికి వస్తున్న కరీముల్లా బైకు, కొనిదేడుకు చెందిన వెంకటేశ్వర్లు బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరీముల్లా పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


పాములపాడు: పాములపాడు గ్రామ శివార్లలో ఆదివారం పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆటో బోల్తా పడటంతో లక్ష్మీదేవి (47) మృతి చెందింది. హెడ్‌ కానిస్టేబులు రామేశ్వరరావు తెలిపిన వివరాలివీ.. నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి పాములపాడుకు ఆదివారం నిర్వహించే సంతలో వ్యాపారం నిమిత్తం ఆటోలో కూరగాయలతో బయలుదేరారు. కేజీ రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీ సిగ్నల్‌ లైట్లు వేయకుండా పెట్రోల్‌ బంకులోకి వెళ్లడంతో ఆటో సడన్‌ బ్రేకులు వేశారు. ఆటోబోల్తా పడటంతో గాయపడిన లక్ష్మీదేవిని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త మణీశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-10-17T05:42:05+05:30 IST