ఇంజనీర్ల ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2022-09-20T04:53:22+05:30 IST

ఇంజనీర్ల వింత పోకడ ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులకు తలనొప్పిగా మారింది.

ఇంజనీర్ల ఇష్టారాజ్యం
ఆదోని విక్టోరియా పేటలో శిఽథిలావస్థకు చేరుకున్న 18వ వార్డు పురపాలక ప్రాథమిక పాఠశాల

  1. వారు చెప్పిందే వేదంగా నాడు-నేడు పనులు
  2. పై అంతస్తులో ఆర్‌సీసీ రూఫ్‌ బదులు రేకులు
  3. ఒప్పుకోని ఉపాధ్యాయులు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు
  4. నిధులు కాజేసేందుకేనని ఆరోపణలు

ఆదోని (అగ్రికల్చర్‌), సెప్టెంబరు 19:  ఇంజనీర్ల వింత పోకడ ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులకు తలనొప్పిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదనపు గదుల నిర్మాణంలో తాము చెప్పిందే వేదమన్నట్టుగా ఇంజనీర్లు ముందుకు సాగుతుండగా నిధులు కాజేసేందుకే ఇదంతా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అదనపు తరగతి గదులకు రూ.526 కోట్లు..

పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. జిల్లాలో రెండో విడత నాడు-నేడు కింద 479 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు లభించాయి. ఇందుకుగాను రూ.526 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఆర్‌సీసీకి బదులుగా రేకులు..

కొన్ని పాఠశాలల్లో స్థలం కొరత ఉండటంతో పాత తరగతి గదులపైనే నిర్మాణాలు చేపట్టారు. పాత బిల్డింగ్‌పై అదనపు గదులు నిర్మిస్తే నిలబడవని, పై అంతస్తు రూఫ్‌ ఆర్‌సీసీకి బదులుగా రేకులు వేయాలని ఇంజనీర్లు సూచిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. బిల్డింగ్‌ నిర్మాణం చేపట్టి ఐదేళ్లు కూడా కాలేదని, పై అంతస్తులో తరగతి గదులు నిర్మించాలని పట్టుబడుతున్నారు. 

తిరగబడ్డ పేరెంట్స్‌ కమిటీ సభ్యులు 

ఆదోనిలోని విక్టోరియా పేట 18వ వార్డు పురపాలక పాఠశాలకు ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. రూ.72 లక్షలు కేటాయించారు. పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో పాత బిల్డింగును కూల్చివేసి ఆ స్థానంలో కొత్త భవనం నిర్మించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. పురపాలక ఇంజనీర్లు మాత్రం ఆ బిల్డింగ్‌ కూల్చలేమని, పక్కనే ఉన్న పాఠశాల మరో బిల్డింగ్‌పై నిర్మాణం చేపడతామని చెబుతున్నారు. పై అంతస్తులో నిర్మించిన అదనపు తరగతి గదుల రూఫ్‌ ఆర్‌సీసీకి బదులు రేకులు వేస్తామని చెప్పడంతో ఉపాధ్యాయులు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు తిరగబడ్డారు. రేకులు వేస్తే విద్యార్థులు ఎండ వేడికి ఇబ్బందులు పడతారని, పనులు ప్రారంభించలేమని తెగేసి చెప్పారు.

  ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్‌ ఉన్నత పాఠశాలలో 20 అదనపు తరగతి గదులు నిర్మించుకునేందుకు రూ.2.40 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే జీ+1 ఉన్న బిల్డింగ్‌పై మరో అంతస్తులో ఆర్‌సీసీ రూఫ్‌కు బదులు రేకులు వేస్తామని ఇంజనీర్లు చెప్పడంతో అలా అయితే నిర్మాణాలే చేపట్టొద్దని ఉపాధ్యాయులు చెప్పారు. 

ఫ భార్‌పేట హిందూ గర్ల్స్‌ పురపాలక పాఠశాలలో ఆరు అదనపు తరగతి గదులు నిర్మించుకునేందుకు నిధులు మంజూరయ్యాయి. ఈ బిల్డింగ్‌పై కూడా అదనపు గదులు నిర్మించాలని ఇంజనీర్‌ సూచించారు. పైన రూఫ్‌ బదులు రేకులు వేస్తామని చెప్పడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపాటు పేరెంట్స్‌ కమిటీ సభ్యులు ఒప్పుకోలేదు. 

ఫ మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అధికం కావడంతో 20 గదులు అవసరమయ్యాయి. పై అంతస్తులో నిర్మించేందుకు అవకాశం ఉండటంతో నిర్మాణం చేపట్టారు. రాతి కట్టడం బిల్డింగ్‌పై రూఫ్‌ నిలబడదని రేకులు వేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇదంతా నిధులు మిగుల్చుకోవడానికి ఇంజనీర్లు వేసిన ప్లానగా ప్రచారం జరుగుతోంది.  పునాదులు తీసి అదనపు గదులు నిర్మిస్తే ఖర్చు ఎక్కువ వస్తుంది. అదే బిల్డింగ్‌పైన అయితే ఖర్చు తగ్గుతుంది. ఇంజనీర్ల డబ్బులు మిగుల్చుకునేందుకు చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

-రెండో విడత ఎంపికైన పాఠశాలలు -1084

-అవుతున్న ఖర్చు - రూ.526 కోట్లు

-రివాల్వింగ్‌ ఫండ్‌ జమ అయిన పాఠశాలలు-1022

-ఖాతాలో జమ అయిన రివాల్వింగ్‌ ఫండ్‌ -రూ.63 లక్షలు

-అదనపు గదులు నిర్మిస్తున్న పాఠశాలలు-479

-మొత్తం అదనపు గదులు-2537

ఒక్కో గది నిర్మాణానికి కేటాయించిన నిధులు -రూ.12 లక్షలు


-నిబంధనల ప్రకారం ఆర్‌సీసీ వేయాల్సిందే..

-డా.వేణుగోపాల్‌, ఏపీసీ సమగ్ర శిక్ష అభియాన కర్నూలు

అదనపు గదుల నిర్మాణం రూఫ్‌ ఆర్‌సీసీ వేయాలి. నిబంధనల ప్రకారం రేకులు వేసేందుకు అనుమతులు లేవు. పై అంతస్తులు నిర్మించినా కచ్చితంగా రూఫ్‌ ఆర్‌సీసీ వేయాల్సిందే. ఇంజనీర్లు ఎందుకు అలా చేస్తున్నారో. దీనిపై విచారిస్తాం.



Updated Date - 2022-09-20T04:53:22+05:30 IST