అంతన్నారు...ఇంతన్నారు!

ABN , First Publish Date - 2022-12-07T00:25:43+05:30 IST

‘ఎంతో ప్రయత్నం చేసి... లక్ష మందికి తక్కువ కాకుండా సీమ గర్జన సక్సెస్‌ చేసేందుకు పక్కాగా సన్నాహాలు చేసినా ప్రజా స్పందన ఎందుకు కొరవడింది..?

అంతన్నారు...ఇంతన్నారు!

నాయకుల మధ్య సమన్వయ లోపం

సీమ గర్జన సక్సెస్‌పై శ్రద్ధచూపని ఎమ్మెల్యేలు

సీఎం మెప్పు కోసం కొందరి ప్రయత్నం

‘లక్ష మందితో సభ’ అంటూ ప్రచారం

చంద్రబాబు పర్యటనకు ముడిపెట్టడమే కొంప ముంచిందా?

రాయలసీమ గర్జన ఫ్లాప్‌పై వైసీపీ నేతల్లో అంతర్మథనం

సభతో ఒరిగిందేమీ లేదని అభిప్రాయం

రాంపురం రెడ్డి సోదరుల గైర్హాజరుపై చర్చ

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): ‘ఎంతో ప్రయత్నం చేసి... లక్ష మందికి తక్కువ కాకుండా సీమ గర్జన సక్సెస్‌ చేసేందుకు పక్కాగా సన్నాహాలు చేసినా ప్రజా స్పందన ఎందుకు కొరవడింది..? ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో రాలేదా..? కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు విశ్వసించలేదా..? జన సమీకరణ కోసం నాయకులు సమన్వయంతో పని చేయలేదా..?’ కర్నూలులో వైసీపీ షో అట్టర్‌ ఫ్లాప్‌ కావడంపై ఆ పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వాన్ని తొలిచేస్తున్న ప్రశ్నలివి. భారీగా జనాలు వచ్చారని బయటకు చెబుతున్నా.. లోలోపల మాత్రం ఫలానా కారణాల వల్లనే ప్రజలు రాలేకపోయారని.. దూర ప్రాంతాల నుంచి వైసీపీ శ్రేణులు సభా మైదానానికి చేరుకోకుండానే కార్యక్రమం ముగించడం వల్లనే జన స్పందన కనిపించలేదని ఒక్కో నాయకుడు ఒక్కోరకంగా విశ్లేషిస్తున్నారు. మొత్తంగా రాయలసీమ గర్జన విఫలం కావడం వైసీపీకి మైనస్సే... అని ఆ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు.

‘మెప్పు కోసం పప్పు వండితే..’ అన్నట్టుగా తయారైంది వైసీపీ నాయకుల పరిస్థితి. మూడు రాజధానులకు రాష్ట్ర ప్రజల మద్దతు ఉందని చాటేందుకు నాన్‌ పొలిటికల్‌ జేఏసీ పేరుతో వైసీపీ అక్టోబరులో విశాఖే రాజధాని అంటూ చేసిన హడావుడిని వైజాగ్‌ వాసులు పట్టించుకోలేదు. దీంతో లక్ష మందితో రాయలసీమ గర్జన అంటూ వైసీపీ అధి నాయకత్వం ఎత్తులకు పైఎత్తులు వేసినా జన స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నాయకత్వం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇక్కడే తిష్టవేసి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు టార్గెట్‌ ఇచ్చినా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందనేది ఆ పార్టీ నాయకత్వాన్ని వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. పోలీసుల సమాచారం మేరకు ఎస్‌టీబీసీ కళాశాల పూర్తి మైదానం సామర్థ్యం 30వేల నుంచి 35 వేల మందికి మించదని అంటున్నారు. అందులో 30 శాతం మైదానం వదిలేసి వేదిక ఏర్పాటు చేశారు. సభా వేదిక ముందు పూర్తి మైదానం నిండితే 20 వేల నుంచి 25 వేల మంది చేరే అవకాశం ఉంది. వేదిక ముందు భాగంలో మినహా కర్నూలు క్లబ్‌ వైపు, ఎస్వీ కాంప్లెక్స్‌ వైపు ఖాళీగానే ఉంది. అంటే.. 15 వేల నుంచి 20 వేలకు మించి జనం రాలేదని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నారు. వారిలో ముప్పాతిక శాతం విద్యార్థులు, డ్వాక్రా మహిళలే. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ప్రసంగిస్తుండగానే మైదానం నుంచి విద్యార్థులు బయటకు వెళ్లిపోయారు. ప్రధాన వక్తలకు రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగించే సమయానికి వచ్చిన వారిలో ముప్పాతిక మంది వెళ్లిపోయారు. దీంతో ఖాళీ కుర్చీలు కనిపిస్తుండడంతో వారు కూడా ఐదారు నిమిషాలకు మించి మాట్లాడలేకపోయారు. నగరం, జిల్లాలో హోటళ్లు, టీకొట్టులు, జనం కలిసే ప్రాంతాల్లో ఏ ఇద్దరు కలిసినా వైసీపీ సీమ గర్జనకు జనం రాలేదంట కదా..? అనే చర్చించుకుంటున్నారు. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని.. కర్నూలుకు మార్చలేదని ప్రభుత్వ నాయవాది కేకే వేణుగోపాల్‌తో చెప్పించిన ప్రభుత్వం.. ఇక్కడొచ్చి కర్నూలులో హైకోర్టు అంటోంది. హైకోర్టు ఇక్కడికి తరలించాల్సింది ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కాదు. జేఏసీ పేరుతో అధికార పార్టీ సీమ గర్జన పెట్టడం ఎవరిని మోసం చేయడానికి..? అనేది జనంలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతల మాటల్లో విశ్వాసం లేకపోవడం వల్లే గర్జనకు ప్రజలు, ఉద్యోగులు, యువత దూరంగా ఉన్నారని అందరూ చర్చించుకుంటున్నారు. వైసీపీ జిల్లా నాయకత్వం కూడా ఇదే విషయంపై చర్చించుకుంటోందని సమాచారం.

చంద్రబాబు రోడ్‌షోతో ముడిపెట్టి తప్పు చేశామా..?

చంద్రబాబు పర్యటనకు మించి జన సమీకరణ చేయాలి.. కర్నూలు నగర వీధులు జనంతో దద్దరిల్లాలని సీమ గర్జనకు భారీ ప్రచారం.. అంతులేని హడావుడి చేయడం కూడా సభ ప్లాప్‌ కావడానికి ఓ కారణమని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో చంద్రబాబు మూడు రోజుల పర్యటనలో భాగంగా పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో రోడ్‌షో, బాదుడే బాదుడు సభలు నిర్వహించారు. అంతేకాదు.. కోడుమూరు, దేవనకొండ సహా రహదారి వెంబడి ఉన్న గ్రామాల్లో ఆయన ప్రజలతో మాట్లాడారు. ఎక్కడికెళ్లినా జనం బ్రహ్మరథం పట్టారు. జన సునామీలా తరలివచ్చారు. ఇది రాష్ట్రంలో టీడీపీలో జోష్‌ పెంచితే.. వైసీపీ నాయకత్వాన్ని ఆలోచనలో పడేసింది. బాబు పర్యటన భారీగా సక్సెస్‌ అయ్యిందే అనే భావనను పోగొట్టి... అంతా సీమ గర్జన గురించే మాట్లాడుకునేలా చేయాలని వైసీపీ అధిష్ఠానం గత నెల 25న జరగాల్సిన సభను ఈ నెల 5కు వాయిదా వేసింది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుంచి లక్ష మందికి పైగా జనాలను తరలించాలని పక్కా ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇక్కడే తిష్ట వేసి గర్జనను భారీగా నిర్వహించాలని ప్లాన్‌ చేశారు. ఆ స్థాయిలో సక్సెస్‌ కాకపోవడంతో చంద్రబాబు రోడ్‌షోతో ముడిపెట్టి తప్పు చేశామా..? అని లోలోపల బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మందికి తక్కువ కాకుండా గర్జనకు తరలించాలని ‘లక్ష’్యం నిర్దేశిస్తే... ఒక్కో నియోజకవర్గం నుంచి 500 నుంచి వెయ్యి మంది కూడా రాలేదని... వారు కూడా సకాలంలో వేదిక వద్దకు చేరుకోలేదని... సభ ముగిశాక వచ్చారని... గ్రామ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపమే దీనికి కాణమని అధికార పార్టీ నాయకులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. విద్యార్థులు, డ్వాక్రా మహిళలపై ఆధారపడడం కూడా ఓ తప్పేనని... బలవంతంగా తీసుకొచ్చిన విద్యార్థులు సభ ప్రారంభమైన గంటకే వెళ్లిపోవడంతో మైదానం ఖాళీ అయ్యిందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాంపురం రెడ్డి సోదరులు గైర్హాజరు

సీమ గర్జనకు రాంపురంరెడ్డి సోదరులు మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యేలు వై.వెంకట్రామిరెడ్డి గైర్హాజరు కావడంపై ఆ పార్టీలో ప్రధాన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి చేతికి శస్త్రచికిత్స జరిగిందని... అందువల్లే ఆయన రాలేదని అంటున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటన వరకు బాలనాగిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. బాబు పర్యటన సక్సెస్‌ కావడం, సీఎం జగన్‌, ప్రభుత్వ విధానాలపై ఘాటుగా స్పందించినా పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు వ్యాఖ్యలు బాలనాగిరెడ్డి ఖండించకపోవడాన్ని అధినాయకత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు. ఎమ్మెల్యేలుగా ఉన్న రాంపురం రెడ్డి సోదరులు గైర్హాజరు కావడం, వారి ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు గర్జన సభ ముగిసిన తరువాత కూడా చేరుకోకపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది దేనికి సంకేతమని ఆ పార్టీ నేతలు ప్రధానంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఏదీ ఏమైనా 20 రోజుల వ్యవధిలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షో, బాదుడే బాదుడు సభలు సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడం... వైసీపీ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రైవేటు విద్యా సంస్థలు, పార్టీ యంత్రాంగాన్ని బరిలో దింపినా.. సీమ గర్జన అట్టర్‌ ఫ్లాప్‌ కావడం అధికార పార్టీ నాయకులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-12-07T00:25:47+05:30 IST