రుద్రాక్షగుట్టలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-09-23T04:53:11+05:30 IST

డోన్‌ పట్టణ సమీపంలోని రుద్రాక్షగుట్టలో పేద మహిళలు నిర్మించుకున్న ఇంటి బేస్‌మెంట్లను కూల్చివేయడంతో గురు వారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

రుద్రాక్షగుట్టలో ఉద్రిక్తత
ఇళ్ల బేస్‌ మట్టాలను కూల్చివేస్తున్న దృశ్యం

ఇంటి బేస్‌ మట్టాల కూల్చివేతను అడ్డుకున్న సీపీఐ నాయకులు, లబ్ధిదారులు
సీపీఐ నాయకుల అరెస్టు
మహిళలపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు


డోన్‌, సెప్టెంబరు 22: డోన్‌ పట్టణ సమీపంలోని రుద్రాక్షగుట్టలో పేద మహిళలు నిర్మించుకున్న ఇంటి బేస్‌మెంట్లను కూల్చివేయడంతో గురు వారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులను ఈడ్చివేస్తూ పోలీసులు అరెస్టు చేశారు. మహిళలపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పలువురు పేద మహిళలకు ఇంటిస్థలాలు మంజూరు అయ్యాయి. ఈ కాలనీకి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పేరు కూడా పెట్టారు. పలువురు మహిళా లబ్ధిదారులు బేస్‌మట్టాలు కూడా వేసుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఈ స్థలాల్లో ఇతర నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. ఎక్స్‌కవేటర్లతో ఇళ్ల బేస్‌మట్టాలు కూల్చివేస్తారన్న సమాచారంతో సీపీఐ జిల్లా అధ్యక్షుడు రంగనాయుడు, స్థానిక నాయకులు కౌన్సిలర్‌ సుంకయ్య, రాధాకృష్ణ, బొంతిరాళ్ల సర్పంచ్‌ రవి, మహిళ లబ్ధిదారులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. డోన్‌తో పాటు బేతంచెర్ల, ప్యాపిలి సీఐలు, ఎస్‌ఐలతో పాటు భారీగా పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనలు చేయకూడదని పోలీసులు సీపీఐ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీస్‌ జులుం నశించాలంటూ సీపీఐ నాయకులు, మహిళలు నినదించారు. అయితే పోలీసులు సీపీఐ నాయకుల చొక్కాలను పట్టుకుని ఈడ్చివేశారు. దీంతో మహిళా లబ్ధిదారులు పోలీసులను అడ్డుకోగా వారిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో గంట పాటు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సీపీఐ నాయకులను అరెస్టు చేసి వాహనాల్లో పట్టణ, రూరల్‌ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. బేస్‌మట్టాలను కూల్చి వేయడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి బేస్‌మట్టాలు నిర్మించుకున్నామని, ఇలా కూల్చివేయడం అన్యాయ మని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ మంత్రి బుగ్గన అండతోనే బేస్‌మట్టాలను కూల్చి వేశారని ఆరోపించారు. పేద మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు.

Read more