గార్గేయపురంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-06-16T06:17:56+05:30 IST
మండలంలోని గార్గేయపురం గ్రామంలో అధికార వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
కార్లు, ట్రాక్టర్, ఫర్నీచర్ ధ్వంసం చేసిన మరో వర్గం
రెండు వర్గాలపై కేసు నమోదు
కర్నూలు, జూన్ 15: మండలంలోని గార్గేయపురం గ్రామంలో అధికార వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎస్సీలు, అగ్రవర్ణాల మధ్య జరిగిన ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. సీఐ శేషయ్య తెలిపిన వివరాల మేరకు.. తాహేర్ కుటుంబంలో మంగళవారం ఓ శుభకార్యం జరిగింది. ఈయన ఇంటి సమీపంలో ఎస్సీ వర్గానికి చెందిన శ్రీకాంత్, మరి కొంత మంది మంగళవారం సాయంత్రం ఇంటి సమీపంలో మద్యం సేవిస్తున్నారు. ఈ విషయంపై తాహేర్, అతని కుటుంబ సభ్యులు శ్రీకాంత్ అనే యువకుడ్ని చితకబాదారు. ఆ తర్వాత చెట్టుకు కట్టేసి కొట్టినట్లుగా మరో వర్గం ఆరోపిస్తుంది. ఈ విషయంపై రెండు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన అనిల్, మరికొంత మంది ఎస్సీ వర్గానికి చెందిన గ్రామ పెద్దలు కలిసి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకుడు వినయ్ రెడ్డి వీరి వివాదంలో జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అప్పటికే పాత మనస్పర్థలు ఉండడంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. వినయ్ రెడ్డి, ఠాగూర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, గోవర్దన్ రెడ్డి మరికొంత మంది కలిసి తమపై దాడి చేశారని అనిల్, ప్రదీప్ చంద్రలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అర్దరాత్రి తర్వాత ఎస్సీ వర్గానికి చెందిన సుమారు 30 మంది యువకులు కలిసి వినయ్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి ఇండ్లపై కర్రలు, రాళ్లతో దాడులు జరిపారు. వినయ్ రెడ్డి ఇంట్లో ఉన్న రెండు ఇన్నో వా కార్లను ధ్వంసం చేశారు. రెండు ట్రా క్టర్లను, రెండు మోటారు సైకిళ్లను పగులగొట్టారు. అంతటితో ఆగకుండా వినయ్ ఇంట్లో ప్రవేశించి ఇంట్లో ఉన్న టీవీలు, ఫ్రిజ్‌లు, సీసీ టీవీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వినయ్ రెడ్డికి గోవర్దన్ రెడ్డిల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థులంతా అక్కడికి చేరడంతో యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమ్మితం ఆసుపత్రికి తరలించారు. అనిల్ ఫిర్యాదు మేరకు వినయ్ రెడ్డి, గోవర్దన్ రెడ్డిలు మరికొంత మంది పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అలాగే వినయ్ రెడ్డి, మరికొంత మంది ఫిర్యాదు మేరకు అనిల్, ప్రదీప్ చంద్ర, ప్రతాప్, రాజేష్ తదితరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఇరువురు వైసీపీ
వర్గీయులే: ఎస్సీ వర్గానికి చెందిన అనిల్, ప్రదీప్ చంద్ర, మరికొంత
మంది.. ఇటు వినయ్ రెడ్డి, గోవర్దన్ రెడ్డిలు కూడా వైసీపీలో కీలకంగా
ఉన్నారు. అయితే.. ఒక్కొక్కరు ఒక్కో వర్గానికి చెందిన వారుగా తెలుస్తోంది.