గురువుల ఢీ.. పిల్లలపై ఒత్తిడి

ABN , First Publish Date - 2022-09-24T05:44:13+05:30 IST

బండి ఆత్మకూరు కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం)లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి ఈ నెల 16న ప్రమాదం జరగడంతో నంద్యాల ఆస్పత్రిలో చేర్పించారు.

గురువుల ఢీ.. పిల్లలపై ఒత్తిడి

కేజీబీవీ, గురుకులాల్లో అవాంఛనీయ ఘటనలు
బయటకు చెప్పుకోలేకపోతున్న బాలికలు
ఉపాధ్యాయుల తీరుతో తీవ్ర ఒత్తిడి
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు


నంద్యాల, ఆంధ్రజ్యోతి: బండి ఆత్మకూరు కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం)లో పదో తరగతి చదువుతున్న  విద్యార్థినికి ఈ నెల 16న ప్రమాదం జరగడంతో నంద్యాల ఆస్పత్రిలో చేర్పించారు. విద్యాశాఖ అధికారులు  ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినిని ఆరా తీశారు. వారితో  తాను ప్రమాదవశాత్తు కాలుజారి భవనంపై నుంచి  పడిపోయానని  చెప్పింది. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు  పరామర్శించేందుకు వెళ్లినప్పుడు  ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని బాధితురాలు చెప్పింది.

ఈ నెల 10న ఆళ్లగడ్డ బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని ఉదయం స్కూలు  ఆవరణలో కుప్పకూలిపోయింది. పాఠశాల నిర్వాహకులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా చిన్న పిల్లలు  విపరీతమైన ఒత్తిడికి,  భయాందోళనలకు గురైనపుడు ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని బట్టి  కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులు ఎంత ఒత్తిడికి లోనవుతున్నదీ  తెలుస్తోంది.  పాఠశాలల్లో ఉపాధ్యాయుల మధ్య నెలకొంటున్న విభేదాలు... పరోక్షంగా పిల్లలపై ఒత్తిడికి కారణమవుతున్నాయని అక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తోంది.
 
బాలికల పాఠశాలలు అన్న కారణంతో..

నంద్యాల జిల్లాలో మొత్తం 8 గురుకుల బాలికల పాఠశాలలు, 27 కేజీబీవీలు ఉన్నాయి. ఇవన్నీ బాలికల పాఠశాలలు కావడంతో బయట వారిని లోపలికి అనుమతించరు. బాలికల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలతో పాఠశాల బయటే ఉండి మాట్లాడాలి. ఇక అధికారులు ఎవరైనా పాఠశాలను పరిశీలించాల్సి వస్తే ఎస్‌వో (స్కూల్‌ ఆఫీసర్‌) అనుమతితో లోపలకు వెళ్లాలి. దీంతో ఈ పాఠశాలల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇదే అవకాశంగా   పాఠశాలల ఎస్‌వోలు, ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులతో పనులు చేయించుకోవడమే కాకుండా.. కాళ్లు పట్టించుకోవడం వంటివి కూడా చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాము చెప్పినట్లు చేయని విద్యార్థినులను మానసికంగా వేధిస్తున్నారని, కొడుతు న్నారనే విమర్శలు ఉన్నాయి. తమకు అనుకూలంగా లేకపోతే ఫెయిల్‌ చేయిస్తామని, టీసీ ఇచ్చి పంపిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు సమాచారం. దీంతో విద్యార్థులు  ఒత్తిడికి లోనవుతూ ఉపాధ్యాయులు చెప్పినట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఉపాధ్యాయులపై ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
 
ఉపాధ్యాయులు గ్రూపులుగా..

కేజీబీవీలు, గురుకులాల్లోని విద్యార్థులకు హాస్టల్‌ వసతి కూడా అదే పాఠశాలల్లో ఉంటుంది. పౌష్టికాహారం, భోజనాలకు సంబంధించిన మెనూపై అక్కడి ఎస్‌వోలదే పెత్తనం. ఎస్‌వోలు లేని పాఠశాలల్లో అక్కడి ఉపాధ్యాయులే ఇన్‌చార్జులుగా విధులు నిర్వహిస్తున్నారు. అసలు అక్కడ ఏం పెడుతున్నారు.. ఎంత పెడుతున్నారు.. అని అడిగే వారు లేరు. దీంతో ఎస్‌వోలు, ఇన్‌చార్జి ఎస్‌వోలు మెనూ పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఇదే విషయంలో ఇక్కడి ఎస్‌వో, ఇన్‌చార్జి ఎస్‌వో, ఉపాధ్యాయులకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. లక్షల రూపాయలు మిగుల్చుకుని అందులో తమకు వాటా ఇవ్వడం లేదన్న అక్కసుతో ఉపాధ్యాయులు గ్రూపులుగా విడిపోతున్నారు. ఇలా గ్రూపులు కట్టిన ఉపాధ్యాయులు తమకే అనుకూలంగా వ్యవహరించాలంటూ విద్యార్థులను వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక గ్రూపు చెప్పినట్లు వినకపోతే మరో గ్రూపు ఉపాధ్యాయులు విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు, సూటిపోటి మాటలతో హింసిస్తున్నట్టు సమాచారం.

ఏళ్లుగా తిష్టవేసి..

కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో కొంత మంది ఏళ్లుగా ఒకే చోట తిష్ట వేసి విధులు నిర్వహస్తున్నారు.  పాఠశాలల్లో ఉండే రాబడే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఒకవేళ ఆరోపణలతో బదిలీలు చేసినా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండతో తప్పించుకుంటున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం బండి ఆత్మకూరు కేజీబీవీ పాఠశాలలోని నలుగురు ఉపాధ్యాయలను ఆరోపణలతో బదిలీ చేశారు. అయినా వారు మాత్రం బదిలీపై వెళ్లకుండా అదే పాఠశాలలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదే పాఠశాలలోని కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాల ప్రారంభం నాటి నుంచి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

 మామూళ్ల మత్తులో అధికారులు..

కేజీబీవీ, గురుకుల పాఠశాలలను ప్రతి వారాంతం, నెల చివర్లో సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. రికార్డుల పరిశీలనతోపాటు మెనూ సరిగా అందుతోందా? వసతులు బాగానే ఉన్నాయా? ఉపాధ్యాయుల తీరు ఎలా ఉంది? అనే కోణంలో అక్కడి విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి.  అలాంటివేమీ జరుగుతున్నట్లు లేదు. పరిశీలనకు వెళ్లే ముందు సంబంధిత అధికారులు ముందే పాఠశాలల ఎస్‌వోలకు సమాచారం అందిస్తున్నారు. దీంతో  వారు అంతా చక్కదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా లోపం కనిపించినా ఎస్‌వోలు మామూళ్లు ముట్టజెప్పి పంపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక కొంతమంది అధికారులు అసలు పాఠశాలలను పరిశీంచకుండానే ఎస్‌వోలు అందించే సొమ్ములు తీసుకుని అంతా బాగుందని రిపోర్టు ఇస్తున్నట్లు సమాచారం.

 మచ్చుకు కొన్ని..

కొలిమిగుండ్ల కేజీబీవీ పాఠశాలలో మెనూ సరిగా పాటించకుండా, ఆహార పదార్థాలను అమ్ముకున్నారన్న ఆరోపణలపై రెండు సంవత్సరాల క్రితం ఎస్‌వోను సస్పెండ్‌ చేశారు. కొత్తగా వచ్చిన ఎస్‌వో మళ్లీ అదే తీరుగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు రావడం గమనార్హం.

బండి ఆత్మకూరు కేజీబీవీలో నాలుగేళ్ల కిందట పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు చోరీకి గురయ్యాయి. పాఠశాలలోని వారే ఈ చోరీకి పాల్పడ్డారని, అది బయటపడకుండా సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారన్న ఆరోపణలు వచ్చాయి.

ఆళ్లగడ్డ గురుకుల పాఠశాలలో 5 సంవత్సరాల క్రితం ఓ బాలిక గర్భం దాల్చింది. దీనిని బట్టి విద్యార్థులపైన అక్కడి ఉపాధ్యాయులకు ఏ మాత్రం పర్యవేక్షణ ఉందో తెలిసిపోతోంది.

పాఠశాలలను ప్రతి వారం పరిశీలిస్తున్నాం

మా పరిధిలో ఉన్న అన్ని గురుకుల పాఠశాలలను విధిగా ప్రతి వారం పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు ఏదైనా సమస్య గానీ, ఇబ్బందిగానీ ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నాం. ఉపాధ్యాయులు వారి విధులు సక్రమంగా నిర్వహించేలా ఆదేశాలు ఇస్తున్నాం. అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.

- శ్రీదేవి, డా.బీఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యా సంస్థల జిల్లా కో-ఆర్డినేటర్‌, నంద్యాల

ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశాం

ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలను జీసీడీవో, అసిస్టెంట్‌ జీసీడీవోలు తనిఖీలు చేపడుతుంటారు. విద్యార్థినులకు ఎదురయ్యే సమస్యలను వారు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు పాఠశాలలోని రహస్య స్థలంలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశాం. వారి సమస్యలను పేపర్‌లో రాసి ఫిర్యాదుల పెట్టెలో వేస్తే పాఠశాల తనిఖీలకు జిల్లా అధికారులు వచ్చినప్పుడు వాటిని పరిశీలిస్తాం. అనంతరం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‌ వేణుగోపాల్‌, సమగ్ర శిక్ష ఏపీవో

కేజీబీవీ ఘటనపై విచారణ

బండిఆత్మకూరు కేజీబీవీ భవనంపై నుంచి విద్యార్థిని స్వప్న కింద పడిన ఘటనపై మండల అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం తహసీల్దార్‌ ఉమారాణి, ఎంపీడీవో వాసుదేవగుప్త, ఏవీవో కరీముల్లాలు ఎస్‌వో అనూరాధను వివరాలు అడిగారు. అనంతరం విద్యార్థులను విచారించారు. ఈ విచారణలో ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, పీఆర్‌ ఏఈ వెంకటయ్య, ఆర్‌ఐ సుప్రియ, కార్యదర్శి నటరాజ్‌ పాల్గొన్నారు.

Read more