కటౌట్‌ తొలగింపుపై టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2022-12-30T00:23:09+05:30 IST

పట్టణంలోని సోమేశ్వర సర్కిల్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ కటౌట్‌ను మున్సిపల్‌ అధికారులు గురువారం తొలగించటంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

 కటౌట్‌ తొలగింపుపై టీడీపీ ఆందోళన
ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు

ఎమ్మిగనూరు, డిసెంబరు 29: పట్టణంలోని సోమేశ్వర సర్కిల్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ కటౌట్‌ను మున్సిపల్‌ అధికారులు గురువారం తొలగించటంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మిగనూరు పర్యటన సమయంలో చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఫొటోలతో కూడిన కటౌట్‌ను టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ దయాసాగర్‌ పట్టణంలోని సోమేశ్వర సర్కిల్‌లో ఏర్పాటు చేశారు. 60 రోజులకు సంబంధించి మున్సిపాలిటీకి పన్నుకూడా చెల్లించారు. అయితే మున్సిపల్‌ అధికారులు రెండు రోజుల క్రితం పట్టణంలోని ఫ్లెక్సీలు, కటౌట్‌లు తొలగించాలని ప్రకటించారు. అంతేగాక ఆయా ప్రాంతాల్లో ఉన్న వివిధ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, కటౌట్‌ను తొలగించారు. అయితే ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ వీజీఏ దయాసాగర్‌, పట్టణనాయకులు సుందరరాజు, రంగస్వామిగౌడ్‌, మల్లా కలీముల్లా, సలీం, సలాం, నరసింహులు, కటారి రాజేంద్ర, దేవేంద్ర, మల్లిలతో పాటు కార్యకర్తలు సోమేశ్వర సర్కిల్‌ వద్ద ఆందోళనకు దిగారు. సచివాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అక్కడి నుంచి చంద్రబాబు కటౌట్‌తో సోమప్ప సర్కిల్‌కు ర్యాలీగా వెళ్లి బైఠాయించారు. ప్రభుత్వానికి, మున్సిపల్‌ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పట్టణ సీఐ మధుసూదన్‌, పోలీసు సిబ్బంది మున్సిపాలిటీకి చేరుకొని అనుమతులు లేకుండా నిరసన, ర్యాలీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డిని కలిసి టీడీపీ కటౌట్‌ను ఎలా తొలగిస్తారని, పన్ను కూడా చెల్లించామని చెప్పారు. స్పందించిన ఆయన పట్టణంలో అన్ని ఫ్లెక్సీలు తొలగించామని, అందులో భాగంగానే కటౌట్‌ తొలగించామని చెప్పారు. 4వ తేదీ వస్తే తిరిగి అనుమతిచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పటంతో శాంతించారు.

Updated Date - 2022-12-30T00:23:09+05:30 IST

Read more